Begin typing your search above and press return to search.

చైనాకు దిమ్మ‌తిరిగిపోయే నిర్ణ‌య‌మిది

By:  Tupaki Desk   |   28 July 2017 7:06 AM GMT
చైనాకు దిమ్మ‌తిరిగిపోయే నిర్ణ‌య‌మిది
X
త‌న పెత్త‌నం చాటుకునేందుకు ఇరుగు పొరుగు దేశాల హ‌ద్దుల్లో అక్ర‌మంగా చొర‌బ‌డుతున్న చైనాకు దిమ్మ‌తిరిగే షాక్ త‌గిలింది. అమెరికా వంటి అగ్ర‌రాజ్యంతో, భార‌త్ వంటి బ‌ల‌మైన దేశంతో క‌య్యానికి కాలు దువ్వుతున్న డ్రాగ‌న్ కంట్రీకి ఓ బుల్లిదేశం అనూహ్య‌మైన ఝ‌ల‌క్ ఇచ్చింది. భార‌త్ పొరుగున ఉన్న శ్రీలంకలోని హంబన్‌ తోట ఓడరేవుపై చైనా పెత్తనాన్ని పరిమితం చేయాలని శ్రీలంక సర్కారు ఎట్టకేలకు నిర్ణయించింది. ఈ మేరకు చైనా ప్రభుత్వరంగ ఓడరేవుల నిర్మాణ సంస్థ మర్చంట్ పోర్ట్ హోల్డింగ్స్‌తో చేసుకున్న ఒప్పందాన్ని మంగళవారం శ్రీలంక క్యాబినెట్ సవరించింది.

శ్రీలంక దక్షిణ తీరంలోని హంబన్‌ తోటలో ప్రపంచంలోకెల్లా అతిపెద్ద షాపింగ్ బజార్లున్న ప్రాంతానికి సమీపంలో రూ.7,399 కోట్ల వ్యయంతో చైనా నౌకాశ్రయాన్ని నిర్మించింది. పైగా ఆ నౌకాశ్రయంలో 80 శాతం వాటాలను తానే తీసుకున్నది. చైనా సిల్క్ రూట్ పునరుద్ధరణ పేరిట ఆసియాలోని పలు దేశాల మీదుగా జల - భూమార్గాలను నిర్మిస్తోంది. దీని వల్ల తమ భూములు పోతాయని స్థానిక శ్రీలంక ప్రజలు ఉద్యమించారు. చైనా చర్యలు హిందూ మహాసముద్ర దేశాల భద్రతకు - సార్వభౌమత్వాలకు భంగకరమని ఇండియాతోపాటు పలు దేశాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. జపాన్ - అమెరికా కూడా వ్యతిరేకించాయి. అటు ప్రజలు - రాజకీయ పార్టీల నుంచి వ్యతిరేకత, అంతర్జాతీయంగా అభ్యంతరాల నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం పునరాలోచనలో పడింది. మంత్రివర్గ సమీక్ష అనంతరం హంబన్‌తోట ఓడరేవుపై చైనా పాత్రను తగ్గించింది. వాణిజ్య కార్యకలాపాలపై మాత్రం హక్కులు కల్పించింది. సైనిక అవసరాల కోసం వినియోగించుకోకుండా కట్టడి చేసింది.