Begin typing your search above and press return to search.

ఎన్నిక‌ల ఫ‌లితం..దేవెగౌడ కుటుంబంలో చీలిక‌లు

By:  Tupaki Desk   |   25 April 2018 6:11 AM GMT
ఎన్నిక‌ల ఫ‌లితం..దేవెగౌడ కుటుంబంలో చీలిక‌లు
X
క‌ర్ణాట‌క ఎన్నిక‌లు ఆస‌క్తిక‌ర మ‌లుపులు తిరుగుతున్నాయి. ఏ పార్టీకి స్ప‌ష్ట‌మైన మెజార్టీ వ‌చ్చే అవ‌కాశాల క‌నిపించ‌ని ఈ ఎన్నిక‌లు అంద‌రిలోనూ ఉత్కంఠ‌ను రేకెత్తిస్తున్నాయి. అయితే ఇది ఆయా పార్టీ నేత‌ల కుటుంబాల్లో చీలిక‌కు కూడా కార‌ణ‌మ‌వుతోంద‌ని తెలుస్తోంది. వచ్చే నెలలో జరుగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ ఏర్పడుతుందని ముందస్తు సర్వేలు పేర్కొంటున్న నేపథ్యంలో ప్రధాన పోటీదారులైన బీజేపీ - కాంగ్రెస్ పార్టీల్లో వణుకు మొదలైంది. హంగ్ అసెంబ్లీ గనుక ఏర్పడితే కన్నడ పీఠం హెచ్‌ డీ దేవెగౌడ - ఆయన తనయుడు కుమారస్వామి ఆధ్వర్యంలోని జనతాదళ్ (ఎస్) దేనని ఊహాగానాలు వెలువడుతున్నాయి.

అయితే ఇదే స‌మ‌యంలో తండ్రి కాంగ్రెస్‌ కు జై.. కుమారుడు బీజేపీకి సై అంటున్నార‌నే చ‌ర్చ తెర‌మీద‌కు వ‌స్తోంది. దేవెగౌడ సిద్దరామయ్య లేని కాంగ్రెస్‌ కు మొగ్గుచూపుతారని.. మరోవైపు ఆయన తనయుడు కుమారస్వామి బీజేపీ వైపు మొగ్గుచూపేందుకే ఇష్టపడుతారని ఓ జేడీఎస్ ఎమ్మెల్యే తెలిపారు. 2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీతో జట్టుకట్టొద్దని ఎస్పీ - బీఎస్పీ - ఎన్సీపీ - లెఫ్ట్ - టీడీపీ పార్టీల నాయకులు తమను కోరుతున్నారని పలువురు జేడీఎస్ నాయకులు పేర్కొంటున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడే మూడో కూటమిలో భాగస్వామిగా ఉండాలని వారంతా విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే దేవెగౌడ రాజకీయ చతురుడని.. ఆయన వ్యూహాలు ఆయనకు ఉంటాయని గౌడ కుటుంబాన్ని స‌న్నిహితంగా ఉన్న‌ వ్యక్తి తెలిపారు. మొత్తంమీద జాతీయ పార్టీలయిన బీజేపీ - కాంగ్రెస్‌ లు తమకు సంపూర్ణ మెజార్టీ రావాలని ఆకాంక్షిస్తుండగా... జేడీఎస్ మాత్రం హంగ్ అసెంబ్లీ ఏర్పడాలని.. తాము కింగ్‌ మేకర్లం కావాలని కోరుకుంటోంది.

తాజాగా వెలువడ్డ ముందస్తు ఎన్నికల సర్వేల అంచనాలు దశాబ్దకాలంగా అధికారానికి దూరంగా ఉన్న జేడీఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నాయి. త్రిశంకు సభ ఏర్పడుతుందని సర్వేలు పేర్కొంటున్న నేపథ్యంలో అధికారం జేడీఎస్‌ కు అప్పగించి తాము ప్రాధాన్యం లేకుండా మిగిలిపోవాల్సి వస్తుందని ముఖ్యమంత్రి సిద్దరామయ్య - బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప శిబిరాలు ఆందోళన చెందుతున్నాయి. మరోవైపు హంగ్ ఏర్పడిన పక్షంలో సిద్దరామయ్య - యడ్యూరప్పల పెత్తనం పోయి.. తమకు మంచి పదవులు దక్కుతాయని బీజేపీ - కాంగ్రెస్ పార్టీల ద్వితీయ శ్రేణి నాయకులు లోలోన సంతోషపడుతున్నారు.

కాగా త్రిశంకు సభ ఏర్పడితే సిద్దరామయ్య - యడ్యూరప్పల శకం ముగిసినట్టేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దేవెగౌడ - కుమారస్వామితో ముఖ్యమంత్రి సిద్దరామయ్య వ్యక్తిగత వైరం కొనసాగిస్తున్నారని.. ఇది కాంగ్రెస్‌ కు నష్టం చేస్తుందని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. బీజేపీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. 2006-07లో అధికార మార్పిడి సందర్భంగా ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తుచేసుకుంటున్న యడ్యురప్ప.. జేడీఎస్‌ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు యడ్యూరప్ప అంటే జేడీఎస్‌ కు కూడా గిట్టడం లేదు. `ఒకవేళ మేం 113 స్థానాలు సాధించలేకపోతే యడ్యూరప్ప సీఎం కాలేరు. గౌడలు ఆయనను అస్సలు అంగీకరించరు. అప్పుడు యడ్యురప్పను పక్కకు తొలగించడం మాకు సులభం అవుతుంది. ఆయన ప్రస్తుతం 75వ పడిలో ఉన్నారు` అని బీజేపీ నాయకులు చ‌ర్చించుకుంటుండ‌టం గ‌మ‌నార్హం. 2019 ఎన్నికల దృష్ట్యా జేడీఎస్ కాంగ్రెస్‌ తో కలువకుండా ప్రధాని మోడీ - అమిత్‌ షా వ్యూహం రచిస్తారని బీజేపీ నేతలు నమ్ముతున్నారు.