Begin typing your search above and press return to search.

చిక్కుల్లో న‌లుగురు టీఆర్ ఎస్ ఎమ్మెల్సీలు

By:  Tupaki Desk   |   18 Dec 2018 5:34 PM GMT
చిక్కుల్లో న‌లుగురు టీఆర్ ఎస్ ఎమ్మెల్సీలు
X
తెలంగాణలో అధికార టీఆర్ ఎస్ పార్టీకి చెందిన న‌లుగురు ప్ర‌జాప్ర‌తినిధులు `అధికారికంగా` చిక్కుల్లో ప‌డ్డారు. టీఆర్ ఎస్ త‌ర‌ఫున గెలిచిన అనంత‌రం పార్టీ ఫిరాయించిన స‌ద‌రు ఎమ్మెల్సీలకు నోటీసులు జారీ అయ్యాయి. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్సీలకు తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్ నోటీసులు ఇచ్చారు. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఎమ్మెల్సీలకు నోటీసులు పంపారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్సీలు భూపతిరెడ్డి - కొండా మురళి - యాదవరెడ్డి - రాములు నాయక్ లు నోటీసులు అందుకున్నారు.

కాగా, పార్టీ ఫిరాయించిన నలుగురు శాసనమండలి సభ్యులను అనర్హలుగా ప్రకటించాలని కోరుతూ మండలి చైర్మన్ స్వామిగౌడ్‌ కు టీఆర్ ఎస్ ఫిర్యాదు చేసింది. సోమవారం ఉదయం మండలిలో చైర్మన్ స్వామిగౌడ్‌ కు చీఫ్‌ విప్ పాతూరి సుధాకర్‌ రెడ్డి - విప్ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి వినతిపత్రం అందచేశారు. అనంతరం పాతూరి సుధాకర్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. టీఆర్ ఎస్ నుంచి ఎమ్మెల్సీలుగా ఎన్నికైన భూపతిరెడ్డి - యాదవరెడ్డి - కొండా మురళి - రాములునాయక్ పార్టీ మారారని తెలిపారు. పార్టీ మారిన ఈ నలుగురు ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని మండలి చైర్మన్‌ కు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. పార్టీ నియామవళికి భిన్నంగా వారు వ్యవహరించారన్నారు. పార్టీ మారినట్టు వారు ఇచ్చిన ప్రకటనలను ఫిర్యాదులతోపాటు జత చేసినట్టు వివరించారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే వారు పార్టీ మారారని పాతూరి ఆరోపించారు. నలుగురిలో ఇద్దరు స్థానిక సంస్థల నియోజకవర్గాల నుంచి - ఒకరు ఎమ్మెల్యేల కోటాలో - మరొకరు గవర్నర్ కోటాలో నామినేట్ అయినట్టు తెలిపారు. వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని - అనర్హత వేటువేయాలని కోరారు.

టీఆర్ ఎస్ ఫిర్యాదు నేప‌థ్యంలో మండ‌లి చైర్మ‌న్ స్వామిగౌడ్ వారికి నోటీసులు జారీచేశారు. స‌ద‌రు జంపింగ్ నేత‌లు ఇచ్చే స‌మాధానం - టీఆర్ ఎస్ ఇచ్చే కౌంట‌ర్‌ ను బ‌ట్టి వీరి ఎమ్మెల్సీ ప‌ద‌వి ఆధార‌ప‌డి ఉంటుంది. అయితే, ప‌క్కా ఆధారాలు ఉన్నందున వారి ప‌ద‌వి పోవ‌డం ఖాయ‌మ‌ని టీఆర్ ఎస్ నేత‌లు పేర్కొంటున్నారు.