Begin typing your search above and press return to search.

బురఖా వేసుకోను.. క్రీడాకారిణి సంచలనం..

By:  Tupaki Desk   |   13 Jun 2018 6:32 AM GMT
బురఖా వేసుకోను.. క్రీడాకారిణి సంచలనం..
X
ప్రపంచంలోనే అత్యంత కఠిన నిబంధనలు గల్ఫ్ దేశాల్లో ఉంటాయంటారు. ఆ నిబంధనల వల్లే అక్కడ జీవించడం చాలా కష్టమని చాలా మంది అభిప్రాయపడుతుంటారు.. తాజాగా గల్ఫ్ దేశాల్లో ప్రముఖమైన ఇరాన్ లో అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు.. ఈ టోర్నమెంట్ లో పాల్గొనడానికి భారత్ నుంచి బృందం కూడా వెళుతోంది. అందులో మేటి చెస్ క్రీడాకారిణి సౌమ్య స్వామినాథన్ ఇరాన్ పెట్టిన నిబంధనలు తోసిరాజని ఏకంగా టోర్నీ నుంచే వైదొలగడం హాట్ టాపిక్ గా మారింది.

ఇరాన్ లో మహిళలు బురఖా ధరించి బహిరంగ కార్యక్రమాల్లో - క్రీడల్లో పాల్గొనాలనే నిబంధనలున్నాయి. వీటిని తప్పనిసరిగా పాటించాలి. ఇరాన్ కు వచ్చిన విదేశీయులు సైతం తల వరకూ బుర్ఖాలాంటి వస్త్రాలు ధరించాలనే నిబంధన ఉంది. అక్కడ ఆడాలంటే తప్పనిసరిగా ఆ దేశ పద్ధతులు పాటించాలనే నిబంధన పెట్టడంతో సౌమ్య వైదొలిగింది. ఈ విషయాన్ని ఫేస్ బుక్ ద్వారా వెల్లడించింది.

‘జూలై 26 నుంచి ఆగస్టు 4వరకూ జరగాల్సిన ఆసియన్ నేషన్స్ కప్ చెస్ చాంపియన్ షిప్ 2018లో జాతీయ జట్టు తరఫున అర్హత సాధించాను. కానీ ఇందులో ఆడాలంటే ఖచ్చితంగా తలవరకూ ముసుగుకానీ, లేదా బుర్ఖా కానీ ధరించాల్సిందేనని అక్కడి ప్రభుత్వం ఆదేశించింది. భారతదేశ పౌరురాలిగా .. వ్యక్తిగతంగా నా హక్కులకు భంగం కలిగేలా ఉన్న ఇరాన్ సంప్రదాయం పాటించాల్సిందేనన్న నిబంధనను ఒప్పుకోలేకపోయాను.. ఈ నేపథ్యంలో నాకు కనిపించిన ఒకే ఒక్క దారి పోటీనుంచి వైదొలడం ’ అంటూ సౌమ్య టోర్నీ నుంచి నిష్క్రమించి సంచలనం సృష్టించింది.

ఇలాంటి అంతర్జాతీయ టోర్నీలో నిబంధనలు పెట్టడం సరికాదని..కావాలంటే ఓ యూనిఫాం పెడితే అందరూ అవే వేసుకుంటారని సౌమ్య అభిప్రాయపడింది. ఇలా మత సంబంధిత నియమాలు పాటించి క్రీడాకారులకు ఆటంకం కలిగించడం సమంజసం కాదని స్పష్టం చేసింది.. అందరిలా సర్దుకుపోయి ఈవెంట్లలో తాను పాల్గొనలేనని సౌమ్య ప్రకటించి ఇరాన్ కు షాక్ ఇచ్చింది.