Begin typing your search above and press return to search.

సంధి ఏడుపు ​ఎప్పుడో ఏడవాల్సింది మోడీ

By:  Tupaki Desk   |   28 Nov 2015 6:32 AM GMT
సంధి ఏడుపు ​ఎప్పుడో ఏడవాల్సింది మోడీ
X
అద్భుతమైన విజయం అంతులేని ఆత్మవిశ్వాసాన్ని తెచ్చి పెట్టటమే కాదు.. అహంభావాన్ని తీసుకొస్తుంది. అద్భుతమైన విజయాలు సాధించి కూడా విన​మ్రంగా ఉండటం చా​లా కొద్ది మందికే సాధ్యం. అలాంటి కొద్దిమందిలో ప్రధాని మోడీ ఒకరు అవుతారని రాజకీయ పండితులు అంచనా వేశారు. అయితే.. మోడీని దగ్గరగా పరిశీలించిన వారు మాత్రం అది సాధ్యం కాదనే అనుకున్నారు. వారి మాటే చివరకు నిజమైంది. దాదాపు 18 నెలల కిందట సార్వత్రిక ఎన్నికలు జరగటం.. ఆ ఎన్నికల్లో దేశ ప్రజలు బంపర్ మెజార్టీతో బీజేపీకి పాలనా పగ్గాలు అందించటం తెలిసిందే.

కమలనాథులు కలలో కూడా ఊహించని రీతిలో వచ్చి పడిన అద్భుత విజయం.. వారిలో అంతులేని ఆత్మవిశ్వాసాన్ని.. అహంభావాన్ని తీసుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీకి కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా దేశ ప్రజలు శిక్షించటాన్ని తన గొప్పతనంగా కమలనాథులు భావించారే కానీ.. పదేళ్ల కాంగ్రెస్ పాలన మీద ఉన్న కోపమని మాత్రం అర్థం చేసుకోలేదు. వాపును బలుపుగా భావిస్తే ఎంత ఇబ్బందన్న విషయం.. ఢిల్లీ.. తాజాగా బీహార్ ఎన్నికల ఫలితాలు చెప్పకనే చెప్పేశాయి.

మోడీ హవా దేశమంతా సాగుతుందన్న ప్రచారంలో నిజం ఎంత? అన్న సందేహా​నికి ఢిల్లీ - బీహార్ ఎన్నికలు సమాధానంగా నిలిచాయి. ఢిల్లీలో కానీ బీహార్ లో వచ్చిన అసెంబ్లీ ఫలితాలు ఏవీ కలలో కూడా ఊహించనంతన్న​ ఘోరం అన్న​విషయం మర్చిపోకూడదు. ప్రజాతీర్పు ఇలా ఉండటానికి స్థానిక అంశాలతో పాటు.. మోడీ సర్కారు పని తీరు కూడా ఎంతోకొంత కారణమ​ని చెప్పడానికి సందేహపడాల్సిన అవసరం కూడా లేదు.

కాంగ్రెస్ మార్క్ పాలకు పూర్తి భిన్నంగా.. స్ఫూర్తివంతంగా.. కొత్త రాజకీయాల్ని నేర్పేలా మోడీ పాలన ఉంటుందని భావించారు. విధానాల పరంగా వెనువెంటనే మార్పులు చోటు చేసుకోకున్నా.. విపక్షాల విషయంలో మోడీ వ్యవహరించే తీరు ఆదర్శప్రాయంగా ఉండటంతో పాటు.. భవిష్యత్ తరాలకు ఒక ఉదాహరణగా నిలిచే అవకాశం ఉందన్న అభిప్రాయం సార్వత్రిక ఎన్నికల సమయంలో వ్యక్తమైంది. కానీ.. అందుకు భిన్నమైన ధోరణి ప్రధాని మోడీ ప్రదర్శించారనే చెప్పాలి.

గడిచిన 18 నెలల్లో ప్రధాన రాజకీయ పక్షమైన కాంగ్రెస్ అధినేత సోనియాతో పాటు.. మాజీ ప్రధాని మన్మోహన్ ను కలిపి కూర్చొబెట్టి మాట్లాడింది లేదన్న విషయం మర్చిపోకూడదు. లోక్ సభలో తిరుగులేని ​ఆ​ధిక్యం ఉన్నప్పటికీ.. రాజ్యసభలో బలమే లేదన్న విషయాన్ని మోడీ ఎందుకు మర్చిపోయారో అర్థం కాదు. కొన్ని కీలకమైన బిల్లుల విషయంలో యూపీఏ సర్కారు ఆచితూచి వ్యవహరిస్తూ.. నాటి ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ సహకారంతో బండి లాగించటాన్ని మర్చిపోకూడదు. ఇలాంటి సాంకేతిక అంశాల మీద మోడీ దృష్టి పెట్టి.. తనదైన శైలిలో వారిని ఆకట్టుకుంటారని అందరూ భావించారు. కానీ.. విజయం తీసుకొచ్చిన అహంభావం కారణం కావొచ్చు.. లేదంటే సమీప భవిష్యత్తు​లో​ తమకు తిరులేదన్న అంచనా అయి ఉండొచ్చు.. కాంగ్రెస్ సహా విపక్షాలతో సత్ సంబంధాలు నెరపటంపై పెద్దగా దృష్టి సారించలేదు. బీహార్ ఎన్నికల ఫలితాలతో.. రానున్న రోజులు మరింత గడ్డుగా ఉండనున్నాయని.. ప్రభుత్వాన్ని నడపాలన్నా.. పాలనలో సంస్కరణలు తీసుకురావాలంటే విపక్షాల చేయూత ఎంతోఅవసరమన్న విషయం మోడీకి అర్థమైంది. అన్నింటికి మించి వస్తుసేవల బిల్లు ఆమోదం పొందేందుకు కాంగ్రెస్ చేయూత తప్పనిసరి అన్న విషయం బోధ పడటంతో మోడీ మాటలో తేడా వచ్చేసింది. ​తొలిసారి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ.. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ ఇద్దరిని తేనీటికి ఆహ్వానించాలన్న విషయం హ​ఠాత్తుగా గుర్తుకు వచ్చేసింది. ఛాయ్ పే చర్చా అంటూ కొందరికి మాత్రమే పరిమితం చేసిన మోడీ.. అందుకు భిన్నంగా సోనియాను ఆహ్వానించటం ద్వారా.. సంధికి సంబంధించి ద్వారాలు తెరిచారు. నిజానికి మోడీ అండ్ కోకు ఏ మాత్రం ముందుచూపు ఉన్నా.. ఈ సంధి కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పడిన మొదట్లోనే చేసుకొని ఉంటే.. మోడీ దార్శనికుడన్న పేరు ప్రఖ్యాతులు పోగుపడేవి. ఇప్పుడా పేరుతో పాటు.. ప్రతిపక్షాలు నెత్తి మీద ఎక్కేందుకు అవకాశాన్ని కల్పించాయని చెప్పొచ్చు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని.. ఎప్పుడు ఎవరికి అవకాశం వస్తుందో తెలీని పరిస్థితుల్లో.. ఒదిగి ఉండటానికి మించింది మరొకటి లేదన్న సత్యాన్ని మోడీ విస్మరించటమే.. తాజా పరిస్థితి కారణంగా చెప్పొచ్చు. ఇప్పటి సంధి అధికారపక్షానికి మరో అప్షన్ లేకనే అన్న విషయాన్ని మర్చిపోకూడదు.