Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ పొత్తు వ్యాఖ్య‌ల‌పై వీర్రాజు క్లారిటీ వ‌చ్చేసింది

By:  Tupaki Desk   |   23 Jan 2018 8:29 AM GMT
జ‌గ‌న్ పొత్తు వ్యాఖ్య‌ల‌పై వీర్రాజు క్లారిటీ వ‌చ్చేసింది
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల ఆకాంక్ష అయిన ప్రత్యేక హోదా ఇస్తే తాను బీజేపీతో కలసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నానన్న వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు - ఎమ్మెల్సీ సోము వీర్రాజు స్పందించారు. హోదాతో ముడిపడి ఎన్నికల పొత్తులు - రాజకీయాలు ఉండవని స్పష్టం చేశారు. జగన్ వ్యాఖ్యలపై బీజేపీ త‌ర‌ఫున వివరణ ఇస్తూ....ప్రత్యేక హోదాను అనుసరించి పొత్తులుండవని వ్యాఖ్యానించారు. అయినా మేం టీడీపీతోనే ఉన్నాం. విడిపోలేదు కదా? అని ప్రశ్నించారు.

ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు భవిష్యత్తులో ఆ హోదా ఉండదని - కమిషన్ల సిఫార్సు వల్ల ఇకపై ఆ ప్రయోజనాలు రావని - హోదా ఇచ్చే కమిటీ ఇప్పుడు లేదన్న విషయం గుర్తుంచుకోవాలని వీర్రాజు వ్యాఖ్యానించారు. ఈ విషయం రోజూ పత్రికలు చదివే అందరికీ తెలుసనన్నారు. ‘రాష్ట్రానికి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ఇచ్చిన హామీలన్నీ అమలవుతున్నాయి. హోదాను మించిన ప్యాకేజీ ఇస్తామన్నాం. ఇస్తున్నాం. ఇప్పటికి 4 వేల కోట్ల రూపాయలిచ్చాం. మరో రెండు - మూడు నెలల్లో మరో 2 - 3 వేల కోట్లు ఇస్తారన్న సమాచారం ఉంది. తర్వాత మరో 4 వేల కోట్లు ఇస్తామంటున్నారు.` అని వీర్రాజు క్లారిటీ ఇచ్చారు.

కాగా, ప్రత్యేక హోదా అంశాన్ని జగన్ ఇప్పుడు తెరపైకి తేవడం విడ్డూరమని బీజేపీ నాయకురాలు పురందేశ్వరి అన్నారు. జగన్ వ్యాఖ్యలపై బీజేపీ నాయకురాలు పురందేశ్వరి స్పందించారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ హోదాతో కలిగే ప్రయోజనాలన్నీ కేంద్రం ఇప్పటికే కల్పిస్తోందన్నారు. ఏపీకి పెద్ద ఎత్తున కేంద్రం నిధులు అందజేస్తోందన్నారు. ప్ర‌త్యేక హోదాకు సాంకేతిక‌ప‌ర‌మైన అవ‌రోధాలు ఉన్నాయ‌న్నారు.