Begin typing your search above and press return to search.

ఆయన్నెందుకు గెలుకుతారు సామీ!

By:  Tupaki Desk   |   19 Nov 2017 7:04 AM GMT
ఆయన్నెందుకు గెలుకుతారు సామీ!
X
కొన్నాళ్లుగా ఏపీ బీజేపీ నేతలు తమ మిత్రపక్షం టీడీపీని - ఆ పార్టీ అధినేత - సీఎం చంద్రబాబు నాయుడిని బహిరంగంగా విమర్శించడం, దుమ్మెత్తిపోయడం మానేశారు. ఎందుకో ఏమో కానీ చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. చంద్రబాబు పేరెత్తితే ఒంటికాలిపై లేచే కొందరు ఏపీ బీజేపీ నేతలు కూడా కొన్నాళ్లుగా కామయిపోయారు. అందులో ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఒకరు.. గతంలో సోము వీర్రాజు ప్రెస్ మీట్ పెడుతున్నారంటే చాలు చంద్రబాబుకు భయం పట్టుకునేదట... ఏం మాట్లాడుతారో - తననేం తిడతారో - తనపై ఏం ఆరోపణలు చేస్తారో.. మళ్లీ మోడీ దగ్గరకు ఏం మోసుకెళ్తారో అని భయపడేవారట. అలాంటిది కొన్నాళ్లుగా వీర్రాజు ఏమీ అనకపోవడంతో చంద్రబాబు కాస్త రిలాక్సయ్యారు. కానీ... తాజాగా ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఏపీ బీజేపీ నేతలపై విమర్శలు చేయడంతో సోము వీర్రాజుకు ఆగ్రహం వచ్చింది. తెలుగుదేశం పార్టీని - చంద్రబాబును ఏకి పడేశారు.

బీజేపీ నాయకులు పురందేశ్వరి - కన్నా లక్ష్మీనారాయణలు పార్టీలు మారిన డూప్లికేట్ నాయకులంటూ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు విమర్శలు చేయడంతో సోము వీర్రాజు తీవ్రంగా తప్పుపట్టారు. పార్టీలు మారినందుకు పురందేశ్వరి - కన్నా డూప్లికేట్ అయితే మరి వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన వారిని ఏమనాలని ప్రశ్నించారు. వైసీపీ నుంచి వచ్చిన డూప్లికేట్లకు మంత్రి పదవులు ఎలా ఇచ్చారని వీర్రాజు ప్రశ్నించారు.

అక్కడితో ఆగని ఆయన చంద్రబాబు గత చరిత్రనంతా తవ్వి తీశారు. కాంగ్రెస్‌ లో ఉంటూ సొంత మామ ఎన్టీఆర్‌ నే ఓడిస్తానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారని ప్రశ్నించారు. అంతేకాదు.. పోలవరంపైనా చంద్రబాబు ప్రభుత్వానికి వాతలు పెట్టారు. పోలవరంపై మాట్లాడే హక్కు బీజేపీ నేతలకూ ఉందన్నారు. పోలవరం ప్రాజెక్ట్ గురించి ఇంజనీర్లు మాత్రమే మాట్లాడాలా అని ప్రశ్నించారు. మొత్తానికి ఏ నోటికైతే చంద్రబాబు భయపడతారో ఆ నోటికి మళ్లీ పనిచెప్పేలా అయ్యన్న ఛాన్సివ్వడంతో టీడీపీ నేతలంతా తలలు పట్టుకుంటున్నారట. మంత్రివర్గ సహచరులు కొందరు అయ్యన్నతో ‘ఆయన్నెందుకు గెలుకుతారు సార్’’ అన్నారట కూడా.