సోము వీర్రాజు.. తెలుగోడు కాదు భయ్

Wed Feb 14 2018 21:00:01 GMT+0530 (IST)

తెలంగాణకు.. ఆంధ్రాకు ఉన్న వ్యత్యాసం ఏమిటని అడుగుతారు చాలామంది. సింఫుల్ గా చెప్పాలంటే తెలంగాణలో సోము వీర్రాజు లాంటోళ్లు ఉంటే అస్సలు ఊరుకోరు. అదే.. ఏపీలో అయితే పెద్దగా పట్టించుకోరు. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా.. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల తర్వాతే పార్టీ అయినా.. ఇంకేదైనా. కానీ.. ఏపీలో మాత్రం అందుకు భిన్నం. మొదట వ్యక్తిగత ప్రాధాన్యతలు.. పార్టీ.. ఆ తర్వాతే ప్రజా ప్రయోజనాలైనా.. రాష్ట్ర ప్రయోజనాలైనా.ఈ కారణంతోనే తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో పార్టీలకు అతీతంగా తెలంగాణ నేతలు చెలరేగిపోతే.. ఏపీ నేతలు మాత్రం పార్టీకి విశ్వాసపాత్రులుగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ పార్టీ ఏపీలో సర్వనాశనమయ్యేలా వ్యవమరించారు.

ఇప్పుడు ఇలాంటి వైఖరినే అనుసరిస్తున్నరు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. పార్టీ మీద అభిమానం ఉండొచ్చు కానీ.. మూర్ఖ ప్రేమ ఉండకూడదు. పార్టీకి నమ్మినబంటుగా నమ్మ బలకాలన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించటమే కాదు.. ఆంధ్రోళ్లకు చిరాకు తెప్పించేలా మారింది.

విభజన నేపథ్యంలో పీకల్లోతు ఆర్థిక ఇబ్బందుల్లో ఏపీ కూరుకుపోయి ఉన్న వేళ.. కేంద్రం నుంచి వీలైనంత ఎక్కువ సాయం పొందేలా నేతలు నడుం బిగించాల్సి ఉంది. అందుకు భిన్నంగా వచ్చిన పైసా.. అరపైసల్ని రూపాయిలుగా ఫీల్ అవుతూ చేస్తున్న ప్రకటనలు మంట పుట్టిస్తున్నాయి. ఏపీ విభజన నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక లోటును తీరుస్తామని విభజన చట్టంలో పేర్కొన్నారు. అయితే.. చట్టంలో పేర్కొన్న దానికి భిన్నంగా నవ్యాంధ్ర రెవెన్యూ లోటును మోడీ సర్కారు పట్టించుకోవటం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.

ఇందుకు తగ్గట్లే ఏపీ సర్కారు కొన్ని గణాంకాల్ని ఉదహరిస్తోంది. తమ వాస్తవిక రెవెన్యూలోటును మోడీ సర్కారు పూడ్చలేదని చెబుతుంటే.. వీర్రాజు మాత్రం నవ్యాంధ్ర లోటును వీలైనంత తక్కువ చేసి చూపించి మాట్లాడటం పలువురికి ఆగ్రహం తెప్పిస్తోంది. నవ్యాంధ్ర రెవెన్యూ లోటు రూ.4600 కోట్లు మాత్రమేనని.. అయితే రాష్ట్ర సర్కారు అమలు చేస్తున్న రుణమాఫీ.. సంక్షేమ పథకాలు కలిపి రూ.16వేల కోట్లుగా చూపిస్తున్నారని విమర్శిస్తున్నారు.

ఏపీకి అన్ని ఇస్తున్నా బీజేపీని నిందించటం కొందరు పనిగా పెట్టుకున్నారని ఆయన మండి పడుతున్నారు. ఒకవేళ సోము చెప్పినట్లుగా బీజేపీ ఏపీకి ఇవ్వాల్సినవన్నీ ఇస్తుందని అనుకుందాం. మరి.. ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వనట్లు? అన్న క్వశ్చన్ కు సూటిగా సమాధానం చెబితే సరిపోతుంది. ప్రత్యేక హోదా మరీ పెద్దది అనుకుంటే.. రైల్వే జోన్ ముచ్చట ఇప్పటివరకూ ఏమైంది? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పగలరా? అది కూడా కష్టమనుకుంటే.. ఏపీ రాజధాని అమరావతికి కేంద్రం ఏం సాయం ఇవ్వనుంది?  సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో అమరావతిని ఢిల్లీకి ధీటుగా తయారు చేస్తామని మోడీ నమ్మబలికిన మాట సంగతేమిటి? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. వీటికి సమాధానాల్ని సోము ఇస్తారా? . మోడీని కొలవటమే ధ్యేయంగా పెట్టుకున్న ఆయన.. సొంత రాష్ట్ర ప్రయోజనాలకు చేటు కలిగేలా మాట్లాడుతున్న ఆయనను ఆంధ్రోడంటే నమ్మగలమా?