Begin typing your search above and press return to search.

మోడీ లేకుంటే చంద్రబాబు జీరోనే..

By:  Tupaki Desk   |   20 Jun 2018 7:42 AM GMT
మోడీ లేకుంటే చంద్రబాబు జీరోనే..
X
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి నేటికి సరిగ్గా నాలుగేళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగానే దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. విశాఖపట్నంలో జరిగిన ‘మహాసంపర్క్ అభియాన్’ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సీఎం చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పాలనలో చంద్రబాబు లయ తప్పారని ఎద్దేవా చేశారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ లేకుంటే చంద్రబాబు జీరో అని పేర్కొన్నారు. చంద్రబాబు అసమర్ధ, అవినీతి పాలనపై బీజేపీ పోరాటం చేస్తుందని తెలిపారు.

ఇచ్చిన హామీల విషయంలో బీజేపీ కట్టుబడి ఉందని.. పోలవరం - రైల్వేజోన్ - కడప ఉక్కు పరిశ్రమ హామీలను 2019 కంటే ముందే అమలు చేస్తామని సోము వీర్రాజు స్పష్టం చేశారు. పోలవరం ముంపు గ్రామాలను కూడా పార్లమెంట్ చర్చ సందర్భంగా సీఎం రమేష్ అడ్డుకున్నాడని.. అలాంటి టీడీపీ వారు తమపై నిందలు వేయడం విడ్డూరంగా ఉందన్నారు.

‘రైతు రుణమాఫీ అమలు కాలేదు.. నిరుద్యోగ భృతి ఏమైంది.? చెట్టు నీరు అతీగతీ లేదు..’ ఇలా టీడీపీ మేనిఫెస్టోలో హామీలు ఏమయ్యాయో చెప్పాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వంలో ఏ శాఖలో చూసినా అవినీతి రాజ్యమేలుతోందని మండిపడ్డారు. కార్మికులు ఉన్న చోట కాకుండా లేని చోట విజయవాడలో ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు చేస్తే ఏం ప్రయోజనమని సోము ప్రభుత్వాన్ని నిలదీశారు.

వీఆర్వోలతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నాడని.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల శ్రమను చంద్రబాబు దోచుకుంటున్నారని సోము వీర్రాజు చంద్రబాబుపై మండిపడ్డారు. సమస్యలు పరిష్కరించమని కోరితే నాయి బ్రాహ్మణులను కూడా బాబు బెదిరిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప ఉక్కు ఫ్యాక్టరీపై నివేదికను పంపిస్తే దానిపై ప్రభుత్వమే సమాధానం ఇవ్వలేదని.. ఇప్పుడు కేంద్రంపై నిందలు మోపుతున్నారని నిలదీశారు. సీఎం రమేష్ ఇంటి సమీపంలోనే కడప జిల్లాలో కాల్వలు తవ్వితే చుక్క నీరు రాలేదని.. నిధులను సొంతానికి వాడుకుంటున్నారని ఆరోపించారు.

ఇక రాష్ట్రంలోని సమస్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నేడు - రేపు - శ్రీకాకుళం - 22 - 23 తేదీల్లో విజయనగరం.. 24న పోలవరంలో పర్యటిస్తారని సోము వీర్రాజు పేర్కొన్నారు.