Begin typing your search above and press return to search.

బాబు సంగతి ఓకే.. మీ సంగతేంటి సోమూజీ!

By:  Tupaki Desk   |   23 Feb 2018 8:32 AM GMT
బాబు సంగతి ఓకే.. మీ సంగతేంటి సోమూజీ!
X
సోము వీర్రాజు మళ్లీ మీడియా ముందుకు వచ్చి మరోసారి చంద్రబాబునాయుడు వైఫల్యాల మీద రెచ్చిపోయారు. ప్రత్యేకహోదా అనే అంశాన్ని ఒకప్పట్లో స్వయంగా చంద్రబాబునాయుడే ఏ రకంగా మంటగలిపేశారో ఆయన తనకు గుర్తున్నంత వరకు ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేశారు. బాబు ఆరోజు మాటల ప్రకారం.. ఆయనకే అన్ని శిక్షలూ పడుతాయని హెచ్చరించారు.

అప్పట్లో హోదా మాటెత్తితే జైలుకే అన్నారని - హోదాకు ప్యాకేజీకి కేవలం మూడుకోట్లే తేడా అన్నారని - హోదా ఉన్నందువల్ల ఈశాన్య రాష్ట్రాలు ఏమీ అభివృద్ధి చెందలేదని తానే చెప్పారని సోము గుర్తు చేశారు. ప్రత్యేకహోదా డిమాండ్ తో జరిగే బంద్ కు సహకరించవద్దని చంద్రబాబు పిలుపు ఇచ్చినట్లు కూడా చెప్పారు.

అయితే ఇక్కడ ప్రజలు చేస్తున్న వినతి ఒక్కటుంది. ప్రత్యేకహోదా అనే అంశం ప్రజల్లో సజీవంగా ఉన్న రోజుల్లో ఆ డిమాండ్ ను సమూలంగా చంపేయడానికి చంద్రబాబునాయుడు ఎన్ని ద్రోహాలు చేశారో ప్రజలకు చాలా బాగా తెలుసు. సోము వీర్రాజు చెప్పిన విషయాలకంటె ఎక్కువగా కూడా ప్రజలకు తెలుసు కాకపోతే.. అవన్నీ ఇప్పుడు అనవసరం! కేంద్రంలోని భాజపా సర్కారు తరఫున వకాల్తా పుచ్చుకుంటున్న వ్యక్తిగా సోము వీర్రాజు ప్రత్యేక హోదాకు చంద్రబాబు ఏం ద్రోహం చేశాడనే సంగతి కాదు.. ఆయన అంత ద్రోహం చేసినా కూడా ఈయన (సోము వీర్రాజు) ప్రత్యేక హోదాను కేంద్రంనుంచి తీసుకురాగలడా లేదా? ఇవాళ ఈ రాష్ట్రానికి ప్రత్యేకహోదా అవసరమా? కాదా? తన మాట ఏమిటో ఆయన చెప్పాలి. చంద్రబాబు మాటల రికార్డును మళ్లీ వల్లించడానికి ఈయన ప్రెస్ మీట్ మనకెందుకు? ఈయన వాదనేంటో చెబితే, తద్వారా భాజపా ఆలోచన ఏంటో చెబితే - తద్వారా కేంద్రం విధానం ఏంటో సంకేతాలు ఇస్తే.. ఆ జాతీయ పార్టీని కూడా ఆంధ్రప్రదేశ్ లో సమూలంగా సమాధి చేయాలా.. లేదా కొనఊపిరితో వదిలిపెట్టాలా.. లేదా, వైభవదశ కల్పించి నెత్తిన పెట్టుకోవాలా అనేది ప్రజలు నిర్ణయించుకుంటారు.

ఇప్పటికీ సోము వీర్రాజు చెబుతున్న మాటలను గమనిస్తే.. ప్రత్యేకహోదాను పాతిపెట్టిన పాపం పండకుండా ఉండినంత వరకూ అటు తెదేపా- భాజపా ఉభయులూ బాగానే ఉన్నారు.. ఇప్పుడు పాపం పండి వాస్తవాలు ప్రజలకు తెలుస్తున్న సమయంలో.. ఒకరిమీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ మళ్లీ వంచిస్తున్నారని అర్థమవుతోంది.