Begin typing your search above and press return to search.

చంద్రబాబు, సోమిరెడ్డీ ఇద్దరూ ఓకే అనేశారు

By:  Tupaki Desk   |   27 Nov 2015 11:18 AM GMT
చంద్రబాబు, సోమిరెడ్డీ ఇద్దరూ ఓకే అనేశారు
X
నెల్లూరు జిల్లాకు చెందిన కీలక నేతలు, ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న ఆనం బ్రదర్స్ టీడీపీలో చేరడానికి అన్ని ఆటంకాలూ తొలగిపోయాయి. నెల్లూరు జిల్లాలో అన్ని పార్టీల్లోనూ రాజకీయంగా వర్గవిభేదాలు ఎక్కువ. టీడీపీలోనూ రెండు వర్గాలున్నాయి... వైసీపీ - కాంగ్రెస్ లలోనూ అక్కడ వర్గాలున్నాయి. వేర్వేరు పార్టీల మధ్య పోరాటమే కాకుండా ఒకే పార్టీలోని వేర్వేరు వర్గాల మధ్య పోరాటాలూ ఇక్కడ సర్వసాధారణం. కాంగ్రెస్ లో పెద్ద నేతలుగా ఉన్న ఆనం బదర్స్ ను కాదని అక్కడ వేరే వాళ్లకు పీసీసీ చీఫ్ రఘువీరా ప్రాధాన్యమిస్తున్నారన్న ఆరోపణలతో వారు బయటకొచ్చేస్తున్నారు.

అలాంటిది వారు మళ్లీ టీడీపీలోకి వచ్చినా ఇక్కడా వర్గాల కారణంగా వివాదమైతే ఇబ్బందే. కానీ... ఆ పరిస్థితి రాదని... వారి రాకపట్ల తనకు ఎలాంటి అభ్యంతరం లేదని నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ కీలక నేత సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి స్పష్టం చేశారు. టీడీపీలో మంత్రి నారాయణ - సోమిరెడ్డి వర్గాల మధ్య విభేదాలున్నాయి. అయితే... రాజకీయాలకు కొత్తయిన నారాయణకు ఇతర పార్టీల వారితో చిరకాల విభేదాలు లేవు. ఆ రకంగా వస్తేగిస్తే సోమిరెడ్డి, ఆనం వర్గాలకు మధ్యే ఇబ్బందులు రావొచ్చు. కానీ, అలాంటి ఇబ్బంది రాబోదని... ఆనం బ్రదర్స్ ను తాను స్వాగతిస్తున్నానని.. వారు టీడీపీలోకి రావడంపై తనకు ఎలాంటి ఇబ్బందులు లేవని సోమిరెడ్డి స్పష్టంగా చెప్పేశారు. దీంతో ఆనం బ్రదర్స్ కు పూర్తిగా లైన్ క్లియరైపోయినట్లే.

మరోవైపు ఇంతకుముందే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వారి రాకకు ఓకే చెప్పారని సమాచారం. చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తరువాతే సోమిరెడ్డి ఈ విషయంపై బహిరంగంగా మాట్లాడారు మొత్తానికి నెల్లూరు టీడీపీకి మరో ఇద్దరు నేతలు దొరికారన్నమాట. ఆనం బ్రదర్స్ చేరికతో వైసీపీని మరింత సమర్థంగా ఎదుర్కోవడం కుదురుతుందని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. ఆనం రామనారాయణరెడ్డిని ప్రభుత్వపరంగా కీలక విషయాల్లో విశ్వాసంలోకి తీసుకుని ఆయన అనుభవాన్ని ఉపయోగించుకునే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారని సమాచారం.

మరోవైపు ఆనం సోదరులు కూడా ''భజే చంద్రబాబు'' స్తోత్రం అప్పుడే మొదలుపెట్టేశారు. అమరావతి నిర్మాణం, రాష్ట్ర అభివృద్ధి అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని అందుకే తాము ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నామని మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శుక్రవారం చెప్పారు. తాము పదవుల కోసం వెంపర్లాడటం లేదని స్పష్టం చేశారు. రేపటి భవిష్యత్తు కోసం టిడిపిలో చేరుతున్నామని చెప్పారు. టిడిపిలో ఏ బాధ్యతలు అప్పగించినా చేస్తామని చెప్పారు. జిల్లా అభివృద్ధి కోసం కలిసి పని చేస్తామన్నారు. టిడిపి అధ్యక్షులు మాతో సంప్రదింపులు జరిపారన్నారు. మంత్రి నారాయణతో విభేదాల్లేవని చెప్పారు. ఇంకేముంది అందరూ ఓకే అన్నాక వచ్చి చేరడమే తరువాయి.