Begin typing your search above and press return to search.

ప‌ద‌వికి సోమిరెడ్డి రాజీనామా..ఓట‌మి నేర్పిన పాఠ‌మా?

By:  Tupaki Desk   |   15 Feb 2019 12:49 PM GMT
ప‌ద‌వికి సోమిరెడ్డి రాజీనామా..ఓట‌మి నేర్పిన పాఠ‌మా?
X
ఎన్నిక‌ల షెడ్యూల్‌ విడుద‌ల‌కు ఇంకా స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ, ఏపీలో ఎన్నిక‌ల వేడి ఇప్ప‌టికే ఊపందుకుంది. అధికార ప్ర‌తిప‌క్ష నేత‌లు పార్టీలు ఫిరాయిస్తూ ఈ హీట్‌ ను మ‌రింత పెంచుతున్నారు. తాజాగా, ఈ ఒర‌వ‌డిలో తాజాగా మ‌రో సీనియ‌ర్ నేత కం రాష్ట్ర మంత్రి చేరారు. రాష్ట్ర మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఎన్నిక‌ల వ్యూహాల‌ను అమ‌లు చేయ‌డంలో భాగంగానే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం. గ‌తంలో బ‌రిలో దిగిన స‌ర్వేప‌ల్లిలోని ప‌రాజ‌య‌పు పాఠాల నుంచి ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం.

టీడీపీ సీనియ‌ర్ నేత అయిన‌ సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి స‌ర్వేప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గాన్ని త‌న అడ్డాగా మార్చుకున్నారు. అయితే, ఇక్కడ ఆయ‌న్ను విజ‌యం వ‌రించిన సంద‌ర్భాల‌తో పాటుగా ఓట‌మి పాలైన ఉదంతాలే ఎక్కువ‌గా ఉన్నాయి. స‌ర్వేప‌ల్లి నుంచి 1994, 1999లలో విజయం సాధించారు. అయితే వ‌రుస‌గా ఆయ‌న మూడుసార్లు ఓట‌మి పాల‌య్యారు. 2004లో సోమిరెడ్డిపై కాంగ్రెస్ నేత ఆదాల ప్రభాకర్ రెడ్డి 7వేలకు పైగా మెజార్టీతో గెలిచారు. 2009లో కూడా కాంగ్రెస్ నుంచి ఆదాలనే సోమిరెడ్డిపై 10వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014లో వైసీపీ నేత‌ కాకాని గోవర్ధన్ రెడ్డి చేతిలో ఐదువేల పైచీలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు.

ఇలా వ‌రుస‌గా మూడు ఎన్నిక‌ల్లో ఓట‌మి పాల‌వ‌డం, మ‌రోవైపు ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో గెలుపును ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. పార్టీ కార్య‌క‌లాపాల‌పై మ‌రింత దృష్టి సారించే క్ర‌మంలో ఎమ్మెల్సీ ప‌ద‌వికి ఆయ‌న రాజీనామా చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ నిర్ణ‌యాన్ని పార్టీ పెద్ద‌ల‌కు సైతం తెలియ‌జేశార‌ని వారు ఓకే అన‌డంతో కాసేప‌ట్లో త‌న ఎమ్మెల్సీ గిరికి రాజీనామా చేయ‌నున్న‌రని స‌మాచారం.