Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ గెలుపు.. టిడిపి సంబరం?

By:  Tupaki Desk   |   6 Nov 2018 10:01 AM GMT
కాంగ్రెస్ గెలుపు.. టిడిపి సంబరం?
X
కర్నాటకలోని ఉప ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ పార్టీలో ఒకింత జోష్ వచ్చిందనడంలో సందేహం లేదు. మూడు ఎంపీ - రెండు ఎమ్మెల్యే స్థానాలకు జరిగిన ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్-జెడిఎస్ కూటమి రెండు ఎంపీ స్థానాలు.. రెండు ఎమ్మెల్యే స్థానాల్లో నెగ్గగా.. బిజెపి కేవలం ఒక్కటంటే ఒక్క ఎంపీ సీటుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు వచ్చిన ఈ ఫలితాలు కాంగ్రెస్ కు తీపి కబురే.. వారు సంబరాలు చేసుకోవటానికి అర్హులే.. ఇంతవరకు బాగానే ఉన్నా.. కర్ణాటక ఫలితాలు చూసి ఆంధ్రప్రదేశ్ లో మంత్రులు జబ్బలు చర్చుకోవటమే విడ్డూరంగా ఉంది. వీరిని చూస్తుంటే.. వాపును చూసి బలుపు అనుకున్న చందంగా ఉంది. రాష్ర్ట వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి బిజెపి గెలిచిన ఒక్క స్థానం కూడా కోట్ల కట్టలు విరజిమ్మి గెలిచినదట.. మిగిలిన నాలుగు స్థానాలు కాంగ్రెస్-జెడిఎస్ ప్రజాస్వామ్య బద్ధంగా కైవసం చేసుకున్నాయట. ఇవే ఫలితాలు రానున్న ఎన్నికల్లో రిపీట్ అవుతాయని చెప్పుకొచ్చారు. ఇక్కడ కాంగ్రెస్ గెలుపును టీడీపీ బలుపుగా చిత్రీకరిస్తున్నాడు.

ఇవి ఉప ఎన్నికలని మరిచారా?

ఏళ్ళ చరిత్రలో ఉప ఎన్నికల ఫలితాలెప్పుడూ అధికార పార్టీ కుర్చీ చుట్టూ తిరుగుతుంటాయి. ఇప్పుడు కూడా అవే ఫలితాలు వచ్చాయి. మరో ఆరు స్థానాలు కైవసం చేసుకుంటే అధికారాన్ని దక్కించుకునే అవకాశం ఉన్న బిజెపి వైఫల్యాన్ని ఇక్కడ కాదనలేం.. కానీ పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు.. ఈ ఫలితాలతో రాష్ర్టంలోని తెలుగుదేశం పార్టీకి ఒనగూరే లబ్ది ఏమిటో అర్థం కాని పరిస్థితి. ఆజన్మ శత్రువులైన కాంగ్రెస్ - టీడీపీలు ప్రస్తుతం పొట్టలో కత్తులు పెట్టుకుని భాయి భాయి అంటూ ఆలింగనం చేసుకుంటున్నప్పటికీ.. అవకాశవాద రాజకీయాలపై పొడిచిన వీరి పొత్తు.. అసంబద్ధమైన వీరి విధానాలతో ఎప్పుడు అస్తమిస్తుందో - ఎప్పుడు ప్రకాశిస్తుందో ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికే ఎరుకని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.