సోమారపుకు ఏకుమేకులా టీఆర్ ఎస్ రెబల్స్

Tue Sep 25 2018 17:58:23 GMT+0530 (IST)

తెలంగాణ ఎన్నికల సమరంలో మిగతా పార్టీలన్నీ అభ్యర్థులను ప్రకటించేందుకే కిందా మీద పడుతున్నాయి. కానీ తెలంగాణ రాష్ట్ర సమితి మాత్రం 105మంది అభ్యర్థులను ప్రకటించేసి కార్యక్షేత్రంలోకి దిగేసింది. వారంతా ప్రచార పర్వాన్ని కూడా మొదలెట్టేశారు. ఇది టీఆర్ ఎస్ అభ్యర్థులకు కలిసి వచ్చే అంశమే..అయితే ముందుగానే  అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ ఎస్ కు ఇప్పుడు రెబల్స్ బెడద ఎక్కువైంది.ఇండిపెండెంట్ ఎన్నో విజయాలందుకొని టీఆర్ ఎస్ లో చేరిన రామగుండం తాజా మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఇప్పుడు టీఎస్ ఆర్టీసీ చైర్మన్ గానూ కొనసాగుతున్నారు. ఇప్పుడు ఈ ఇండిపెండెంట్ సెంటిమెంట్ నేతకు రామగుండం బరిలో ఆ ఇండిపెండెంట్లే చమటలు పట్టిస్తున్నారు. 2009లో సోమారపు స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి రామగుండం ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత కారెక్కారు. ఇప్పుడు టీఆర్ ఎస్ రెబల్స్ ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగుతూ సోమారపుకు దడ పుట్టిస్తున్నారు. వారంతా టీఆర్ ఎస్ నేతలే కావడంతో ఓట్లు చీలుతాయోనన్న టెన్షన్ సోమరపును వెంటాడుతోంది.

టీఆర్ ఎస్ నియోజకవర్గ నేతగా సోమారపుకు కంటే ముందున్న కోరుకంటి చందర్ ఈసారి టికెట్ తనకే అని అనుకున్నారు. కానీ కేసీఆర్.. సోమారపు వైపే మొగ్గారు. గడిచిన ఎన్నికల్లో సోమారపుపై ఇండిపెండెంట్ గా పోటీచేసి కేవలం 2వేల ఓట్ల తేడాతో చందర్ ఓడారు. ఆ తర్వాత మళ్లీ టీఆర్ ఎస్ లో చేరారు. ఇప్పుడు మళ్లీ టీఆర్ ఎస్ రెబల్ గా బరిలోకి దిగుతున్నానని ప్రకటించి సోమారపుకు షాకిచ్చారు.

మరోవైపు రామగుండం టీఆర్ ఎస్ జడ్పీటీసీ కందుల సంద్యారాణి కూడా స్వతంత్ర ఎమ్మెల్యేగా పోటీచేస్తూ సోమారపును సవాల్ చేస్తున్నారు. మాజీ మేయర్ లక్ష్మీ నారాయణ - డిప్యూటీ మేయర్ శంకర్ కూడా సోమారపును ఓడించేందుకు పావులు కదుపుతున్నారట.. దీంతో ఒక వైపు అసమ్మతి - మరో వైపు రెబల్స్ బెడదతో సోమారపు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. గడిచిన ఎన్నికల్లో దాదాపు ఓడించినంత పనిచేసిన చందర్ ను టీఆర్ ఎస్ అధిష్టానం బుజ్జగిస్తున్నా ఆయన ససేమిరా అంటున్నాడట.. దీంతో ఈసారి సోమారపు గెలుపు అంత ఈజీ కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.