Begin typing your search above and press return to search.

ఐటీ ఓటర్లూ... కారు వైపే...!

By:  Tupaki Desk   |   12 Dec 2018 3:30 PM GMT
ఐటీ ఓటర్లూ... కారు వైపే...!
X
" ఈ రోజు హైదరాబాద్ ఇలా ఉందంటే నేనే కారణం. ఇక్కడికి హైటెక్ సిటీని తీసుకువచ్చాను."

" చెప్పండి తమ్ముళ్లూ... నేను లేకపోతే హైదరాబాద్ ఇలా ఉండేదా..."

‌ ఇవీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో హైదరాబాద్ లో చేసిన ప్రచారంలో ముఖ్యాంశాలు.అంతే కాదు.... ఆయనకు మద్దతు పలికిన పచ్చ మీడియా కూడా ఇదే అంశాన్ని పదే పదే ప్రకటించింది. అంతేనా అంటే కాదు కాదు అని కూడా అంటున్నారు రాజకీయ పరిశీలకులు.చంద్రబాబు నాయుడి ప్రచార సభల్లో కొందరు యువకులు తమ చేతిలో ప్లకార్డులు పట్టుకుని " మీ వల్లే మేం హైదరాబాద్ లో ఉన్నాం. మీరే మా ఉద్యోగాలకు కారణం. ఇక్కడ ఐటీ అభివ్రద్ధి మీ వల్లే జరిగింది" అంటూ ప్రచారమూ చేశారు.ఇదంతా చూసిన వారికి ఔరా.... చంద్రబాబు నాయుడు అనిపించింది. ఓటర్లే కాదు... కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ముక్కున వేలేసుకుని ఔరా... చంద్రబాబు అనే అనుకున్నారు. అయితే ఈ సీన్ మొత్తం తెలంగాణ ఎన్నికల లెక్కింపు తర్వాత రివర్స్ అయ్యింది. ఇంతకీ ఏం జరిగింది అనుకుంటున్నారా... హైదరాబాద్ లో ఉన్న ఐటీ ఉద్యోగులంతా గంప గుత్తగా కారెక్కేసారు. ఏ ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకలేదని ఫలితాలను బట్టి రుజువైంది. హైదారాబాద్ లో ఐటీ నిపుణులు ఎక్కువ నివాసం ఉన్నది కూకట్ పల్లి - శేరిలింగంపల్లి - జూబ్లీహిల్స్ పరిసరాల్లోనే. వీరి ఓట్లు కూడా ఈ నియోజకవర్గాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ తమ గెలుపు ఖాయం అని. సెటిలర్లతో పాటు ఐటీ ఉద్యోగులు కూడా తమకే పట్టం కడతారని చంద్రబాబు నాయుడు ఆశించారు. అందుకే ఇక్కడ పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్ధులే పోటీ చేశారు. అయితే చంద్రబాబు నాయుడు అనుకున్నది జరగలేదు. తెలంగాణ వ్యాప్తంగా చంద్రబాబు నాయుడిపై ఉన్న వ్యతిరేకతలో ఐటీ ఉద్యోగులు కూడా ఉన్నారని తేలిపోయింది. తానే ఐటీని అభివ్రద్ధి చేశానని చెప్పుకున్నా ఐటీ ఓటర్ల మాత్రం అబ్బే అదేం కాదు అన్నట్లుగా తమ ఓట్లు తెలంగాణ రాష్ట్ర సమితికే వేశారు. అంటే చంద్రబాబు నాయుడు ఇక మీదట హైదరాబాద్ తనవల్లే అనే నినాదాన్ని వదులుకోవాల్సిందే అని రాజకీయ పండితులు అంటున్నారు.