పగబట్టిన పాము ఏం చేసిందంటే!

Sun Aug 13 2017 15:51:27 GMT+0530 (IST)

పాములు పడగబడతాయా? వినడానికి సరదాగానే అనిపిస్తోందా! ఈగ సినిమాలో తనను చంపిన.. విలన్ ను ముప్పుతిప్పులు పెట్టి పగ తీర్చుకున్నట్లు పాములు కూడా చేస్తాయా?  అది సినిమాలో కాబట్టి.. జక్కన్న రాజమౌళి దర్శకుడు కాబట్టి అలా జరిగింది. ఇలా నిజజీవితంలో ఎక్కడ అవుతుంది? అని సిల్లీగా కొట్టిపారేస్తున్నారా!! కానీ ఓ యువకుడిని `నిన్ను వదల బొమ్మాళీ` అని ఒక పాము ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తోంది. ఒకటి రెండు కాదు నాలుగేళ్లుగా.. `నిను వీడని పామును నేను` అంటూ తెగ భయపెడుతోంది. దాని బారి నుంచి రక్షించిన వారికి నజరానాలు ప్రకటిస్తున్నాడు. అంతేకాదండోయ్.. బాడీగార్డులను కూడా నియమించుకున్నాడు.ఈ విచిత్ర సంఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. పాము నుంచి తన ప్రాణాలు కాపాడుకునేందుకు ఓ యువకుడు తంటాలు పడుతున్నాడు. షాజహాన్ పూర్ జిల్లాకు చెందిన ఓ 24 ఏళ్ల యువకుడు 2013లో ఓ మగ పామును చంపాడట. అప్పటి నుంచి ఆ మగపాముతో జతకట్టిన ఆడ పాము అతన్ని చంపాలని తీవ్రంగా ప్రయత్నిస్తోందట. పాముని చంపిన తర్వాత నుంచి ఆడ పాము తనని కిలోమీటర్ల పాటు వెంటపడిందని ఆ యువకుడు చెబుతున్నాడు. ఇప్పటివరకూ నాలుగు సార్లు తనపై పాము దాడికి యత్నించిందని తనని చంపే దాకా వదిలదని అతను భయంతో వణికిపోతున్నాడు.

ఆ పామును చంపిన వారికి రూ.5000/- రివార్డు కూడా ఇస్తానని ప్రకటించాడు. పాము తనని ఏమీ చేయకుండా ఉండేందుకు రక్షణంగా నలుగురు గార్డులను కూడా ఏర్పాటుచేసుకున్నాడు. అతను ఎక్కడుంటే అక్కడ ఆ గార్డులు తుపాకులతో కాపలా కాస్తున్నారు. ఈ విషయంపై జిల్లా అధికారుల వరకూ వెళ్లింది. వారంతా దీనిని కొట్టిపారేస్తున్నారు. వర్షాకాలంలో పాములు ఎక్కువగా సంచరిస్తుంటాయని.. వాటిలో ఏదో ఒక దాన్నిచూసి తన వెంటపడిందని యువకుడు భావిస్తున్నాడని వివరిస్తున్నారు. పాము వెంటాడటం అనే మాట అతని భ్రమేనని వదిలేశారు.