Begin typing your search above and press return to search.

స్మృతిజీ.. నామినేషన్ ఎలా వేయాలో ఇంకా రాలేదా?

By:  Tupaki Desk   |   12 April 2019 9:05 AM GMT
స్మృతిజీ.. నామినేషన్ ఎలా వేయాలో ఇంకా రాలేదా?
X
బీజేపీ నేతలు నోరు తెరిస్తే చాలు.. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఉద్దేశించి పప్పు అన్న మాటను ఒక్కసారైనా అనకుండా ఉండలేరు. మరి.. ఎదుటోళ్లను అంతలా ఎటకారం చేసుకునే కమలనాతులు తమ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి. కేంద్రమంత్రిగా వ్యవహరిస్తూ.. ఇప్పటికే తన విద్యార్హత విషయంలో రచ్చ రచ్చ జరిగిన వేళలో.. తాజాగా దాఖలు చేసే నామినేషన్లో ఎంత జాగ్రత్తగా ఉండాలి?

కానీ.. అమేధీ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న స్మృతి ఇరానీ తన విద్యార్హత విషయంలో మరోసారి తప్పులో కాలేయటం ఆసక్తికరంగా మారింది. గతంలో తాను గ్రాడ్యుయేట్ అని సగర్వంగా చెప్పుకున్న ఆమె వైనం అప్పట్లో వివాదాస్పదంగా మారింది. తాజాగా నామినేషన్ దాఖలు చేసిన సందర్భంలో తన విద్యార్హత విషయంలో ఆమె తాను గ్రాడ్యుయేషన్ పూర్తి చేయలేదన్న విషయాన్ని పేర్కొనటం హాట్ టాపిక్ గా మారింది.

2004లో ఢిల్లీలోని చాందినీ చౌక్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సందర్భంలో స్మృతి తాను 1996లో ఢిల్లీ వర్సిటీ నుంచి బీఏ చేసినట్లుగా పేర్కొన్నారు. 2014లో అమేధీ నుంచి బరిలోకి దిగిన సందర్భంలో ఆమె తాను బీకామ్ కోసం 1994లో ఢిల్లీ వర్సిటీ దూరవిద్యలో అడ్మిషన్ పొందినట్లుగా పేర్కొన్నారు.

దీంతో.. విపక్షాలు ఆమె విద్యార్హత మీద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై పెను దుమారం రేగింది కూడా. ఇదిలా ఉంటే.. తాజాగా ఆమె దాఖలు చేసిన నామినేషన్లో తన విద్యార్హత గురించి ప్రస్తావిస్తూ.. తాను దూరవిద్యలో బీకాం కోర్సుకు నమోదు చేసినట్లు పేర్కొంటూనే.. తాను డిగ్రీ పూర్తి చేయలేదన్న విషయాన్ని పేర్కొనటం గమనార్హం. ఈ నేపథ్యంలో 2004లోనూ.. 2014లోనూ ఆమె దాఖలు చేసిన అఫిడవిట్ తప్పు అని తేలినట్లే. చదివిన చదువు విషయంలోనే స్పష్టత లేని స్మృతిమాష్టారు.. కేంద్రమంత్రిగా దేశ ప్రజలకు చేసే మేలేమిటో?