Begin typing your search above and press return to search.

చేదు నిజం బాస్; పండులో విషం మెండు

By:  Tupaki Desk   |   3 Sep 2015 4:40 AM GMT
చేదు నిజం బాస్; పండులో విషం మెండు
X
ఎప్పుడూ ఆ చెత్త జంక్ ఫుడ్ తినే బదులు నాలుగు పండ్లు తింటే ఆరోగ్యం కదా అనే మాటలిప్పుడు నిజం కానే కాదు. ప్రకృతి ఇచ్చే పంటను.. మనిషి స్వార్థం కోసం.. ధనార్జన కోసం అక్రమపద్ధతుల్లో మగ్గబెట్టి.. రసాయనాలతో కళ్లకు ఇంపుగా కనిపించేలా తయారు చేసే పండ్లలో కాలకూట విషం ఉంటుందన్న వాస్తవం మరోసారి రుజువైంది.

నిషేధిత రసాయనాలతో పండ్లను మగ్గబెట్టటం ద్వారా వినియోగదారుల్ని మోసం చేస్తున్న వ్యాపారుల గుట్టు బయటకు రావటం.. హైకోర్టు సైతం ఈ విషయంపై సీరియస్ అయి.. విచారణకు ఆదేశించటంతో ఈ వ్యవహారానికి సంబంధించిన చేదు నిజాలు బయటకు వచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వివిధ పండ్ల దుకాణాల్లో శాంపిళ్లు సేకరించిన అధికారులు.. వాటిని ల్యాబ్ లలో పరీక్షిస్తే.. కళ్లు చెదిరిపోయే వాస్తవాలు బయటకు వచ్చాయి.

అధికారులు సేకరించిన శాంపిళ్లను ప్రయోగశాలలో పరీక్షించినప్పుడు బయటకు వచ్చిన వాస్తవాల్ని చూస్తే.. పండ్లను తినేందుకు కాదు కదా.. వాటిని టచ్ చేసేందుకు సైతం భయపడే పరిస్థితికి రావటం ఖాయం.

అలాంటి చేదు నిజాల్లో కొన్నింటి విషయానికి వస్తే..

‘‘నిగనిగలాడే అరటిపండును చూసి నోరూరిపోతుంది. తినేద్దామని అనిపిస్తుంటుంది. కానీ.. అరటిపండును తొందరగా పండేలా చేసేందుకు ఇథోపిన్ ను వినియోగిస్తున్నారు. దీన్ని పంట చేలో.. పురుగుల్ని చంపేందుకు వినియోగిస్తుంటారు. ఇథోపిన్ వినియోగంతో పండబెట్టిన అరటి పండును తినే ముందు దాన్ని బాగా కడగాల్సి ఉంటుంది. అంతేకాదు.. పండును తిన్నాక చేతుల్ని వేడినీళ్లతో మరింత శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. లేనిపక్షంలో ఆ రసాయనం వివిధ మార్గాల ద్వారా కడుపులోకి వెళ్లే ప్రమాదం ఉంది’’

‘‘యాపిల్ తింటే అనారోగ్యం మీ చెంతకే రాదన్న మాట సంగతి తర్వాత.. యాపిల్ తో లేనిపోని కష్టాలు కొని తెచ్చుకోవటమేనని తాజాగా నిరూపితమైంది. ఎందుకంటే.. యాపిల్ అందంగా.. ఆకర్షణీయంగా కనిపించేందుకు వ్యాక్స్ పూయటం తెలిసిందే. అయితే.. వ్యాక్స్ తో పాటు.. వాటిని తొందరగా పండేందుకు వాటి మధ్యలో కాల్షియం కార్బైడ్ ను వినియోగించి ఎర్రటి రంగు తేవటానికి ప్రయత్నిస్తున్నారు. అంటే.. ఒక యాపిల్ తింటు డబుల్ డేంజర్ అన్న మాట’’

‘‘పండ్లను విషపూరిత రసాయనాలు వాడటం ఒక్క అరటి.. యాపిల్ లాంటి కొన్నింటికే కాదు. బత్తాయి.. సపోటా.. మామిడి.. నిమ్మ.. నల్లద్రాక్ష.పుచ్చకాయ లాంటి అన్నింటిలోనూ నిషేధిక రసాయనాలతో పండిస్తున్నట్లు తేలింది’’

‘‘పండ్లను కానీ వంటగదిలో ఉంచితే ప్రమాదకరం. ఎందుకంటే వాటికి వినియోగించిన కార్బైడ్ ప్రభావం వంటగది మొత్తం వ్యాపించి.. కేన్సర్ కు దారి తీసే అవకాశం ఉందని పత్రికలో చదివానని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ భట్ వెల్లడించారు’’

ఆరోగ్యానికి మేలు చేస్తాయనుకునే పండ్లు ఆరోగ్యాన్ని ఎంతలా చెడగొడతాయన్న విషయాన్ని హైకోర్టు తాత్కలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి. భోసలే మాటల్లో వింటే.. "భోజనం తర్వాత ఏదో ఒక పండు తింటా. తర్వాత కడుపులో మంట ప్రారంభమయ్యేది. అసిడిటీ వల్ల అలా ఉంటుందని నిన్నటివరకూ అనుకునేవాడిని. అవి కార్బైడ్ వినియోగించిన పండ్ల వల్లేనని ఇప్పుడు అర్థమైంది. ఇకపై.. ఏ పండు తినాలన్నా పలుమార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది" అని వ్యాఖ్యానించారు.