Begin typing your search above and press return to search.

స్కెచ్ వేసి షాకు చుక్క‌లు చూపించినోడు అత‌డే

By:  Tupaki Desk   |   20 May 2018 11:45 AM GMT
స్కెచ్ వేసి షాకు చుక్క‌లు చూపించినోడు అత‌డే
X
కొద్ది రోజులుగా దేశ ప్ర‌జ‌ల దృష్టిని విప‌రీతంగా ఆక‌ర్షించాయి క‌ర్ణాట‌క రాజ‌కీయాలు. ఎప్పుడైతే య‌డ్యూర‌ప్ప ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారో దాంతో సగం హ‌డావుడి స‌ర్దుకున్న‌ట్లైంది. కుమార‌స్వామి సీఎం కావ‌టానికి అడ్డంకులు తొలిగిపోవ‌టం ఒక ఎత్తు అయితే.. మాస్ట‌ర్ మైండ్స్ లాంటి మోడీషాల‌కు చుక్క‌లు చూపించ‌ట‌మే కాదు.. వారు వేసిన ఎత్తులు చిత్తులు అయ్యేలా చేసింది ఎవ‌ర‌న్న ఆస‌క్తి క‌ర ప్ర‌శ్న‌కు స‌మాధానం చెబితే.. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత డీకే శివ‌కుమార్ పేరునే చెప్పాలి.

శివ‌కుమార్ పేరు చెప్పినంత‌నే క‌న్న‌డ రాజ‌కీయాల‌తో ప‌రిచ‌యం ఉన్న వారికి గ‌తం గుర్తుకు వ‌స్తుంది. మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి విలాస్ రావ్ దేశ్ ముఖ్ అవిశ్వాస తీర్మాన్ని ఎదుర్కోవాల్సిన సంద‌ర్భంలో మ‌హారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేల్ని ఈగ‌ల్ట‌న్ రిసార్ట్స్ కు త‌ర‌లించ‌టం..వారిని ప్ర‌లోభాల‌కు లొంగ‌కుండా అవిశ్వాసం రోజున ముంబ‌యికి త‌ర‌లించి.. అధినాయ‌క‌త్వం త‌న మీద పెట్టిన న‌మ్మ‌కాన్ని ఏ మాత్రం వ‌మ్ము చేయ‌ని బ్యాక్ గ్రౌండ్ ఆయ‌న సొంతం. పార్టీ కోసం ఇంత చేసిన దానికి ప్ర‌తిగా నాటి కేంద్ర స‌ర్కారు పుణ్య‌మా అని ఆయ‌న‌కు చెందిన 64 ప్రాంతాల్లో ఐటీ రైడ్స్ జ‌రిగాయి.

ఆర్థికంగా మాంచి సౌండ్ అయిన శివ‌కుమార్ ఆస్తులు అధికారికంగా దాదాపు రూ.700 కోట్ల‌కు పైనే. ఒక్క‌లిగ సామాజిక వ‌ర్గానికి చెందిన ఆయ‌న కానీ స్కెచ్ వేస్తే ప్ర‌త్య‌ర్థులు చిత్తు కావ‌టం ఖాయ‌మంటారు. తాజాగా ఆ విష‌యం మ‌రోసారి రుజువైంద‌ని చెప్పక త‌ప్ప‌దు.

క‌ర్ణాట‌క ఎపిసోడ్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప‌క్క‌దారి ప‌ట్ట‌కుండా చూడటం.. కొచ్చి రిసార్ట్స్ కు అని చెప్పి.. గుట్టుచ‌ప్పుడు కాకుండా హైద‌రాబాద్‌కు తీసుకురావ‌టం ఒక ఎత్తు అయితే.. క‌నిపించ‌కుండా పోయిన ఎమ్మెల్యేలు స‌మ‌యానికి అసెంబ్లీకి వ‌చ్చేలా చేశార‌ని చెబుతారు.

వీట‌న్నింటికి మించి.. బీజేపీ నేత‌లు ఫోన్లు చేప‌ట్టిన బేర‌సారాల్ని ఆడియో క్లిప్పుల రూపంలో మార్చ‌టంలో శివ‌కుమార్ నైపుణ్యం అంతా ఇంతా కాదు. టైం చూసి.. ఒక్కొక్క‌టిగా విడుద‌లైన ఆడియో క్లిప్పుల‌తో బీజేపీ పూర్తిగా డిఫెన్స్ లో ప‌డ‌టం.. ప‌వ‌ర్ కోసం ఎంత‌కైనా దిగ‌జారే మ‌న‌స్త‌త్వం మోడీషా బ్యాచ్ ద‌న్న విష‌యాన్ని రుజువుల‌తో స‌హా దేశ ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేశారు. అసెంబ్లీలో నెంబ‌ర్ గేమ్‌లో ఒక‌వేళ అటూఇటూ చేసి గెలిచినా.. నైతికంగా మాత్రం విజ‌యం కాంగ్రెస్‌..జేడీఎస్ ల‌దే అన్న భావ‌న‌ను క‌లుగ‌జేశారు.

వ‌రుస పెట్టి మ‌రీ ఆడియో టేపులు విడుద‌ల కావ‌టంతో బీజేపీ వ‌ర్గాలు ఉక్కిరిబిక్కిరి అయ్యాయి. మీడియా ఫోక‌స్ పెరిగిపోవ‌టం.. సుప్రీం ఆంక్ష‌ల‌న్ని ఎమ్మెల్యేల బేర‌సారాల‌కు ద్వారాలు మూసేలా చేశాయి. దీంతో..బ‌ల‌ప‌రీక్ష‌కు ముందే చేతులు ఎత్తేయాల్సి వ‌చ్చింది. సాధార‌ణ రైతు కుటుంబంలో పుట్టిన ఆయ‌న‌.. పాతికేళ్ల వ‌య‌సులో దేవెగౌడ మీద పోటీ చేసి స్వ‌ల్ప తేడాతో ఓడిపోయిన ట్రాక్ రికార్డు కూడా శివ‌కుమార్ సొంతం. ఇప్పుడు ఆయ‌న కొడుకును సీఎం చేయ‌టానికి ఆయ‌న చెమ‌ట‌లు చిందించాల్సి రావ‌టం చూస్తే.. రాజ‌కీయాల్లో ఏది శాశ్వితం కాద‌న్న విష‌యం మ‌రోసారి రుజువు కాక‌మాన‌దు. గ‌తంలో బంగార‌ప్ప మంత్రివ‌ర్గంలో మంత్రిగా వ్య‌వ‌హ‌రించిన ఆయ‌న‌..తాజాగా కుమార‌స్వామి ప్ర‌భుత్వంలో డిప్యూటీ సీఎంగా వ్య‌వ‌హ‌రించ‌నున్న‌ట్లు చెబుతున్నారు.