Begin typing your search above and press return to search.

సింధు ఒప్పందం కథేంటి?

By:  Tupaki Desk   |   27 Sep 2016 5:57 AM GMT
సింధు ఒప్పందం కథేంటి?
X
శత్రువును దెబ్బ తీయాలంటే అతడి మీద భౌతిక దాడి చేస్తేనే సరిపోదు. శత్రువు ఆర్థిక మూలాల మీద దెబ్బ తీసినా.. అతడ్ని దెబ్బ తీసినట్లే. టాలీవుడ్.. బాలీవుడ్ సినిమాల్లో విలన్ విషయంలో హీరో ఇదే పంథాను అనుసరించి.. చివర్లో శత్రువుపై నేరుగా ఎటాక్ చేయటం కనిపిస్తుంది. తాజాగా దాయాది పాక్ ఇష్యూలో మోడీ కూడా ఇదే పంథాను అనుసరిస్తున్నారా? అన్నట్లుగా తాజాగా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పాక్ తో నేరుగా యుద్ధం కంటే కూడా.. పాక్ ను ఉక్కిరిబిక్కిరి చేసే అంశాల మీద మోడీ సర్కారు తాజాగా దృష్టి సారించింది.

ఇందులో భాగంగా సింధు జలాల మీద పట్టు బిగించటం ద్వారా పాక్ విలవిలలాడేలా చేయాలని భావిస్తున్నారు. ఇందుకు 1960లో జరిగిన సింధుజలాల ఒప్పందాన్ని తెరపై తీసుకొచ్చారు ప్రధాని మోడీ. సింధు జలాల ఒప్పందంపై మోడీ ఎందుకు ఫోకస్ చేశారు? ఈ ఒప్పందాన్ని యథాతధంగా అమలుచేస్తే భారత్ కు కలిగే లాభమేంది? పాక్ కు కలిగే నష్టమేంది? అన్న విషయాల్లోకి వెళితే.. ఆసక్తికర సమాచారం లభిస్తుంది.

సింధు జలాలకు సంబంధించి భారత్ నాటి ప్రధాని నెహ్రు.. పాక్ మాజీ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ ల మధ్య 1960లో ఒక ఒప్పందం జరిగింది. దీని ప్రకారం భారత్.. బియాస్ - రావి - సట్లేజ్ నదుల నీటిని వాడుకోవాలి. అదే విధంగా పాకిస్థాన్... సింధు - చీనాబ్ - జీలం న‌దుల‌ నీటిని వాడుకోవాలి. ఈ ఒప్పందం ప్రకారం భారత్ 9.12 లక్షల ఎకరాలకు సరిపడా సాగునీటిని వాడుకునే వీలుంది. అంతేకాదు.. మరో 4.2 లక్షల ఎకరాలకు కూడా విస్తరించుకునే వీలుంది. మరి.. ఒప్పందం ప్రకారం భారత్ ఏం చేస్తుందన్న విషయాన్ని చూస్తే.. ఈ ఒప్పందాన్ని భారత్ పూర్తిగా వాడుకోవటం లేదు.

ఎందుకంటే.. ఒప్పందం ప్రకారం భారత్ ఎక్కువ నీటిని వాడుకోవాల్సి ఉంది. కానీ.. ఇప్పటివరకూ ఆ పని చేయలేదు. ఒప్పందం ప్రకారం దాదాపు 13 లక్షల ఎకరాలకు సరిపడా సాగునీటిని వాడుకోవాల్సి ఉన్నా భారత్ ఇప్పటివరకూ 8లక్షల ఎకరాలకు సరిపడా నీటిని మాత్రమే వినియోగిస్తోంది. ఇక.. ఒప్పందంలో మరో అంశం ఏమిటంటే..ఈ నదుల ద్వారా భారత్ 18,600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు. కానీ.. భారత్ ఉత్పత్తి చేసుకుంటున్న విద్యుత్ కేవలం 3,034 మెగావాట్లు మాత్రమే. మరో2,526 మెగావాట్ల ప్రాజెక్టుల్నినిర్మిస్తోంది. ఈ నేపథ్యంలో మరింత నీటిని.. మరింత విద్యుత్ ను ఉత్పత్తి చేసుకునే వీలు అధికారికంగా ఉందన్న మాట. అదే పని భారత్ మొదలు పెడితే.. పాక్ ఇప్పుడు వినియోగిస్తున్న నీటికి గండి పడే అవకాశం ఉంది. తాను వాడుకోవాల్సిన దానిలో 60 శాతం నీటిని వాడుకుంటేనే పాక్ హాహాకారాలు చేస్తూ.. అంతర్జాతీయ కోర్టులకు ఎక్కింది.

ఇక.. వందశాతం నీటిని.. విద్యుదుత్ప‌త్తిని షురూ చేస్తే పాక్ ఎంతటి ఇబ్బంది ఎదుర్కొంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే.. మోడీ ఈ అంశంపై ఫోకస్ చేసినట్లుగా చెప్పాలి. పాక్ ప్రయోజనాల దృష్ట్యా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్న అంశాల్ని బిగిస్తే.. పాక్ ఎంతోకొంత దారికి వచ్చే వీలుంది. ఒకవేళ దారికి రాకున్నా.. ఇప్పుడున్న కంఫర్ట్ జోన్ లో అయితే ఉండదని చెప్పక తప్పదు. నీటి లభ్యత తగ్గిపోతే.. ఆ ప్రభావం పాక్ మీద నేరుగా పడక మానదు. అంతర్జాతీయ కోర్టులను ఆశ్రయించినా.. గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారమే చేస్తున్నట్లు ఆధారాలతో భారత్ చూపించినప్పుడు పాక్ మింగా లేక కక్కా లేని పరిస్థితి ఎదుర్కోవటం ఖాయం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/