Begin typing your search above and press return to search.

శ్రీకాంతాచారి.. శ్రీనివాసరెడ్డి.. ఈ ఇద్దరికి పోలికలు ఎన్నో..

By:  Tupaki Desk   |   14 Oct 2019 6:35 AM GMT
శ్రీకాంతాచారి.. శ్రీనివాసరెడ్డి.. ఈ ఇద్దరికి పోలికలు ఎన్నో..
X
తెలంగాణ ఉద్యమం ఎన్నేళ్లు సాగినా..శ్రీకాంతాచారి ఆత్మార్పణంతో మొదలైన తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కారణమైందని చెప్పక తప్పదు. అతడు చేసిన బలిదానంతో యావత్ తెలంగాణ కదిలిపోయింది. అతడి ప్రాణత్యాగంతో కదం తొక్కిన తెలంగాణతో చివరకు ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించక తప్పని పరిస్థితి.

తాజాగా జరుగుతున్న ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో 48 వేల మంది ఉద్యోగులు ఉద్యోగాలు పోయినట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ పదే పదే ప్రకటించటంతో కలత చెందటమే కాదు.. తమ ఆత్మార్పణతో అయినా మిగిలిన కార్మికులకు న్యాయం జరుగుతుందని.. ప్రభుత్వం స్పందించి ఉద్యోగుల డిమాండ్ల మీద సానుకూలత వ్యక్తం చేస్తుందన్న ఉద్దేశంతో ఖమ్మం జిల్లాకు చెందిన శ్రీనివాసరెడ్డి తనను తాను కాల్చుకొని ఆత్మార్పణ చేసుకున్నారు. 92 శాతానికి పైగా కాలిన గాయాలతో ఆయన్ను అత్యవసర పరిస్థితుల్లో హైదరాబాద్ కు తరలించారు. ఆయన్ను కంచన్ బాగ్ లోని డీఆర్డీవో అపోలో ఆసుపత్రిలో చేర్చారు.

దాదాపు పదేళ్ల క్రితం టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన నిరాహారదీక్షను పోలీసులు భగ్నం చేయటంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీకాంతాచారి ఎల్ బీ నగర్ చౌరస్తాలో పెట్రోల్ పోసుకోని ఆత్మాహుతికి పాల్పడ్డారు. 70 శాతం కాలిన గాయాలతో అతన్ని కామినేనికి తరలించగా.. చికిత్స చేయలేమని చెప్పటంతో.. ఆర్డీడీవో అపోలోకు తరలించారు. మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన శ్రీకాంతాచారి అమరుడయ్యాడు.

ఇలా నాడు శ్రీకాంతాచారి.. నేడు ఖమ్మం జిల్లాకు చెందిన శ్రీనివాసరెడ్డి ఇద్దరూ ఒకే ఆసుపత్రిలో మరణించటం గమనార్హం. ఈ ఇద్దరూ ప్రభుత్వ చర్యలకు మనస్తాపానికి గురైన ఆత్మాహుతికి పాల్పడంతో పాటు.. ఇరువురి ఆకాంక్షలు ఒక్కటే. నాడు శ్రీకాంతాచారి మృతదేహాన్ని భారీ బందోబస్తు నడుమ ఆయన స్వగ్రామమైన నల్గొండ జిల్లాలోని పోడిచేడుకు తరలించగా.. తాజాగా శ్రీనివాసరెడ్డి భౌతికకాయాన్ని కూడా అదే రీతిలో భారీ బందోబస్తు మధ్య ఖమ్మానికి తరలించారు.