Begin typing your search above and press return to search.

సీఎం నిమ్మ‌కాయ ప‌ట్టుకుని తిరుగుతున్నారే!

By:  Tupaki Desk   |   31 Aug 2016 4:28 AM GMT
సీఎం నిమ్మ‌కాయ ప‌ట్టుకుని తిరుగుతున్నారే!
X
న‌మ్మకానికీ మూఢన‌మ్మ‌కానికీ చాలా తేడా ఉంటుంది! కానీ, భ‌య‌మో భ‌క్తో తెలీదుగానీ ఈ మ‌ధ్య కొంత‌మంది నాయ‌కులు మూఢ‌న‌మ్మ‌కాల‌ను ఓ రేంజిలో న‌మ్మేస్తున్నారు! ప్ర‌జ‌ల‌కు ఆద‌ర్శంగా నిల‌వాల్సిన నాయ‌కులే ఇలా లేనిపోని సెంటిమెంట్లు పేరుతో ప‌బ్లిక్ లైఫ్ లో క‌నిపిస్తూ ఉంటే... ప్ర‌జ‌ల‌కు ఎలాంటి సంకేతాలు ఇచ్చిన‌ట్టు..? క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి సిద్ధ‌రామ‌య్య‌కు మూఢన‌మ్మ‌కాలు చాలా ఎక్కువ అంటారు! ఆ మాట నిజ‌మే అని నిరూపించుకునేందుకు త‌న‌వంతు (పిచ్చి)ప‌నులు కూడా చేస్తూనే ఉన్నారు సిద్ధ‌రామ‌య్య‌! మంగ‌ళ‌వారం మైసూరులో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మానికి నిమ్మ‌కాయ ప‌ట్టుకుని వ‌చ్చారు. దాన్ని న‌లుగురికీ క‌నిపించ‌కుండా చొక్కా జేబులో పెట్టుకుని ఉంటే ఇంత చ‌ర్చ జ‌రిగేది కాదు. దాన్ని కుడిచేతులో పట్టుకుని ప్ర‌జ‌ల‌ను విష్ చేస్తూ... అంద‌రికీ కాయ క‌నిపించేలా చూపించారు! చూసిన‌వాళ్లంతా ఆశ్చ‌ర్య‌పోవాల్సి వ‌చ్చింది. ముఖ్య‌మంత్రిగారు ఇలా నిమ్మ‌కాయ ప‌ట్టుకుని తిర‌గ‌డం ఏంట‌ని ఆలోచ‌న‌లోప‌డాల్సి వ‌చ్చింది.

ఇంత‌కీ, సిద్ధ‌రామ‌య్య ఇలా న‌మ్మ‌కాయ ప‌ట్టుకుని తిర‌గ‌డం వెన‌క ఒక కార‌ణం ఉంది. ఈ మ‌ధ్య‌నే సీఎం పెద్ద కుమారుడు మృతి చెందాడు. దీంతో కుటుంబ‌మంతా శోక సంద్రంలో ఉంది. కుమారుడు మ‌ర‌ణానంత‌రం చాలా పూజా కార్య‌క్ర‌మాలు చేశారు. పుత్ర‌శోకం నుంచి వీలైనంత త్వ‌ర‌గా బ‌య‌ట‌ప‌డాలంటే మంత్రించిన నిమ్మ‌కాయ చేతులో ప‌ట్టుకుని తిర‌గాల‌ని ఎవ‌రో చెప్పార‌ట‌! అందుకే, మంత్రించిన కాయ‌ను స‌ర్వ‌కాలస‌ర్వావ‌స్థ‌ల‌యందూ వెంట ఉంచుకుంటున్నార‌ట‌.

కొద్ది రోజుల కింద‌ట కూడా ఇలానే మూఢ‌న‌మ్మ‌కాల పేరుతో బంగారులాంటి కారును వాడ‌టం మానేశారు! కార‌ణం ఏంటంటే... కారు మీద కాకి వాలింద‌ట‌! కాకి వాలిన కారును వాడ‌కూడ‌ద‌ని ఎవ‌రో కూశార‌ట‌. అంతే, వేంట‌నే కొత్త కారును కొనిపించేశారు. ముఖ్య‌మంత్రి హోదా ఉండి మూఢ న‌మ్మ‌కాల‌ను మ‌రీ ఇంత గుడ్డిగా న‌మ్మేస్తుంటే ఎలా..? ఉంటే ఉండొచ్చు... కానీ, అవేవో నాలుగు గోడ‌ల మ‌ధ్య‌నా ఉండాలి. అంతేగానీ, ఇలా బ‌హిరంగ ప్ర‌ద‌ర్శ‌న‌లు అవ‌స‌ర‌మా అనేది కొంత‌మంది ప్ర‌శ్న‌!