సిద్ధరామయ్య అంత పని చేశారా?

Wed May 16 2018 23:13:20 GMT+0530 (IST)

రాజకీయాల్లో నిఘా ఎక్కువైపోతుంది. ఫోన్ ట్యాపింగులు సాధారణమైపోతున్నాయి. మరీ ముఖ్యంగా రాజకీయం రంజుగా సాగుతున్న సమయంలో అయితే ఇది మరీ ఎక్కువగా ఉంటోంది. తాజాగా ఆసక్తి రేపుతున్న కన్నడ పాలిటిక్సులోనూ ట్యాపింగ్ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆపద్ధర్మ సీఎంగా కొనసాగుతున్న సిద్ధరామయ్యపై బీజేపీ నేత ఒకరు ఈ ఆరోపణ చేశారు. అక్కడితో ఆగకుండా కేంద్ర హోంశాఖకు కూడా లేఖ రాశారు.
    
ఆపద్దర్మ ముఖ్యమంత్రిగా ఉణ్న సిద్దరామయ్య తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని.. తమ ఫోన్లను ట్యాప్ చేయిస్తున్నారని బీజేపీ ఎంపీ శోభా కరాండ్లజే ఆరోపించారు. 'కర్ణాటక ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందన్న ప్రతీదానికి మా వద్ద ఆధారాలున్నాయి. మా ఫోన్లను ట్యాప్ చేయిస్తూ వ్యక్తిగత హక్కులకు ప్రభుత్వం విఘాతం కలిగిస్తోంది' అంటూ కేంద్ర హోంశాఖకు ఆమె లేఖ రాశారు. ఇతర నేతలు జీఎం సిద్దేశ్వర - పీసీ మోహన్ - అరవింద్ లింబవల్లితో తాను జరిపిన ఫోన్ సంభాషణలు ట్యాప్ చేశారని ఆమె ఆరోపించారు.
    
కాగా ఎన్నికల ఫలితాల తరువాత బీజేపీ రూ.100కోట్లు ఆఫర్ చేసి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూస్తోందని జేడీఎస్ సీఎం అభ్యర్థి కుమారస్వామి ఆరోపించడం.. కాంగ్రెస్ కూడా తమ నేతలకు బీజేపీ ఎర వేస్తోందని ఆరోపించిన నేపథ్యంలోనే బీజేపీ అందకు కౌంటర్ గా ఈ ఆరోపణలు చేస్తోందన్న వాదన ఒకటి వినిపిస్తోంది.