Begin typing your search above and press return to search.

మోడీపై కర్ణాటక సీఎం కామెంట్లు విన్నారా

By:  Tupaki Desk   |   30 Aug 2016 9:33 AM GMT
మోడీపై కర్ణాటక సీఎం కామెంట్లు విన్నారా
X
కర్ణాటకకు చెందిన మాజీ ఎంపీ - నటి రమ్య రేకెత్తించిన వివాదం ఇంకా రగులుతూనే ఉంది. ఈ వ్యవహారంలో ప్రధాని మోడీకి ఎలాంటి సంబంధం లేకున్నా విమర్శకులు మాత్రం ఆయన పేరును తీసుకొచ్చి ఏకిపడేస్తున్నారు. తాజాగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కూడా నటి రమ్యకు మద్దతు పలుకుతూ మోడీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మోడీ ఎలాంటి షెడ్యూలు లేకుండానే పాకిస్థాన్ వెళ్లి రాగా లేని తప్పు ఇప్పుడు రమ్య వ్యాఖ్యల్లో ఏముందని ఆయన ప్రశ్నించారు. మోడీకి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఏమైనా బంధువా అంటూ ఆయన మండిపడ్డారు. అంతేకాదు.. అప్పుడెప్పుడో జిన్నాను పొగుడుతూ అద్వానీ చేసిన వ్యాఖ్యలను కూడా గుర్తు చేసి మరీ ఆయన రమ్యకు మద్దతు పలికారు.

మోడీ ఎవరికీ చెప్పకుండా, అధికారిక షెడ్యూల్ ఖరారు కాకుండా నేరుగా నవాజ్ షరీఫ్ ఇంట్లో శుభకార్యానికి హాజరైతే ఎవరూ తప్పుపట్టలేదని.. కానీ.. నటి రమ్య పాకిస్థాన్ నరకం కాదని అన్నంత మాత్రాన వివాదం రేపారని ఆయన అన్నారు. గతంలో బీజేపీ అగ్రనేత ఎల్.కె.అద్వానీ పాకిస్థాన్ జాతిపిత మహ్మద్ అలీ జిన్నాను పొగిడినప్పుడు ఆర్ ఎస్ ఎస్ - బీజేపీ నేతలు ఎందుకు విమర్శించలేదని ఆయన నిలదీశారు. చవకబారు రాజకీయాల్లో భాగంగా రమ్య వ్యాఖ్యలను ఆర్ ఎస్ ఎస్ నేతలు వివాదం చేయాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు.

కాగా ఇటీవల పాకిస్థాన్ లో పర్యటించిన నటి రమ్య అక్కడి నుంచి తిరిగొచ్చిన తరువాత మాట్లాడుతూ అందరూ అనుకుంటున్నట్లుగా పాకిస్థానేమీ నరకం కాదని అన్నారు. దీనిపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. రమ్య క్షమాపణలు చెప్పాలని కూడా కోరారు. అయితే.. ఆమె మాత్రం ఏమాత్రం తగ్గలేదు. తన మాటల్లో తప్పేమీ లేదన్నారు. కాంగ్రెస్ సీనియర్ లీడర్ దిగ్విజయ్ సింగ్ కూడా ఇంతకుముందు సిద్ధరామయ్య మాదిరిగానే మోడీకి లేని తప్పు రమ్య విషయంలో తప్పెలా అవుతందని ప్రశ్నించారు.