Begin typing your search above and press return to search.

అంతేమరీ.. సిద్ధరామయ్య మారాడండీ..

By:  Tupaki Desk   |   16 May 2018 10:18 AM GMT
అంతేమరీ.. సిద్ధరామయ్య మారాడండీ..
X

అధికారం ఉంటేనే కింగ్.. లేకపోతే బొంగే అన్నట్టు తయారైంది ప్రస్తుత పరిస్థితులు.. నిన్నటి వరకు తిట్టుకున్న నోళ్లే నేడు పొగుడుకుంటాయి.. సై అంటే సై అని తొడలు కొట్టుకున్న వారే.. తొడలు రాసుకుంటూ తిరుగుతుంటారు.. అసలు రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం అంటూ ఉండదని నిరూపితమైంది..

అది 2005.. జేడీఎస్ లో దేవగౌడ కీలకంగా ఉన్నారు. అప్పుడే ఆయన కుమారుడు కుమారస్వామిని ఫోకస్ చేశారు. అప్పటివరకు జేడీఎస్ లో దేవెగౌడకు రైట్ హ్యాండ్ గా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఈ పరిణామాలను జీర్ణించుకోలేదు. వ్యతిరేకించారు. దీంతో ఆగ్రహించిన దేవెగౌడ.. సిద్ధరామయ్యను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు..

ఇక ఆ తర్వాత సిద్ధరామయ్య సొంతంగా పార్టీ పెట్టారు. దాన్ని నడపలేక కాంగ్రెస్ లో విలీనం చేశారు. అనంతరం కాంగ్రెస్ లో అంచెలంచెలుగా ఎదిగి 2013 కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ను లీడ్ చేసి అధికారంలోకి తీసుకొచ్చాడు. ప్రస్తుత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తరఫున అన్నీ తానై వ్యవహరించిన సిద్ధరామయ్య ఎన్నికల సభల్లో జేడీఎస్ చీఫ్ దేవెగౌడను, ఆయన కుమారుడిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి చాలా విమర్శలు చేశారు.. కానీ అక్కడికి కట్ చేస్తే..

కాంగ్రెస్ కు కర్ణాటకలో సీట్లు రాలేదు. కేవలం 78 మంది మాత్రమే గెలిచారు. అధికారం ఎలాగూ కల్ల.. అందుకే కాంగ్రెస్ అధిష్టానం చెప్పినట్టు జేడీఎస్ కు భేషరతుగా మద్దతిస్తున్నట్టు సిద్ధిరామయ్యే చెప్పాల్సి వచ్చింది. అంతేకాదు.. తను తిట్టిన కుమారస్వామినే చేయిపట్టుకొని గవర్నర్ దగ్గరకు తీసుకెల్లి మద్దతు లేఖ అందించాడు. అంతేకాదు అదే చేయిపట్టుకొని దేవగౌడను కలిసి రెండు చేతులు జోడించి పెద్దాయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఇలా సిద్ధరామయ్య అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. ఇప్పుడు పోయిన తర్వాత మరొకలా ప్రవర్తిస్తూ అసలు సిసలు రాజకీయ నేతకు ప్రతిరూపంగా కనిపిస్తున్నాడు.