Begin typing your search above and press return to search.

ప్ర‌తిప‌క్షాల‌కు అస్త్రం ఇస్తున్న ఏపీ మంత్రులు

By:  Tupaki Desk   |   6 May 2016 2:50 PM GMT
ప్ర‌తిప‌క్షాల‌కు అస్త్రం ఇస్తున్న ఏపీ మంత్రులు
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కు ప్ర‌త్యేక హోదాపై కేంద్రం దోబూచులాట‌ - అభివృద్ధికి స‌హ‌క‌రించే విష‌యంలో కేంద్రం మాట‌మార్చ‌డంపై ఇప్ప‌టికే అసంతృప్తులు ప్రారంభ‌మ‌వుతుండ‌గా... తాజాగా ఏపీ పాల‌కుల కామెంట్లు మ‌రింత ఆజ్యం పోసే విధంగా త‌యార‌వుతున్నాయ‌నే భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. దేశీయ స‌గ‌టు కంటే ఆంధ్ర‌ప్రదేశ్ సగ‌టు ఎక్కువ‌గా ఉంద‌ని బడ్జెట్‌ లో ప్ర‌క‌టించ‌డం ఒకింత చ‌ర్చ‌కు దారితీసిన సంగ‌తి తెలిసిందే. ఆశించినంత ఎదుగుదుల లేద‌ని చెప్తూనే అధిక వృద్ధి ఎలా సాధ్య‌మ‌ని ప‌లువురు ప్ర‌శ్నించారు. తాజాగా మంత్రులు ప్ర‌త్యేక హోదాతో ద‌క్కే లాభం కంటే మ‌రింత ఎక్కువ‌గానే చేశామ‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రోడ్లు భవనాల శాఖా మంత్రి శిద్ధా రాఘవరావు జిల్లాలో ఏర్పాటుచేసిన కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయిన తరువాత ఆర్థిక పరిస్థితి ఎంత దిగజారిపోయిందో వ్యాఖ్యానించారు. అయినప్ప‌టికీ ప్రభుత్వం ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూనే, మరోవైపు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రం చేయనన్ని అభివృద్ధి పనులు ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు చేస్తున్నారని 22 నెలల కాలంలో గత ప్రభుత్వాలేవీ చేయనంత అభివృద్ధి సాధించామన్నారు. ఎంపీ మాగంటి మురళీమోహన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిగెత్తే నీటిని నడిపించాలని, నడిచే నీటిని నిలపాలని నినాదంతో ముందుకు వెళుతున్నార‌ని దీన్ని అందరూ అమలు చేయాలని కోరారు.

రాష్ట్ర అభివృద్ధి విష‌యంలో ముఖ్య‌మంత్రికి అండ‌గా ఉండేలా నిల‌వ‌డంలో త‌ప్పేమీ లేనప్ప‌టికీ ఈ స్థాయిలో ప్ర‌చారం చేయ‌డం వ‌ల్ల ప్ర‌తిప‌క్షాల‌కు, బీజేపీ వ‌ర్గాల‌కు చాన్స్ ఇచ్చిన‌ట్లే అవుతుంద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. మంత్రులు త‌మ ప్ర‌చారం విష‌యంలో ఒకింత జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఉందేమో.