Begin typing your search above and press return to search.

ఆయ‌న ఓటేయ‌టానికి భారీ ఏర్పాట్లు చేశారు!

By:  Tupaki Desk   |   20 May 2019 5:10 AM GMT
ఆయ‌న ఓటేయ‌టానికి భారీ ఏర్పాట్లు చేశారు!
X
ఓటు వేయ‌టం కోసం ఎన్నిక‌ల సంఘం ప్ర‌త్యేకంగా వాహ‌నం ఏర్పాటు చేయ‌టం.. స‌ద‌రు ఓట‌రు ఓటు వేసేందుకు వ‌స్తుంటే ఆయ‌నకు స్వాగ‌తం చెప్పేందుకు సిబ్బంది సిద్ధంగా ఉండ‌టం.. ఆయ‌న ఓటు వేయ‌టానికి ప్ర‌త్యేకంగా అధికారులు ఏర్పాట్లు చేయ‌టం లాంటివి దేశంలో ఎక్క‌డైనా క‌నిపిస్తుందా? చివ‌ర‌కు దేశ ప్ర‌ధ‌మ పౌరుడు రాష్ట్రప‌తి ఓటు వేయ‌టానికి కూడా ఈ త‌ర‌హా ఏర్పాట్లు ఎన్నిక‌ల సంఘం చేయ‌దు.

మ‌రి.. అంత‌టి వీవీఐపీ ఓట‌రు ఎవ‌రు? ఆయ‌న‌కు ఎందుకంత ప్రాధాన్య‌త ఇస్తారంటే.. దాని వెనుక ఘ‌న చ‌రిత్ర ఉంది మ‌రి. స్వ‌తంత్ర భార‌తంలో జ‌రిగిన తొలి లోక్ స‌భ ఎన్నిక‌ల నుంచి తాజాగా జ‌రిగిన 16వ లోక్ స‌భ ఎన్నిక వ‌ర‌కూ అన్ని ఎన్నిక‌ల్లోనూ ఓటుహ‌క్కు వినియోగించుకున్న వ్య‌క్తి శ్యామ్ శ‌ర‌ణ్ నేగి. ఆయ‌న స్పెషాలిటీ ఏమిటంటే.. ఎలాంటి వైప‌రీత్యాలు.. వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు స‌రిగా లేకున్నా.. అన్నింటి భ‌రించి మ‌రీ ఓటేసేశారు.

వీట‌న్నింటికి మించి ఆయ‌న దేశ ఓట‌ర్ల లిస్టులో ఆయ‌నే మొద‌టి ఓట‌రు. ఇప్పుడు ఆయ‌న వ‌య‌సు 103 సంవ‌త్స‌రాలు. ఇంత‌టి ముదిమి వ‌య‌సులోనూ ఓటు వేయ‌టానికి ఆయ‌న చూపించే ఉత్సాహం స్ఫూర్తిని రేకెత్తిస్తోంద‌ని చెప్పాలి. దేశంలో మొద‌టి ఓట‌రు (ఓట‌ర్ల లిస్టులో మొద‌టిపేరు ఆయ‌న‌దే) అయిన శ్యామ్ శ‌ర‌ణ్ నేగి ఆదివారం జ‌రిగిన చివ‌రి విడ‌త పోలింగ్ లో ఓటేశారు.

హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లోని కిన్నౌర్ జిల్లా క‌ల్పా గ్రామానికి చెందిన ఆయ‌న‌.. త‌న తొలి ఓటును 1951లో జ‌రిగిన తొలి ఎన్నిక‌ల్లో ఓటుహ‌క్కును వినియోగించుకున్నారు. శ‌ర‌ణ్ నేగిని ఇంటి నుంచి పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చి ఆయ‌న ఓటేసేందుకు ఎన్నిక‌ల సంఘం అధికారులు ప్ర‌త్యేక ఏర్పాట్లు చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తొలి ఎన్నిక‌ల్లో ఆయ‌న ఎక్క‌డైతే ఓటు వేశారో.. ఈసారి అదే గ్రామంలోని ప్రాథ‌మిక పాఠ‌శాల‌లోనే ఈసారి ఓటు వేయ‌టం మ‌రో విశేషంగా చెప్పాలి.