Begin typing your search above and press return to search.

శ్రీవారి క్యూలైన్లో పెను ప్ర‌మాదం తృటిలో త‌ప్పింది

By:  Tupaki Desk   |   12 Oct 2017 6:56 AM GMT
శ్రీవారి క్యూలైన్లో పెను ప్ర‌మాదం తృటిలో త‌ప్పింది
X
ఈ మ‌ధ్య‌న ముంబ‌యి స‌బ‌ర్బ‌న్ రైల్వే వంతెన మీద జ‌రిగిన భారీ తొక్కిస‌లాట గుర్తుందా? వ‌ర్షం కురుస్తున్న వేళ‌.. పూలు ప‌డిపోతున్నాయ‌న్న మాట‌ను.. వంతెన ప‌డిపోతుంద‌న్నట్లుగా వినిపించ‌టంతో భారీ ప్రాణ‌న‌ష్ట‌మే వాటిల్లింది. తెలుగులో పూల‌కు.. వంతెన‌కు శాస్త్రం తేడా ఉన్నా.. హిందీలో మాత్రం ఫూల్‌.. పూల్ అన్న చిన్న తేడానే అంత‌మంది ప్రాణాల మీద‌కు తీసుకొచ్చింది.

నిజానికి ఇలాంటి అపాయం జ‌న‌స‌మ‌ర్ధం ఎక్కువ‌గా ఉండే ఏ ప్రాంతంలో అయినా పొంచి ఉంటుంది. అందుకే.. జ‌నాల ర‌ద్దీ ఎక్కువ‌గా ఉన్న ప్రాంతాల్లో అపోహ‌లు త‌లెత్త‌కుండా ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. తాజాగా తిరుమ‌లలో శ్రీవారి ద‌ర్శ‌నం కోసం వేచి చూస్తున్న భ‌క్తుల క్యూ లైన్ల‌లోని క‌మ్మీలు క‌రెంటు షాక్ కొడుతున్నాయ‌న్న మాట తొక్కిస‌లాట‌కు దారి తీసింది.

శ్రీవారి ద‌య‌తో ఎలాంటి ప్రాణ న‌ష్టం వాటిల్ల‌కుండా పెను ప్ర‌మాదం తృటిలో త‌ప్పింది. వాస్త‌వానికి ఇలాంటి మాట‌లు వెనుకా ముందు చూసుకోకుండా ప్ర‌జ‌ల్లో ఆందోళ‌న‌ను పెంచేస్తాయి. అన‌వ‌స‌ర‌మైన విషాదాల‌కు దారి తీస్తాయి. బుధ‌వారం క్యూలైన్లో క‌రెంటు షాక్ కొడుతుంద‌న్న మాట.. అప్ప‌టివ‌ర‌కూ ప్ర‌శాంతంగా ఉన్న భ‌క్తుల్లో భ‌యాందోళ‌న‌ల‌కు గురి చేసింది. వెంట‌నే.. ప‌రుగులు పెట్ట‌టం.. ఇద్ద‌రు మ‌హిళ‌లు కింద ప‌డిపోవ‌టం లాంటివి చోటు చేసుకున్నాయి. పిల్ల‌ల‌తో ఉన్న వారి ఆందోళ‌న‌కు అంతే లేదు.

క‌రెంట్ షాక్ మాట‌ల‌తో హుటాహుటిన చేరుకున్న టీటీడీ సిబ్బంది.. చెక్ చేయ‌గా అలాంటిదేమీ లేద‌ని తేలింది. అయితే.. త‌మ‌కు క‌రెంటు షాక్ కొట్టిన‌ట్లుగా క్యూలైన్లోని త‌మిళ‌నాడు కుటుంబం ఒక‌టి అనుమానం వ్య‌క్తం చేసింది. ఈ ఎపిసోడ్‌లో అదృష్టం ఏమిటంటే.. భక్తుల్లో భ‌యాందోళ‌న‌లు త‌లెత్తినా.. వెంట‌నే కంట్రోల్ అయ్యారు. అన్నిసంద‌ర్భాలు ఇలానే ఉండ‌వు. ఇలాంటి మాట‌లు వాయు వేగంతో విస్త‌రించ‌టంతో పాటు.. లేనిపోని భ‌యాందోళ‌న‌లకు కార‌ణ‌మ‌వుతాయి. నిజానికి బుధ‌వారం నాటి అనుభ‌వం గుణ‌పాఠం లాంటిది. ఈ రోజు కాకున్నా రేపొద్దున అయినా.. క్యూలైన్ల‌కు క‌రెంటు షాక్ కొట్టే అవ‌కాశం ఉంద‌న్న అనుమానం భ‌క్తుల మ‌న‌సుల్లో ఉంటుంది. అందుకే.. క‌రెంటు షాక్‌ కు వీలు లేని మెటీరియ‌ల్ తో క్యూ లైన్ల‌ను యుద్ధ‌ప్రాతిప‌దిక‌న మార్చాల్సిన అవ‌స‌రం ఉంది. అదే స‌మ‌యంలో.. ఆ విష‌యాన్ని పెద్ద ఎత్తున ప్ర‌చారం చేయ‌టం ద్వారా.. అన‌వ‌స‌ర‌మైన భ‌యాందోళ‌న‌ల‌కు చెక్ పెట్టే వీలుంది. నిధుల‌కు కొర‌త లేని టీటీడీ ఈ ప‌ని ఎంత త్వ‌ర‌గా చేస్తే అంత మంచిద‌న్న అభిప్రాయాన్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు.