Begin typing your search above and press return to search.

మాల్స్.. హోటల్స్ లోనూ ఆవిర్భావ వేడుకలు

By:  Tupaki Desk   |   24 May 2016 4:50 AM GMT
మాల్స్.. హోటల్స్ లోనూ ఆవిర్భావ వేడుకలు
X
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని భారీగా ప్లాన్ చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. జూన్ 2న నిర్వహించే తెలంగాణ ఆవిర్భావ వేడుకల గురించి ఇప్పటికే పలుమార్లు చెప్పిన కేసీఆర్ తాజాగా ఆసక్తికర అంశాల్ని చెప్పుకొచ్చారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల్ని తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్వహించటం ఒక ఎత్తు అయితే..ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు.

అయితే.. ఈ విధానాన్ని ప్రైవేటు సెక్టార్ కు కూడా విస్తరించాలన్నది కేసీఆర్ ఆలోచనగా చెప్పాలి. తాజాగా ఆయన మాటలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ దీపాలతో అలంకరించి.. వేడుకలా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. తాజాగా ఆ వేడుకల హడావుడిని ఆర్టీసీ బస్టాండ్లు.. రైల్వే స్టేషన్లు.. ఎయిర్ పోర్ట్ లకే కాదు.. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న హోటల్స్.. షాపింగ్ మాల్స్ కు విస్తరించాలన్న విషయాన్ని స్పష్టం చేశారు.

ఆవిర్భావ వేడుకల్ని ఎలా నిర్వహించాలన్న విషయంపై స్పష్టత ఇచ్చిన ఆయన.. రాష్ట్ర అవతరణ వేడుకల్ని ఘనంగా నిర్వహించాలని.. తొలుత అవరవీరుల స్థూపాల వద్ద నివాళులు ఆర్పించిన తర్వాతే ఉత్సవాల్ని ప్రారంభించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వేడుకల్ని ఎలా చేయాలో చెప్పుకొచ్చిన కేసీఆర్.. ‘‘అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలి. ఆఫీసులన్నింటిని విద్యుత్ దీపాలతో అలంకరించాలి. అనాథశరణాయాలు.. అంధుల పాఠశాలలు.. ఆసుపత్రుల్లో స్వీట్లు.. పండ్లు పంచాలి. నాన్ వెజ్ పెట్టాలి. ఉపాధి కీలకు సైతం వీటిని పంపిణీ చేయాలి. ఆర్టీసీ బస్టాండ్లలో.. రైల్వే స్టేషన్లో.. ఎయిర్ పోర్ట్ లతో పాటు అన్ని హోటల్స్.. మాల్స్ లోనూ ఉత్సవాలు జరగాలి’’ అని స్పష్టం చేయటం గమనార్హం.

ఉత్సవాలు అన్నవి ఎవరికి వారు వారికి వారుగా సొంతంగా చేస్తే బాగుంటుంది. కానీ.. అందుకు భిన్నంగా ప్రభుత్వమే.. ఉత్సవాలు తప్పనిసరి అన్నట్లుగా.. పలు విభాగాల్ని ప్రస్తావించి మరీ ఏర్పాట్లు చేయాలని చెప్పటం ఇప్పుడు ఆసక్తికరంగా మారినట్లే. మిగిలిన విషయాల్లో ఇలాంటి తప్పనిసరి భావనపై విమర్శలు వెల్లువెత్తే అవకాశం ఉంది. కానీ.. తీవ్ర భావోద్వేగంతో కూడిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్ని అక్కడా.. ఇక్కడా అన్న తేడా లేకుండా ప్రతి చోటా ఈ హడావుడి కనిపించాలన్నదే కేసీఆర్ ఆలోచన అన్నట్లు కనిపిస్తోంది. చూస్తుంటే.. గడిచిన రెండేళ్లకంటే భారీగా ఈసారి ఆవిర్భావ వేడుకల హడావుడి కనిపించేటట్లుగా ఉందని చెప్పాలి.