Begin typing your search above and press return to search.

చాందిని హ‌త్య ద‌ర్యాప్తు పోలీసుల‌కే షాకిచ్చింది

By:  Tupaki Desk   |   14 Sep 2017 4:50 AM GMT
చాందిని హ‌త్య ద‌ర్యాప్తు పోలీసుల‌కే షాకిచ్చింది
X
కిడ్నాప్‌కు గురైంద‌ని భావించిన ప్ల‌స్ టూ విద్యార్థిని చాందిని హ‌త్య‌కు గురి కావ‌టం ఒక సంచ‌ల‌నం అయితే.. ఒక‌ప్ప‌టి క్లాస్ మేట్ ఆమెను అంతమొందించిన విష‌యం ఇప్పుడు మ‌రింత షాకింగ్ గా మారింది. ఈ కేసును స‌వాలుగా తీసుకొన్న సిటీ పోలీసులు నిందితుడ్ని ప‌ట్టుకునేందుకు ప‌లుకోణాల్లో ప్ర‌య‌త్నించి స‌క్సెస్ అయ్యారు.

గుర్తు తెలియ‌ని మృత‌దేహంగా బ‌య‌ట‌కు వ‌చ్చిన డెడ్‌ బాడీని చాందినిదిగా గుర్తించిన త‌ర్వాత కేవ‌లం 24 గంట‌ల వ్య‌వ‌ధిలోనే పోలీసులు ఈ కేసును చేధించారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. ప‌లు ఛాన‌ళ్లు.. ప‌త్రిక‌ల్లో నిందితుడి పేరు ప్ర‌స్తావిస్తున్నా.. అలా చేయ‌టం నేరం.

ఎందుకంటే.. చాందినిని హ‌త్య చేసిన నిందితుడు 17 సంవ‌త్స‌రాలు మాత్ర‌మే. అత‌ను బాల‌నేర‌స్తుడి కింద‌కు వ‌స్తారు కాబ‌ట్టి.. చ‌ట్ట‌ప్ర‌కారం అత‌డి పేరును వెల్ల‌డించ‌టం.. అత‌డి ఫోటోను ప్ర‌చురించ‌టం నేర‌మ‌వుతుంది. అదే స‌మ‌యంలో.. సోష‌ల్ మీడియాలో పోస్టులు కూడా నేరం కింద‌కే వ‌స్తాయి కాబ‌ట్టి.. అంద‌రూ ఆచితూచి అన్న‌ట్లుగా ఈ నిందితుడి విష‌యంలో వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంది.

చాందినిని హ‌త్య చేసిన నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసుల విచార‌ణ‌లో అత‌గాడు చెప్పిన విష‌యాలు షాకింగ్ గా మార‌ట‌మే కాదు.. న‌గ‌రంలోని త‌ల్లిదండ్రుల‌కు దిమ్మ తిరిగిపోయేలా చేస్తాయ‌న‌టంలో ఎలాంటి సందేహం లేదు. త‌ల్లిదండ్రులు ఇస్తున్న స్వేచ్ఛ‌ను దుర్వినియోగం చేస్తున్న పిల్ల‌లు ఎలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు..తెలిసీ తెలియ‌ని వ‌య‌సులో చేస్తున్న త‌ప్పులు చివ‌ర‌కు ఎక్క‌డి వ‌ర‌కు వెళుతున్నాయో తాజా ఉదంతాన్ని చూస్తే అర్థ‌మ‌వుతుంది.

హ‌త్య‌కు గురైన చాందినితో పాటు ఫేస్ బుక్ లో స్నేహితులైన దాదాపు 52 మంది విద్యార్థులు నేష‌న‌ల్ డిప్ల‌మాటిక్ స‌మ్మిట్ పేరుతో ఒక ఫేస్ బుక్ పేజీని క్రియేట్ చేశారు. హైద‌రాబాద్‌.. బెంగ‌ళూరుల‌లోని ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూళ్ల‌లో చ‌దువుతున్న ఈ విద్యార్థుల్లో ప‌లువురు ఈ పేజీలో సభ్యులు. వీరిలో మొత్తం 52 మంది విద్యార్థిని.. విద్యార్థులు హైద‌రాబాద్ న‌డిబొడ్డున ఉన్న సెంట్ర‌ల్ కోర్టు హోట‌ల్ (ల‌క్డీకాపూల్ లో ఉంది) 23 గ‌దులు బుక్ చేసుకున్నారు. మైన‌ర్ల‌కు రూంలు ఇంత పెద్ద ఎత్తున ఎలా ఇచ్చార‌న్న‌ది ఒక ప్ర‌శ్న‌.

స‌మిట్ తో మొద‌లైన వీరి స‌మావేశం మూడు రోజుల పాటు హోట‌ల్లోనే ఉన్నారు. విచ్చ‌ల‌విడిగా క‌లిసి ఉన్నారు. హోట‌ల్ యాజ‌మాన్యం వీరికి లిక్క‌ర్‌ ను కూడా స‌ర‌ఫ‌రా చేసింద‌ని చెబుతున్నారు. ఇలా జ‌ల్సా చేసిన వారిలో హ‌త్యకు గురైన చాందిని కూడా ఒక‌రు. ఈ హోట‌ల్లో బ‌స చేసిన మైనర్ పిల్ల‌లంతా త‌మ ఇళ్ల‌ల్లో అబ‌ద్ధాలు చెప్పిన వారే కావ‌టం గ‌మ‌నార్హం.

ఇలా స‌మిట్ లో చాందినికి సోహెల్ అనే విద్యార్థి ప‌రిచ‌య‌మ‌య్యాడు. కేవ‌లం మూడు రోజుల ప‌రిచ‌యంతో అత‌నితో క్లోజ్ కూడా మూవ్ అయ్యింద‌ని ఆమెను హ‌త్య చేసిన నిందితుడు అనుమానించాడు. త‌న‌తో ల‌వ్ లో ఉన్న చాందిని మ‌రొక‌రితో క్లోజ్ గా ఎందుకు మూవ్ అవుతుంద‌న్న కోపంతోనే హ‌త్య చేశాడ‌న్న‌ది ఒక వాద‌న అయితే.. మ‌రొక‌రితో క్లోజ్ గా ఉంటూనే.. త‌న‌ను పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి చేయ‌టం వ‌ల్లే హ‌త్య చేసి ఉండొచ్చ‌న్న‌ది మ‌రో సందేహంగా చెబుతున్నారు. అయితే.. హ‌త్య‌కు ప్ర‌ధాన కార‌ణం.. అప్ప‌టికే చాందినిపై ప‌లు అనుమానాల‌తో ఉన్న నిందితుడు.. త‌న‌ను పెళ్లి చేసుకోవాల‌న్న ఒత్తిడితో పాటు.. త‌న మాట విన‌కుంటే ఆత్మ‌హ‌త్య చేసుకుంటాన‌ని త‌ర‌చూ హెచ్చ‌రించ‌టంతో విసిగిపోయి ఆగ్ర‌హంతో హ‌త్య చేసి ఉంటాడ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఇంట‌ర్ చ‌దివే పిల్ల‌లు ఇంట్లో అబ‌ద్ధాలు చెప్పి.. ఒక హోట‌ల్లో మూడు రోజులు గ‌డ‌ప‌టం ఒక ఎత్తు అయితే.. అదే వ‌య‌సులో ప్రేమ‌.. పెళ్లి అనే వ‌ర‌కూ వెళ్ల‌టం ఇంకో ఎత్తు. మొత్తంగా చూస్తే.. పిల్ల‌లు ఏం చేస్తున్నార‌న్న విష‌యాన్ని గుర్తించ‌కున్నా.. పిల్ల‌ల అల‌వాట్లు.. వారి స్నేహితులకు సంబంధించిన స‌మాచారాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు గుర్తించ‌ని త‌ప్పుల‌కు చాందిని.. ఆమెను హ‌త్య చేసిన నిందితుల రూపాల్లో త‌ల్లిదండ్రులు శిక్ష అనుభ‌వించాల్సి ఉంటుంద‌ని మాట పోలీసుల నోట వినిపించ‌టం గ‌మ‌నార్హం.