Begin typing your search above and press return to search.

హ‌నుమంతుడు ఎస్సీ .... కులం స‌ర్టిఫికెట్ ఇవ్వండి

By:  Tupaki Desk   |   8 Dec 2018 4:59 AM GMT
హ‌నుమంతుడు ఎస్సీ .... కులం స‌ర్టిఫికెట్ ఇవ్వండి
X
ఉత్తర్‌ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ రాజస్థాన్ ఎన్నికల ప్రచారం సందర్భం గా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగ‌తి తెలిసిందే. హనుమంతుడు దళిత గిరిజనుడని చెప్పారు. రామ భక్తులందరూ బీజేపీ కి ఓటు వేయాలని కోరారు. కేవలం రావణుడి ని పూజించే వాళ్లు మాత్రమే కాంగ్రెస్‌ కు ఓట్లు వేస్తారని పేర్కొన్నారు. ``హనుమంతుడు గిరిజనుడు. ఆయన అడవి లో నివసించేవాడు. రాముడి కోరిక మేరకు హనుమంతుడు తూర్పు నుంచి పడమర - ఉత్తరం నుంచి దక్షిణం ఇలా దేశంలో ని అన్ని ప్రాంతాల ప్రజలను ఏకం చేయడానికి ప్రయత్నించాడు. మేము కూడా రాముడి కోరికను నెరవేర్చే దాకా నిద్రపోం``అని తెలిపారు. అయితే ఈ వివాదం మ‌లుపు తిరిగింది. హ‌నుమంతుడు దళితుడని, ఈ మేరకు కుల ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి జిల్లా కలెక్టర్‌ కు ఓ పార్టీ ద‌ర‌ఖాస్తు చేసింది.

హనుమంతుడు దళితుడని యూపీ సీఎం పేర్కొన్న నేపథ్యం లో హనుమంతుడి సామాజికవర్గం గురించి చర్చ మొదలైంది. దీని పై స‌మాజ్‌ వాదీ పార్టీ అధ్య‌క్షుడు ములాయం సింగ్ యాద‌వ్ సోద‌రుడైన శివ్‌ పాల్ యాదవ్ సారథ్యంలోని ప్రగతి శీల్ సమాజ్‌ వాదీ పార్టీ (లోహియా) (పీఎస్‌ పీఎల్) అనూహ్య రీతిలో స్పందించి జిల్లా క‌లెక్ట‌ర్‌ కు ద‌ర‌ఖాస్తు చేసింది. వారంలో గా హనుమంతుడి కుల ధ్రువీకరణ పత్రం ఇవ్వకుంటే ఆందోళన చేపట్టనున్నట్లు శివ్‌ పాల్‌ యాదవ్ హెచ్చరించారు. పీ ఎస్‌ పీ ఎల్ యువజన విభాగం వారణాసి అధ్యక్షుడు హరీశ్ మిశ్రా మాట్లాడుతూ తాము జిల్లా కలెక్టర్ ఆఫీసు లో హనుమంతుడి కి కుల ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని దరఖాస్తు చేసినట్లు చెప్పారు. దరఖాస్తు పత్రం పై హనుమంతుడి ఫొటో - ఆయన తండ్రి గా మహారాజ్ కేసరి - తల్లి గా అంజనాదేవి ఫొటోగ్రాఫ్ అతికించారు. ప్రసిద్ధి చెందిన సంకట్ మోచన్ ఆలయాన్ని ఆయన నివాసం అని - కులం కాలమ్ వద్ద దళితుడు అని, వయస్సు అనంతం అని పేర్కొన్నారు.

కాగా, ఇదే వివాదం కారణంగా బీజేపీకి ఓ ఎంపీ గుడ్‌ బై చెప్పిన సంగ‌తి తెలిసిందే. హనుమంతుడు దళితుడేనని బీజేపీ ఎంపీ సావిత్రీ బాయిఫూలే నొక్కి చెప్పారు. `హనుమంతుడు దళితుడే. ఆయనను మనువాదులకు బానిసగా మార్చారు. రాముడి కోసం ఆయన ఎంతో చేశారు. కానీ, చివరికి హనుమంతుడికి ఓ తోక ను తగిలించి - ఆయన ముఖానికి మసిపూసి కోతి గా ఎందుకు చిత్రీకరించారు?` అని ప్రశ్నించారు. హనుమంతుడు కూడా మనిషి అని, ఆయన కోతి కాదని తెలిపారు. దళితుడైనందుకు హనుమంతుడు కూడా అవమానాన్ని ఎదుర్కొన్నారని చెప్పారు. అసలు దళితులను ఎందుకు మనుషులుగా గుర్తించరని ప్రశ్నించారు.