Begin typing your search above and press return to search.

ఇలాంటి చిత్రమైన బౌలింగ్ ఎప్పుడైనా చూశారా?

By:  Tupaki Desk   |   9 Nov 2018 12:23 PM GMT
ఇలాంటి చిత్రమైన బౌలింగ్ ఎప్పుడైనా చూశారా?
X
క్రికెట్ చరిత్రలో ఇప్పటిదాకా ఎన్నో విచిత్రమైన బౌలింగ్ యాక్షన్లను చూశాం. దక్షిణాఫ్రికా స్పిన్నర్ పాల్ ఆడమ్స్ మొత్తంగా శరీరాన్ని కిందికి వంచి వేసే బౌలింగ్ చాలా చిత్రంగా అనిపించేది. శ్రీలంక స్పిన్ దిగ్గజం గుడ్లు ఉరుముతూ చేసే బౌలింగ్ మరో రకం. పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ సోహైల్ తన్ వీర్‌ రాంగ్ ఫుట్‌ తో వేసే బౌలింగ్ కూడా వెరైటీగా అనిపించేది. ఇంకా ఇలాంటి వైవిధ్యమైన శైలి ఉన్న బౌలర్లు క్రికెట్ చరిత్రలో చాలామంది ఉన్నారు. ఐతే ఇప్పటిదాకా చూసిన బౌలింగ్ యాక్షన్లన్నీ ఒకెత్తయితే.. తాజాగా ఒక బౌలర్ శైలి మరో ఎత్తు. బౌలింగ్ చేసే ముందు క్రీజు దగ్గర 360 డిగ్రీలు చుట్టూ తిరిగి అతను బంతిని వేస్తుండటం విశేషం. భారత దేశవాళీ మ్యాచ్‌లోనే ఈ చిత్రం చోటు చేసుకుంది.

సీకే నాయుడు ట్రోఫీలో భాగంగా ఉత్తర ప్రదేశ్ స్పిన్నర్ శివ సింగ్ ఈ చిత్రమైన బౌలింగ్ శైలితో అందరినీ ఆశ్చర్యపరిచాడు. మామూలుగానే బౌలింగ్ క్రీజు దగ్గరికి పరుగెత్తుకుంటూ వచ్చిన అతను.. ఉన్నట్లుండి 360 డిగ్రీలు రౌండ్ తిరిగి ఆ తర్వాత బంతిని సంధించాడు. దీంతో అటు బ్యాట్స్‌మన్ - ఇటు అంపైర్ ఆశ్చర్యానికి గురయ్యారు. బ్యాట్స్‌మన్ అయోమయానికి గురై.. బంతిని డిఫెన్స్ ఆడాడు. అంపైర్ దీన్ని డెడ్ బాల్‌ గా ప్రకటించాడు. కానీ బౌలర్ ఇదేం అన్యాయం అన్నాడు. ప్రత్యర్థి జట్టు కెప్టెన్ వచ్చి అంపైర్‌ తో వాదించాడు. మరో అంపైర్ కూడా జోక్యం చేసుకున్నాడు. కానీ బౌలింగ్ జట్టు ఎంత వాదించినా అంపైర్ ఒప్పుకోలేదు. దీన్ని డెడ్ బాల్‌ గానే ప్రకటించాడు. ఇలా బౌలింగ్ చేయడం కుదరదని చెప్పడంతో బౌలర్ బౌలింగ్ నుంచి తప్పుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.