Begin typing your search above and press return to search.

ఓడిపోతే ఆ సీఎం కేంద్ర‌మంత్రి అవుతార‌ట‌

By:  Tupaki Desk   |   19 Aug 2017 4:43 AM GMT
ఓడిపోతే ఆ సీఎం కేంద్ర‌మంత్రి అవుతార‌ట‌
X
గోవా ముఖ్య‌మంత్రి చేసిన వ్యాఖ్య‌ల వీడియో ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. గోవా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో చోటు చేసుకున్న నాట‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో ర‌క్ష‌ణ శాఖ మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్న మ‌నోహ‌ర్ పారీక‌ర్ ను గోవా సీఎంగా నియ‌మిస్తూ బీజేపీ నిర్ణ‌యం తీసుకోవ‌టం తెలిసిందే.

ప్ర‌ధానిగా మోడీ బాధ్య‌త‌ల్ని చేప‌ట్టిన కొద్ది నెల‌ల‌కే గోవా ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్న మ‌నోహ‌ర్ పారీక‌ర్ ను ఏరికోరి మ‌రీ ఢిల్లీకి పిలిపించుకొని కేంద్ర ర‌క్ష‌ణ శాఖను అప్ప‌గించ‌టం తెలిసిందే. సీఎంగా స‌క్సెస్ ఫుల్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న పారీక‌ర్ ను ఢిల్లీకి వెళ్ల‌టం ఇష్టం లేకున్నా.. మోడీ మాట కాద‌న‌లేక కేంద్ర‌మంత్రి బాధ్య‌త‌ల్ని స్వీక‌రించారు.

ఆ త‌ర్వాత సీఎం ప‌ద‌విని చేప‌ట్టిన వారి పాల‌న పెద‌వి విరిచేలా ఉండ‌టం..ఆ రాష్ట్ర అసెంబ్లీకి నిర్వ‌హించిన ఎన్నిక‌ల్లో బీజేపీ అత్తెస‌రు సీట్ల‌ను మాత్రం సొంతం చేసుకుంది. గోవా పీఠాన్ని చేజిక్కించుకునేందుకు వేగంగా పావులు క‌దిపిన బీజేపీ.. ఇండిపెండెంట్లు.. ఇత‌రుల‌తో క‌లిసి మెజార్టీ తెచ్చుకొంది. సీఎంగా మ‌నోహ‌ర్ పారీక‌ర్ నియ‌మించేందుకు ఓకే అన‌టంతో ఆయ‌న్ను కేంద్ర‌మంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పించి.. హుటాహుటిన గోవాకు పంపి సీఎంను చేశారు.

దీంతో.. ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన మ‌నోహ‌ర్ పారీక‌ర్‌.. ఆర్నెల్ల వ్య‌వ‌ధిలో ఎమ్మెల్యే కావాల్సిన ప‌రిస్థితి చోటు చేసుకుంది. తాజాగా గోవాలో జ‌రుగుతున్న ఉప ఎన్నిక‌ల బ‌రిలో ఆయ‌న ఉన్నారు. ఈ ఎన్నిక ప్ర‌చారంలో భాగంగా పారీక‌ర్ చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మార‌ట‌మే కాదు.. బీజేపీకి మిత్రుడు శివ‌సేన సైతం ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది.

పారీక‌ర్ మాట్లాడిన ఒక వీడియో టేపులో ఆయ‌న మాట‌ల్ని ప్ర‌శ్నిస్తోంది. తాను ఉప ఎన్నిక‌ల్లో ఓట‌మి చెందితే ఢిల్లీకి వెళ్లి కేంద్ర రక్ష‌ణ శాఖామంత్రిగా ఉంటాన‌ని వ్యాఖ్యానించ‌టాన్ని శివ‌సేన ప్ర‌శ్నిస్తోంది. ప‌నాజీలో జ‌రిగే ఉప ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు త‌న‌ను ఓకే చేయ‌రేమోన‌ని పారీక‌ర్ భ‌య‌ప‌డుతున్నార‌ని.. ప్ర‌జ‌లు ఎన్నుకోక‌పోతే ఇంట్లో కూర్చోవాలే త‌ప్పించి మ‌ళ్లీ ర‌క్ష‌ణ‌శాఖ‌ను ఎంచుకుంటాన‌ని చెప్ప‌టం బాధ్య‌తారాహిత్యంగా అభివ‌ర్ణించారు. ర‌క్ష‌ణ శాఖ అంటే ఆట‌గా ఉందా? అని ఆయ‌న నిల‌దీశారు. ఎమ్మెల్యేగా సైతం ప్ర‌జ‌లు ఒప్పుకోని వ్య‌క్తిని ఏకంగా కేంద్ర ర‌క్ష‌ణ మంత్రిగా నియ‌మించుకునే అవ‌కాశం మ‌న వ్య‌వ‌స్థ‌లో ఉండ‌టం గురించి ప్ర‌జ‌లు మ‌రోసారి ఆలోచించాల్సిన అవ‌స‌రం ఉంది. నిజాయితీ ఉంటే చాలు.. స‌మ‌ర్థ‌త లేకున్నా.. ప్ర‌జాభిమానం లేకున్నా కీల‌క‌మైన ప‌ద‌వుల్లో కూర్చోవ‌టానికి వీలుగా వ్య‌వ‌స్థ ఉండ‌టం స‌రికాదేమోన‌న్న భావ‌న పారీక‌ర్ ఎపిసోడ్ ను చూస్తే అర్థం కాక మాన‌దు.