అంతా ఈజీకాదు మోడీజీ.. శివసేన సెటైర్..

Thu May 17 2018 14:25:01 GMT+0530 (IST)

కర్ణాటకలో యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.. బీజేపీ 104 స్థానాల్లో గెలుపొందగా.. కాంగ్రెస్ 78 - జేడీఎస్ 38 స్థానాల్లో గెలిచింది. శాసనసభలో బలం నిరూపించుకునేందుకు యడ్యూరప్పకు గవర్నర్ 15 రోజుల సమయం ఇచ్చారు. ఎన్నికలకు ముందే 17న సీఎంగా ప్రమాణం చేస్తానని ప్రకటించిన యడ్యూరప్ప అన్నట్టే  ఈరోజు చేసి  అందరికీ షాక్ ఇచ్చారు.కర్ణాటకలో బీజేపీ అనైతికంగా గద్దెనెక్కడంపై అందరూ విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఈ వివాదంపై మహారాష్ట్రకు చెందిన ఒకప్పటి బీజేపీ నేస్తం శివసేన స్పందించింది. మెజార్టీ ఎవరికీ ఉంటే వారినే గవర్నర్ పిలవాలని చెప్పింది. తద్వారా గవర్నర్ తీరును తప్పుపట్టింది. జేడీఎస్-కాంగ్రెస్ పార్టీలకు మెజార్టీ ఉందని శివసేన అభిప్రాయపడింది.
 
కర్ణాటకలో బీజేపీకి పూర్తి స్థాయి మెజార్టీ రాలేదని.. గవర్నర్ బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం సరికాదని అభిప్రాయపడింది. యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేసినా అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవడం అంత ఈజీ కాదని శివసేన అభిప్రాయపడింది. అలాగే కర్ణాటక ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా ఉన్నా 2019లో తాము బీజేపీతో కలిసేది లేదని.. ఒంటరిగానే పోటీచేస్తామని శివసేన అభిప్రాయపడింది.