Begin typing your search above and press return to search.

ద‌మ్ముంటే న‌న్ను అరెస్ట్ చేయ‌మంటున్న ఎంపీ

By:  Tupaki Desk   |   24 March 2017 12:46 PM GMT
ద‌మ్ముంటే న‌న్ను అరెస్ట్ చేయ‌మంటున్న ఎంపీ
X
ఇండియ‌న్ ఎయిర్‌లైన్స్ ఉద్యోగిని చెప్పుతో కొట్టిన వివాదాస్ప‌ద శివ‌సేన ఎంపీ ర‌వీంద్ర గైక్వాడ్‌ ఇవాళ ఢిల్లీ పోలీసులకు సవాలు విసిరారు. దమ్ముంటే ఢిల్లీ పోలీసులు తనను అరెస్ట్ చేయాలని ఆయన చాలెంజ్ చేశారు. ఇండియన్ ఎయిర్ లైన్స్ ఉద్యోగిని 25 సార్లు చెప్పుతో కొట్టాన‌ని తానే చెప్పుకున్న గైక్వాడ్‌.. క్ష‌మాప‌ణ చెప్ప‌డానికి మాత్రం అంగీక‌రించ‌లేదు. ముందు ఆ ఉద్యోగినే చెప్ప‌మనండి.. త‌ర్వాత చూద్దామంటూ గైక్వాడ్ అన‌డం గ‌మ‌నార్హం. విమానంలో ఎక్కనివ్వకపోతే ఏం చేస్తారు అని అడగ్గా.. ఎందుకు ఎక్కనివ్వరు? అదే విమానంలో పుణె వెళ్తా అని ఆయన త‌న ధీమాను వ్య‌క్తం చేశారు.

మరోవైపు ఎయిర్ ఇండియాతోపాటు ఇతర ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ ఆయనపై నిషేధం విధించాయి. ఆయ‌న ఇక ఏ విమానంలోనూ ఎక్క‌కుండా బ‌హిష్క‌రించాయి. ఇండిగో ఆయన ఢిల్లీ టు పుణె టికెట్ ను రద్దు చేసింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఆయనను బ్లాక్ లిస్ట్ లో ఉంచినట్లు ఎయిరిండియా జనరల్ మేనేజర్ జీపీ రావు వెల్లడించారు.

మ‌హారాష్ట్ర‌లోని ఉస్మానాబాద్ నుంచి లోక్‌ స‌భ‌కు ఎన్నిక‌య్యారు గైక్వాడ్‌. త‌న‌కు బిజినెస్ క్లాస్ టికెట్ ఇవ్వ‌లేద‌న్న కార‌ణంగా గురువారం ఇండియ‌న్ ఎయిర్‌ లైన్స్ ఉద్యోగిపై ఆయ‌న చెప్పుతో దాడి చేయ‌డం వివాదాస్ప‌ద‌మైంది. అయితే ఆ విమానమంతా ఎకాన‌మీ క్లాస్ మాత్ర‌మే ఉండ‌టంతో ఆయ‌న‌ను వీఐపీగా భావించి ముందు సీట్లో కూర్చోబెట్టారు. అయినా గైక్వాడ్ మాత్రం దురుసుగా ప్ర‌వ‌ర్తించి ఉద్యోగిపై దాడిచేశారు. దీనికి సంబంధించిన వీడియో కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. విమానం ల్యాండ్ అయిన త‌ర్వాత కూడా ఆయ‌న కిందికి దిగ‌డానికి నిరాక‌రిస్తూ నిర‌స‌న తెలిపారు. అది స‌రికాద‌ని మేనేజ‌ర్ శివ‌కుమార్ న‌చ్చ‌జెప్ప‌డానికి ప్ర‌య‌త్నించ‌డంతో గైక్వాడ్ దాడికి పాల్ప‌డ్డారు. అటు శివ‌సేన పార్టీ కూడా త‌మ ఎంపీ తీరును త‌ప్పుబట్టింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/