Begin typing your search above and press return to search.

మోడీపై విరుచుకుప‌డ్డ మిత్ర‌ప‌క్షం

By:  Tupaki Desk   |   4 Oct 2015 10:36 AM GMT
మోడీపై విరుచుకుప‌డ్డ మిత్ర‌ప‌క్షం
X
కాలం క‌లిసిరాకుంటే ఏం జ‌రుగుతుంది అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విష‌యంలో నిరూపితం అవుతోంది. ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా బిహారీలను బుజ్జ‌గించ‌డంలో మోడీ చూపుతున్న ఆస‌క్తి ఇపుడు స‌ర్వత్రా చ‌ర్చ‌నీయాంశం అవుతున్న సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు బీజేపీ మిత్ర‌ప‌క్షం - ఎన్డీయే కూట‌మిలో భాగ‌స్వామ్య‌ప‌క్షం అయిన మ‌హారాష్ర్ట అగ్గిబ‌రాట‌ శివసేన మరోసారి మోడీ తీరుపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుపడింది. బిహార్ పై ఎనలేని ప్రేమ కురిపిస్తూ ప్యాకేజీలను ప్రకటిస్తున్నమోడీ తీరు కాకులను కొట్టి గద్దలకేసిన చందంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తింది. ఈ మేర‌కు శివ‌సేన‌ తన అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో మోడీ ప్రభుత్వ తీరుపై విమర్శలు ఎక్కుపెట్టింది.

మోడీకి ఎన్నిక‌లున్న రాష్ర్టం త‌ప్ప మ‌రేది ప‌ట్ట‌న‌ట్లుంద‌ని సామ్నా సంపాద‌కీయం మండిప‌డింది. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో కుదేలైన మహారాష్ట్రకు ఆర్థిక సాయం చేయకుండా కేంద్ర ప్ర‌భుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆ సంపాద‌కీయం వ్యాఖ్యానించింది. మ‌హారాష్ట్రలో విధించిన సర్ చార్జీ ద్వారా వసూలు చేసిన రూ. 1600 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం బిహార్ కు పంచి పెడుతోందని ఆరోపించింది. ఒకవైపు మహారాష్ట్ర కరువు పరిస్థితులతో అల్లాడుతోంటే ఆ నిధుల‌తో బిహార్ పై మోడీ వరాల జల్లు కురిపించ‌డం స‌బ‌బు అవుతుందా అని ప్ర‌శ్నించింది. మహారాష్ట్ర, విదర్భ, మరాట్వాడాలో వందలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోవడంలేదని ఆరోపించింది. బిహార్‌కు ప్రకటించినట్టుగా లక్షా పాతిక వేల కోట్ల రూపాయల ప్యాకేజీ మహారాష్ట్రకు అవసరం లేదని అయితే.....పంట నష్టపోయిన తమ రైతులను ఆదుకునేందుకు కేవలం 20,000-25,000 కోట్ల రూపాయలు సరిపోతాయంటూ సామ్నా సంపాద‌కీయం సూచించింది. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా మోడీ చేస్తున్న హామీలు ఆయ‌న‌కే బూమ‌రాంగ్ కావ‌డం, అది కూడా మిత్ర‌ప‌క్షాల నుంచి రావ‌డం ఆస‌క్తిక‌ర‌మే.