Begin typing your search above and press return to search.

ఒత్తిడికి త‌లొగ్గిన బాబు...శిల్పాకే టికెట్‌

By:  Tupaki Desk   |   21 April 2017 7:56 AM GMT
ఒత్తిడికి త‌లొగ్గిన బాబు...శిల్పాకే టికెట్‌
X
తెలుగుదేశంలో ఉప ఎన్నిక‌ల పంచాయ‌తీకి తెర ప‌డిన‌ట్లు తెలుస్తోంది. క‌ర్నూలు జిల్లా నంద్యాల శాసనసభా నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వంపై రేగిన వివాదం కొలిక్కి వచ్చినట్లు పార్టీ శ్రేణులు అంటున్నారు. ఉప ఎన్నికల్లో పోటీ చేయకపోతే తన రాజకీయ భవిష్యత్తుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీలో ఉండి తీరుతానని మాజీ మంత్రి శిల్పా మోహన్‌ రెడ్డి స్పష్టం చేసిన సంగ‌తి తెలిసిందే. అవ‌స‌ర‌మైతే త‌న భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ నిర్ణ‌యించుకుంటాన‌ని ప్ర‌క‌టించారు కూడా. దీంతో ఈ ప‌రిణామాలు పార్టీ న‌ష్ట‌పోయేందుకు కార‌ణం అవుతాయ‌ని భావించిన చంద్రబాబు ఉప ఎన్నిక‌ల్లో పోటీ చేసే విష‌యంలో శిల్పా వైపు మొగ్గుచూపిన‌ట్లు తెలుస్తోంది.

భూమా నాగిరెడ్డి హఠాన్మ‌రణం నేపథ్యంలో వచ్చిప‌డిన ఈ ఉప ఎన్నిక విష‌యంలో టీడీపీలో అంత‌ర్గ‌తంగా వార్ సాగుతున్న సంగ‌తి తెలిసిందే. దీంతో త‌న తండ్రి మ‌ర‌ణంతో వ‌చ్చిన ఎన్నిక కాబ‌ట్టి టికెట్ తమ కుటుంబానికే దక్కాలని మంత్రి భూమా అఖిలప్రియ పట్టుదలతో ఉన్నారు. మ‌రోవైపు త‌మకే అవ‌కాశం ఇవ్వాల‌ని సీనియ‌ర్ నేత శిల్పా ప‌ట్టుబ‌డుతున్నారు. వీరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా రెండోవర్గం నుంచి ఇక్కట్లు తప్పవని గ్రహించిన చంద్రబాబు ఒకింత గ్యాప్ ఇస్తూ చ‌ర్చ‌లు జ‌రిపారు. అయిన‌ప్ప‌టికీ ప‌రిష్కారం లేక‌పోవ‌డంతో రాబోయే వారం రోజుల్లో ఈ వివాదానికి తెరదించాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. శిల్పా సోదరులతో చంద్రబాబు అమరావతిలో సుదీర్ఘంగా చర్చించిన స‌మ‌యంలో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ సాగిన‌ట్లు స‌మాచారం. ఉప ఎన్నిక‌ల్లో పోటీ అవ‌కాశం నుంచి త‌ప్పుకుంటే శాసనమండలి చైర్మన్ పదవిని సీఎం చంద్ర‌బాబు ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపినా శిల్వా తిరస్కరించినట్లు తెలుస్తోంది. దీంతో బాబు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా తనపై నమ్మకం ఉంచాలని చెప్పి పంపినట్లు సమాచారం. ఒక దశలో పరోక్షంగా టికెట్ ఇవ్వడం ఖాయమని ఆయన సంకేతమిచ్చారని తెలుస్తోంది. దీంతో సంతృప్తి చెందిన శిల్పా సోదరులు పార్టీ మారాలన్న ఆలోచనను తాత్కాలికంగా పక్కనపెట్టి నియోజకవర్గంలోని తన కేడర్‌ను ఎన్నికలకు సిద్ధం చేసే పనిలో నిమగ్నం కావాలని నిర్ణయానికి వచ్చారని టిడిపి జిల్లా నేతల ద్వారా తెలుస్తోంది.

కాగా శిల్పాకు టికెట్ కేటాయింపు విషయంలో భూమా వర్గాన్ని బుజ్జగించేందుకు కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహనరెడ్డి, మాజీ మంత్రి ఫరూక్‌ తో చంద్రబాబు చర్చించనున్నట్లు తెలుస్తోంది. త్వరలో చంద్రబాబు జిల్లా పర్యటనకు రానున్నారని ఆ సమయంలో ఎస్వీ, ఫరూక్‌ తో మంతనాలు సాగుతాయని వారు అంటున్నారు. మొత్తంగా త‌మ నాయ‌కుడికే టికెట్ ఖ‌రారు అయింద‌ని శిల్పా వ‌ర్గం చేస్తున్న ప్ర‌చారంపై భూమా కుటుంబ స‌భ్యులు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలిమ‌రి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/