Begin typing your search above and press return to search.

ప్రపంచకప్ ముగింటి టీమిండియాకు షాక్

By:  Tupaki Desk   |   11 Jun 2019 9:34 AM GMT
ప్రపంచకప్ ముగింటి టీమిండియాకు షాక్
X
టీమిండియా విజయాల్లో సగం ఓపెనర్లు సాధించినవే ఉన్నాయి. ముఖ్యంగా విజయవంతమైన భారత ఓపెనర్ల జోడీ శిఖర్ ధావన్-రోహిత్ లు ప్రతీ మ్యాచ్ లోనూ గట్టి పునాదులు వేస్తూ టీమిండియా విజయానికి పునాదులుగా నిలబడుతున్నారు. తొలి మ్యాచ్ లో దక్షిణాఫ్రికాపై రోహిత్ సెంచరీ చేసి గెలిపిస్తే.. రెండో మ్యాచ్ లో బలమైన ఆస్ట్రేలియాపై రెచ్చిపోయి శిఖర్ ధావన్ విజయాన్ని అందించాడు.

ఇలా అద్భుతంగా కుదిరిన ఈ జోడీ ఇక కలిసి బ్యాంటింగ్ చేయలేదు. ఎందుకంటే ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో శిఖర్ దావన్ బ్యాంటింగ్ చేస్తుండగా గాయపడ్డాడు. అతడి చేతి బొటనవేలుకు బంతి బలంగా తగిలింది. అయినా క్రీజులో నిలిచి సెంచరీ చేశాడు. మ్యాచ్ ను గెలిపించాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు.

అయితే బ్యాంటింగ్ ముగిశాక శిఖర్ ఫీల్డింగ్ కు దిగలేదు. అతడి స్థానంలో రవీంద్ర జడేజ మొత్తం 50 ఓవర్లు ఫీల్డింగ్ చేశాడు. ఇక మ్యాచ్ ముగిశాక శిఖర్ కు వైద్య పరీక్షలు చేశారు. బొటనవేలు విరిగిందని తేలింది. దీంతో అతడు మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచి మంచి ఫామ్ లో ఉన్న శిఖర్ దూరం కావడం టీమిండియాకు భారీ దెబ్బే. ఈ ప్రభావం బ్యాంటింగ్ పై పడే ప్రమాదం ఉంది.

అయితే శిఖర్ ధావన్ స్థానంలో యువ క్రికెటర్లు రిషబ్ పంత్, అంబటి రాయుడులలో ఒకరికి అవకాశం దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. వీరిద్దరినీ టీమిండియా స్టాండ్ బైలుగా ఎంపిక చేసింది. ఇలా ధావన్ గాయం ఓ రకంగా తెలుగు క్రీడాకారుడు అంబటి రాయుడు, ఇక హిందీ ఆటగాడు రిషబ్ లకు వరంగానే మారిందని చెప్పవచ్చు. వీరిద్దరిలో ఒకరిని బీసీసీఐ ఎంపిక చేస్తుంది.

ఇక రోహిత్ కు జోడీగా ఓపెనర్ గా కేఎల్ రాహుల్ బరిలోకి దిగనున్నాడు. నాలుగో స్థానంలో రాయుడు లేదా పంత్ , రిజర్వ్ బెంచ్ కు చాన్స్ దక్కనుంది.