బాబు ముందే మోడీపై పేల్చిన శతృఘ్న

Tue Feb 12 2019 10:04:08 GMT+0530 (IST)

చంద్రబాబు ఢిల్లీ దీక్షలో బాగానే మేనేజ్ చేశాడు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు - ముఖ్యమైన నేతలకి ప్రత్యేక లాంఛనాలతో ఢిల్లీ తీసుకెళ్లి విజయవంతానికి కృషి చేశారు. ఇక సాధారణ జనాలను సైతం ప్రత్యేక రైళ్లలో తరలించారు. టీడీపీ ఢిల్లీ ధర్నాలో వీఐపీలకు దక్కిన అతిథి మర్యాదలు గురించి ఇప్పుడు ఢిల్లీలో రాజకీయవర్గాలు - మీడియాలో కథలు కథలుగా చెప్పుకుంటున్నారంటే బాబు డాంబికాలు అర్థం చేసుకోవచ్చు..అన్నట్టు ఢిల్లీలో చంద్రబాబు చేపట్టిన నిరసన ధీక్ష ధర్నా ప్రధానంగా ఏపీ ప్రత్యేక హోదా హామీలు విస్మరించిన మోడీని తిట్టడానికే సరిపోయింది. అందరూ ప్రతిపక్ష పార్టీ సభ్యులు - విపక్షాలు తిట్టడాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు లైట్ గానే తీసుకున్నారు. కానీ ఒకే ఒక్కడు.. అదీ బీజేపీ సీనియర్ నేత బాబు సభకు హాజరై సంఘీభావం ప్రకటించి మోడీని తీవ్ర స్థాయిలో విమర్శించడం టీడీపీ సభలో ఉత్సాహం నింపింది. అదే సమయంలో బీజేపీని షాక్ కు గురిచేసింది.

ఢిల్లీలో చంద్రబాబు చేపట్టి ధర్మపోరాట దీక్షలో ప్రధాన హైలెట్ ఏంటంటే శతృఘ్న సిన్హానే. ఒక్కప్పటి బాలీవుడ్ ఫేమస్ నటుడు అయిన ఈయన ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. వర్మ రక్తచరిత్ర సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ పాత్ర కూడా పోషించాడు. ఈయన బీజేపీ ఎంపీగా ఉంటూ ప్రధాని నరేంద్రమోడీ వైఖరి - విధానాలు నచ్చక కొద్దిరోజులుగా ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

ఢిల్లీ చంద్రబాబు దీక్షకు వచ్చిన శతృఘ్న  ప్రసంగం ఉర్రూతలూగించింది. తాను ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన నిలబడ్తానంటూ.. హామీలు విస్మరించేవాడు అసలు నాయకుడే కాదంటూ నరేంద్రమోడీపై డైరెక్ట్ గా మాటల తూటాలు పేల్చాడు. చివర్లో జై ఆంధ్రప్రదేశ్ అంటూ నినదించారు. మోడీపై శతృఘ్న తిడుతున్నంత సేపు టీడీపీ శ్రేణులు - తెలుగు తమ్ముళ్లు ఈలలు - గోలలతో ఎంకరేజ్ చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ - మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్ - దేవెగౌడ - ఢిల్లీ సీఎం కేజ్రవాల్ సహా దేశంలో ప్రధాన ప్రతిపక్షాలు హాజరైన ఈ దీక్ష సభలో శతృఘ్న స్పీచే టీడీపీకి ఆనందం పంచగా.. బీజేపీని ఇరుకున పడేసింది.