నితీశ్...మోదీషాలను మించిపోయారండోయ్!

Sat Aug 12 2017 16:11:33 GMT+0530 (IST)

మనమంతా జేడీయూగా పిలుచుకునే జనతాదళ్ (యునైటెడ్)లో రాత్రికి రాత్రే సంచలన నిర్ణయాలు చోటుచేసుకుంటున్నాయి. మొన్నటి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని మట్టి కరిపించి... వరుసగా మూడో పర్యాయం ఆ రాష్ట్ర సీఎం పగ్గాలను చేజిక్కించుకునే వ్యూహంలో భాగంగా ఆ పార్టీ అధ్యక్షుడి హోదాలో బీహార్ సీఎం నితీశ్ కుమార్ కీలక నిర్ణయమే తీసుకున్నారు. బీహార్ లో అప్పటిదాకా తనకు వైరివర్గంగా కొనసాగుతూ వస్తున్న ఆర్జేడీతో చేతులు కలిపిన జేడీయూ... కాంగ్రెస్ పార్టీని కూడా కలుపుకుని అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. ఫలితంగా వరుసగా మూడో పర్యాయం నితీశ్ కుమార్ బీహార్ సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.

అయితే ఈ ఎన్నికలు జరిగిన కేవలం నెలల వ్యవధిలోనే నితీశ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీగా పోరాడిన బీజేపీతో చేతులు కలిపేందుకు సిద్ధపడ్డ నితీశ్... ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ ను దేశ ప్రధమ పౌరుడిగా కూర్చోబెట్టడంలో కీలక భూమిక పోషించారనే చెప్పాలి. ఉన్నపళంగా బీజేపీతో చేతులు కలిపిన నితీశ్ చర్యను తప్పుబట్టిన ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు - ప్రస్తుతం రాజ్యసభలో జేడీయూపక్ష నేత శరద్ యాదవ్... నితీశ్ ఇదే ధోరణితో ముందుకు వెళితే... జేడీయూ ముక్కలు కాక తప్పదని కూడా హెచ్చరికలు జారీ చేశారు. సుదీర్ఘకాలం పాటు జేడీయూ అధ్యక్షుడిగా ఉన్న శరద్ యాదవ్... జాతీయ రాజకీయాల్లో కీలక నేతగానే చెప్పుకొవాలి. అయితే పార్టీ తీసుకున్న నిర్ణయాల మేరకు శరద్ యాదవ్ కొంతకాలం క్రితమే పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోగా... ఆ స్థానంలో నితీశ్ తిష్ట వేశారు.

ఇప్పుడు పార్టీ అధ్యక్షుడి హోదాలో నితీశ్ తీసుకుంటున్న నిర్ణయాలు అటు సొంత పార్టీ నేతలతో పాటు ఆ పార్టీ మొన్నటిదాకా ప్రధాన భాగస్వామ్య పక్షంగా ఉన్న యూపీఏ కూటమిలోని పార్టీలను కూడా కలవరానికి గురి చేస్తున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ - బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు ఆఫర్ చేసిన బంపర్ ఆఫర్ నేపథ్యంలో నితీశ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభలో జేడీయూ పక్షనేతగా ఉన్న శరద్ యాదవ్ ను ఆ పదవి నుంచి తొలగిస్తూ ఇప్పుడు నితీశ్ తీసుకున్న ఈ నిర్ణయం జాతీయ రాజకీయాల్లో పెను కలకలమే రేపుతోందన్న వాదన వినిపిస్తోంది.

నితీశ్  ఆదేశాల మేరకు నేటి ఉదయం భారత ఉపరాష్ట్రపతిగా నిన్ననే పదవీ బాధ్యతలు స్వీకరించిన ముప్పవరపు వెంకయ్యనాయుడిని కలిసిన జేడీయూ రాజ్యసభ సభ్యులు ఆయనకు ఓ వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ పత్రంలో ఉన్న అంశమేమిటంటే... ఇప్పటిదాకా రాజ్యసభలో జేడీయూ పక్ష నేతగా ఉన్న శరద్ యాదవ్ స్థానంలో తమ పార్టీకి చెందిన సీనియర్ ఎంపీ ఆర్సీపీ సింగ్ ను నియమించాలట. జేడీయూకు ప్రస్తుతం రాజ్యసభలో పది మంది ఎంపీలున్నారు. ఆ పది మందిలో శరద్ యాదవ్ మినహా... మిగిలిన 9 మంది ఎంపీలు ఆ లేఖను అందజేసిన నేపథ్యంలో క్షణకాలంలోనే దానికి వెంకయ్య ఆమోద ముద్ర వేయక తప్పలేదు.

వెరసి నిన్నటిదాకా రాజ్యసభలో జేడీయూ పక్ష నేతగా ఉన్న శరద్ యాదవ్... నితీశ్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయంతో ఆ పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. ఎన్డీఏ కూటమితో జేడీయూ ప్రయాణాన్ని వ్యతిరేకించిన కారణంగానే శరద్ పై ఈ వేటు పడినట్లుగా విశ్లేషణలు సాగుతున్నాయి. ఈ ఒక్క నిర్ణయంతోనే పార్టీలో తన మాటకు వ్యతిరేకంగా గళం విప్పే నేతలను సహించేది లేదంటూ నితీశ్ చెప్పినట్లైంది. అంతేకాకుండా... తమ మాట వినని నేతలపై మోదీషాలు చూపుతున్న కోపం కంటే కూడా నితీశ్ మరింత తీవ్రంగా స్పందించినట్లు కూడా జాతీయ స్థాయిలో విశ్లేషణలు సాగుతున్నాయి.