Begin typing your search above and press return to search.

పక్కింటి అరవింద్ ను పలుకరిస్తే తప్పా భయ్?

By:  Tupaki Desk   |   15 Sep 2019 6:51 AM GMT
పక్కింటి అరవింద్ ను పలుకరిస్తే తప్పా భయ్?
X
గులాబీ బాస్ కు ఏ మాత్రం తగ్గని రీతిలో వ్యవహరిస్తున్నారు గులాబీ నేతలు. అవసరానికి తగ్గట్లుగా మాట్లాడే కేసీఆర్ మాదిరి.. ఆ పార్టీకి చెందిన నేతలు తమ రాజకీయ ప్రయోజనాలకు తగ్గట్లుగా మాట్లాడుతూ.. కొత్త ఎత్తులు వేస్తున్న తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. తాజాగా బోధన్ ఎమ్మెల్యే షకీల్ వ్యవహారం చూస్తే.. ఇదెలా అన్నది ఇట్టే అర్థమైపోతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ నేతల ఇంటికి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు వెళ్లే అవకాశం ఉందా? అంటే సమాధానం ఎవరైనా చెప్పేస్తారు.

అందునా కవితక్కను ఓడించిన అరవింద్ లాంటి నేత ఇంటికి టీఆర్ఎస్ ప్రజాప్రతినిది వెళ్లటం.. మాట్లాడుకోవటం లాంటివి బాహాటంగా అస్సలు చేయరు. అందుకు భిన్నంగా ఆ పని చేయటం ద్వారా.. తాను కోరుకున్న ప్రచారాన్ని సొంతం చేసుకున్నారు షకీల్. అరవింద్ ను కలిసినంతనే..ఆయన బీజేపీలోకి వెళ్లనున్నట్లుగా మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. అంతే.. పుణ్యానికో రోజు వచ్చే కేటీఆర్ ఫోన్ కాల్ వెనువెంటనే రావటం.. ఆయనకున్న సమస్యల్ని తెలుసుకునే ప్రయత్నం లాంటివి జరిగాయి.

కేటీఆర్ ఫోన్ కాల్ తర్వాత ఎంపీ అరవింద్ ను కలిసిన ఉదంతంపై షకీల్ చేస్తున్న వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తాను టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని.. బీజేపీ ఎంపీని కలిస్తే తప్పేమిటని ప్రశ్నించారు. అరవింద్ ఇల్లు తన ఇంటికి పక్కనే ఉంటుందని.. పక్కింటికి వెళ్లటం కూడా తప్పేనా? అని ఆయన ప్రశ్నిస్తున్నారు. రాజకీయాలకు సంబంధం లేకుండా బీజేపీని కలిసినట్లుగా స్పష్టం చేసిన ఆయన.. సరికొత్త ఆరోపణను తెర మీదకు తెచ్చారు.

తనను పార్టీ నుంచి తప్పించేందుకు కుట్రలు పన్నుతున్నారని.. అందులో భాగంగానే తాను బీజేపీలోకి వెళుతున్నట్లుగా ప్రచారం సాగుతోందన్నారు. ఒకవేళ తాను పార్టీ మారాలనుకుంటే అది క్షణంలో పని అని.. తాను పార్టీ నుంచి వెళ్లే ముందు ధైర్యంగా పదవికి రాజీనామా చేసి వెళతానని ఆయన స్పష్టం చేశారు.

తన మాటల్లో శ్లేష ఏదైనా తేడా కొడుతుందేమోనన్న సందేహంతో మరోసారి తాను పార్టీ మారే ఉద్దేశం లేదని చెప్పారు. ఇంత క్లారిటీ ఉన్న పెద్ద మనిషి.. మీడియా మొత్తానికి తెలిసేలా.. రచ్చ రచ్చ జరిగేలా ఎంపీ అరవింద్ ఇంటికి ఎందుకు వెళ్లినట్లు? అన్న ప్రశ్నకు మాత్రం సూటిగా సమాదానం ఇవ్వకపోవటం గమనార్హం.