Begin typing your search above and press return to search.

ట్విస్ట్ లకే ట్విస్ట్... బీజేపీ గూటికి గులాబీ ఎమ్మెల్యే?

By:  Tupaki Desk   |   12 Sep 2019 4:00 PM GMT
ట్విస్ట్ లకే ట్విస్ట్... బీజేపీ గూటికి గులాబీ ఎమ్మెల్యే?
X
తెలుగు రాష్ట్రాల్లో గడచిన కొంత కాలంగా పార్టీ ఫిరాయింపులు ఓ రేంజిలో కొనసాగుతున్నాయి. తెలంగాణలో గడచిన ఆరేళ్లుగా అధికార పార్టీగా కొనసాగుతున్న టీఆర్ ఎస్ రాష్ట్రంలో అసలు విపక్షం అన్నదే ఉండకూడదన్న రీతిలో ఆపరేషన్ ఆకర్ష్ కు తనదైన శైలిలో తెర లేపింది. ఫలితంగా పెద్ద సంఖ్యలో టీడీపీ - కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరారు. ఫర్ ఏ ఛేంజ్ అన్నట్లుగా ఇప్పుడు టీఆర్ ఎస్ నుంచి ఓ ఎమ్మెల్యే బీజేపీ గూటికి చేరేందుకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఇది ఓ రకమైన ట్విస్ట్ అయితే... పార్టీ మారుతున్న ఆ ఎమ్మెల్యేకు చాలా ప్రత్యేకతలే ఉన్నాయి. గులాబీ జెండాపై మొన్నటి ఎన్నికల్లో గెలిచిన సింగిల్ ముస్లిం ఎమ్మెల్యేనే ఇప్పుడు గేటు దూకేందుకు రెడీ అయిపోవడం అంతకు మించిన ట్విస్ట్ గా చెప్పాలి.

తెలంగాణలో అమితాసక్తి రేకెత్తిస్తున్న ఈ విషయం పూర్వపరాల్లోకి వెళితే... గత డిసెంబర్ లో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో టీఆర్ ఎస్ తరపున చాలా మంది ఎమ్మెల్యేలు గెలిచినా... వారిలో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే ఒక్కరు మాత్రమే ఉన్నారు. ఆయనే నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే షకీల్. షకీల్ మరెవరో కాదు... మొన్న సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ సీటు నుంచి చిత్తుగా ఓడిన కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితకు అత్యంత సన్నిహితుడు. అయితే ఎన్నికల్లో కవిత ఓటమి పాలు కావడం, పార్టీ మొత్తంగా చూసిన ఒకే ఒక్క ముస్లిం ఎమ్మెల్యేగా ఉన్న షకీల్... కేబినెట్ లో తనకు బెర్త్ ఖాయమనే అనుకున్నారు. అదే ధీమాతో ఇన్నాళ్లు షకీల్ కొనసాగారు. అయితే కేబినెట్ విస్తరణలో అసలు తనను పట్టించుకోనట్టే పార్టీ అధిష్ఠానం వ్యవహరించడంతో షకీల్ పార్టీ మారే దిశగా సాగుతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలోనే గురువారం షకీల్ నేరుగా బీజేపీ యువ నేత - నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తో భేటీ అయ్యారు. ఈ భేటీ సుధీర్ఘంగానే సాగిన తర్వాత బయటకు వచ్చిన షకీల్.. మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. అటు అరవింద్ కూడా ఈ విషయంపై నోరు మెదపలేదు. మొత్తంగా పార్టీ మారుతున్న క్రమంలోనే షకీల్ సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారన్న విశ్లేషణలు సాగుతున్నాయి. ఒకప్పుడు కవితకు అత్యంత సన్నిహితుడిగానే ఉన్నా, ముస్లింలలో విజయం సాధించిన ఎమ్మెల్యే తాను ఒక్కడినే అయినా కూడా తనను పార్టీ అధిష్ఠానం పట్టించుకోకపోవడంపై షకీల్ తీవ్ర మనస్తాపానికే గురైనట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన బీజేపీలో చేరికకు మార్గం సుగమం చేసుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై షకీల్ ఏమీ మాట్లాడకున్నా... ఆయన సన్నిహిత వర్గాలు మాత్రం త్వరలోనే షకీల్ పార్టీ మారడం ఖాయమన్న వాదన వినిపిస్తోంది. ఇదే జరిగితే... పార్టీ ఫిరాయింపుల్లో జోరు మీదున్న టీఆర్ ఎస్ కు - ఆ పార్టీ అధినేత - సీఎం కేసీఆర్ కు గట్టి ఎదురు దెబ్బ తప్పదన్న విశ్లేషణలు సాగుతున్నాయి.