Begin typing your search above and press return to search.

‘లీకు’ గబ్బులో కేటీఆర్ ఏంది షబ్బీర్

By:  Tupaki Desk   |   31 July 2016 5:06 AM GMT
‘లీకు’ గబ్బులో కేటీఆర్ ఏంది షబ్బీర్
X
రాజకీయాలు మహా చిత్రమైనవి. విషయం ఏదైనా సంబంధం ఉన్నా లేకున్నా.. వెంట్రుక మందంగా చిన్న లెక్క దొరికితే చాలు.. దాన్ని పట్టుకొని తీవ్రమైన ఆరోపణలు చేసేందుకు సైతం వెనుకాడరు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన ఎంసెట్ -2 లీకు వ్యవహారం ఇప్పటివరకూ రాజకీయనేతల ప్రసక్తి లేకుండా సాగుతున్న సంగతి తెలిసిందే. ఇంతపెద్ద కుంభకోణంలో రాజకీయం పాత్ర లేకపోతే.. పాలిటిక్స్ కే అవమానంగా ఫీలయ్యారో ఏమో కానీ.. తెలంగాణకాంగ్రెస్ నేతలు సరికొత్త వాదనను తెర మీదకు తీసుకొచ్చారు.

ఇంత పెద్ద కుంభకోణంలో ప్రభుత్వ పెద్దల పేర్లను లింకేస్తే మరింత రచ్చ కావటంతో పాటు.. ఇదో హాట్ న్యూస్ గా మారుతుందని ఫీలయ్యారో ఏమో కానీ.. తెలంగాణ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎంసెట్ లీకు వ్యవహారంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడు కమ్ మంత్రి అయిన కేటీఆర్ కు సంబంధం ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. అదెలా అన్న ప్రశ్న వేయకుండానే షబ్బీర్ అలీ దీనికి సంబంధించిన ముచ్చట చెప్పుకొచ్చారు.

ఎంసెట్ రిజిస్ట్రేషన్లు.. బయోమెట్రిక్ హాజరు.. ఓఎంఆర్ షీట్ల ప్రింటింగ్ లాంటి కాంట్రాక్టులన్నీ మాగ్నెటిక్ ఇన్ఫోటెక్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీకి ప్రభుత్వం అప్పగించటాన్ని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఈ కంపెనీలన్నీ మంత్రి కేటీఆర్ సన్నిహిత మిత్రుడివని చెబుతున్నారు. ఈ కంపెనీకి ఎంసెట్ 2 కాంట్రాక్ట్ ఇవ్వటానికి జేఎన్ టీయూ అధికారులు కూడా వ్యతిరేకించినట్లుగా గుర్తు చేశారు. టెన్త్.. ఇంటర్ పరీక్షా పత్రాల ప్రింటింగ్ ఇవ్వకుండా బ్లాక్ లిస్ట్ లో పెట్టిన కంపెనీకి ఎంసెట్ ప్రింటింగ్ బాధ్యత ఇవ్వటం ఏమిటంటూ ప్రశ్నించిన షబ్బీర్.. అసలా కంపెనీకి.. కేటీఆర్ కు మధ్యనున్న బంధం ఏమిటో తేల్చాలంటున్నారు.

లీకు కేసును సీబీఐకి అప్పగించాలని.. అలా చేస్తే.. మంత్రి కేటీఆర్ కు.. ఎంసెట్ పరీక్షా పత్రాల ప్రింటింగ్ కాంట్రాక్టు తీసుకున్న కంపెనీకి మధ్యనున్న సంబంధం ఏమిటో తేల్చాలని వారు డిమాండ్చేస్తున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి తమ దగ్గర పూర్తి ఆధారాలుఉన్నాయని.. కేసును సీబీఐకి అప్పగిస్తే వాటిని అందజేస్తామని చెబుతున్న షబ్బీర్ బ్యాచ్.. నిజంగా అంత పక్కా ఆధారాలు ఉంటే మీడియా ఎదుటే బయటపెట్టొచ్చుగా? లీకు వ్యవహారాన్ని రాజకీయ అంశంగా మార్చే క్రమంలోనే.. కేటీఆర్ పేరును తీసుకొచ్చి ఈ వ్యవహారానికి మరింత మసాలా దట్టించటమే షబ్బీర్ అండ్ కో లక్ష్యంగా కనిపిస్తోందన్న విమర్శ వినిపిస్తోంది.