సీజేఈ మీద మహిళ చేసిన ఫిర్యాదులో ఏముందంటే?

Sat Apr 20 2019 15:07:59 GMT+0530 (IST)

దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న జస్టిస్ రంజన్ గొగోయ్ మీద సుప్రీంకోర్టులో పని చేసే 35 ఏళ్ల మహిళ ఒకరు లైంగిక వేధింపుల ఫిర్యాదు చేయటం సంచలనం సృష్టించటం తెలిసిందే. సుప్రీంకోర్టులోని 22 మంది జడ్జిలకు సదరు మహిల ఫిర్యాదు చేశారు.జస్టిస్ గోగాయ్ వేధింపులను తాను ఒప్పుకోకపోవటంతో తనకు పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదురవుతున్నట్లుగా ఆమె ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ఆమె చేసిన ఫిర్యాదులో పేర్కొన్న అంశాల్ని చూస్తే.. సినిమాటిక్ గా కనిపించక మానవు. అత్యున్నత  స్థానాల్లో ఉన్న వారు ఆరాచకం చేస్తున్నట్లుగా కొన్ని సినిమాల్లో చూపిస్తుంటారు.

తాజాగా మహిళ ఫిర్యాదులోని అంశాల్ని చూస్తే.. ఇలాంటి భావనే కలుగక మానదు. ఈ ఇష్యూ మీద తొందరపడి ఒక మాట అదనంగా వ్యాఖ్యానించినా తప్పే అవుతుంది. ఎందుకంటే.. అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తి మీద చేసిన ఆరోపణల్లో నిజం ఎంతన్న విషయాన్ని పూర్తిస్థాయిలో చూసిన తర్వాతే వ్యాఖ్యానించటం సరైన పద్ధతి.

ఇదిలా ఉంటే.. సీజేఈ మీద సదరు మహిళ చేసిన ఫిర్యాదులో ఏముంది?  అఫిడవిట్ లో ఆమె ఏమని ఆరోపణలు చేశారన్నది చూస్తే..

+   ఆగష్టు 2018 లో ఆయన (జస్టిస్ గోగాయ్) ఆఫీసులో నియామకం అనంతరం లైంగిక వేధింపులు చోటు చేసుకున్నాయి. ఈ వేధింపులను  ప్రతిఘటించా. దీంతో  అనుమతి లేకుండా ఒక రోజు సాధారణ సెలవు తీసుకున్న కారణంగా డిసెంబర్ 21 న సర్వీసులనుంచి తొలగించారు.

+  నా మీద ఉన్న అక్కసు నా కుటుంబాన్ని కూడా చుట్టుముట్టింది. ఢిల్లీలో హెడ్ కానిస్టేబుల్స్‌గా పనిచేస్తున్న నా భర్త సోదరుడు డిసెంబరు 28 2018 (పరస్పరం అంగీకారంతో రద్దు చేసుకున్న 2012 నాటి కేసు ఆధారంగా) సస్పెన్షన్ వేటు వేశారు.

+  జనవరి 11 న ప్రధాన న్యాయమూర్తి..ఒక  మహిళా పోలీసు అధికారి  సమక్షంలో సీజేఈ సతీమణికి క్షమాపణలు చెప్పించారు. అలా ఎందుకు చేశారో అర్థం కాలేదు.

+ నా పై అధికారి సూచనలతో నేను క్షమాపణలు చెప్పాను. ఆ సందర్భంగా ఆమె ముక్కును నేలకు రాసి క్షమాపణలు చెప్పాలన్నారు. అలానే ముక్కును నేలకు రాసి సారీ చెప్పారు. అయినా వేధింపులు ఆగలేదు.

+  జూనియర్ కోర్టులో అటెండెంట్ గా చేస్తున్న దివ్యాంగుడైన నా బంధువును సర్వీసు నుంచి తొలగిస్తూ జనవరి 14న నిర్ణయం తీసుకున్నారు. దీనికి కారణం లేదు.

+  రాజస్థాన్ లోని మా గ్రామానికి వెళ్లి నన్ను.. నా భర్తను చీటింగ్ కేసులో విచారించాలంటూ మార్చి 9న ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  2017లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.50వేలు తీసుకొని మోసం చేసిన ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారు.

+  ఇది జరిగిన తర్వాతి రోజున నా భర్త.. బావ.. ఆయన సతీమణి.. ఇతర బంధువును తిలక్ మార్గ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడ 24 గంటల పాటు కాళ్లు.. చేతులకు సంకెళ్లు వేసి ఎలాంటి ఆహారం..నీళ్లు ఇవ్వకుండా ఉంచేశారు. ఈ సందర్భంలో శారీరంగా హింసకు గురి చేయటంతో పాటు.. దారుణ పదజాలంతో తిట్టారు.

+ నేను చేస్తున్న ఆరోపణలకు సంబంధించిన కొన్ని ఆధారాలు.. ఫోటోలను ఫిర్యాదుకు జత చేస్తున్నా. పరిశీలించి చేర్యలు తీసుకోగలరు.