Begin typing your search above and press return to search.

ర్యాష్ డ్రైవింగ్‌ కు ఏడేళ్ల కారాగార‌మేన‌ట‌!

By:  Tupaki Desk   |   23 Feb 2017 5:48 AM GMT
ర్యాష్ డ్రైవింగ్‌ కు ఏడేళ్ల కారాగార‌మేన‌ట‌!
X
మ‌ద్యం మ‌త్తులోనో, లేదంటే ఉర‌క‌లెత్తే ఉత్సాహంతో వాహ‌నాన్ని మితి మీరిన వేగంతో న‌డుపుతున్న యువ‌కులు ఇత‌రుల ప్రాణాల‌ను పొట్ట‌న‌బెట్టుకుంటున్నారు. వారు కూడా ప్ర‌మాదాల బారిన ప‌డుతున్నారు. ర్యాష్ డ్రైవింగ్‌ గా పిలుస్తున్న దీనిని అరిక‌ట్టేందుకు ప్ర‌భుత్వాలు ఎన్ని చ‌ర్య‌లు చేప‌ట్టినా ఏమాత్రం ఫ‌లితం ఉండ‌టం లేదు. ప్ర‌స్తుతం ఇలాంటి ర్యాష్ డ్రైవింగ్ కార‌ణంగా దేశంలో ఏటా 60 వేల మంది ప్రాణాలు గాల్లో క‌లిసిపోతున్నాయి. ఇంత‌మంది ప్రాణాలు పోతుండ‌టానికి కార‌కులుగా మారిన ర్యాష్ డ్రైవ‌ర్ల‌పై మాత్రం ఇప్ప‌టికీ క‌ఠిన శిక్ష‌లు అమ‌లు కావ‌డం లేదు.

క‌ఠిన శిక్ష‌లు ఉంటే క‌దా అమ‌లు చేయ‌డానికి? నిజ‌మే.... మితి మీరిన వేగంతో వాహ‌నాల‌ను న‌డిపి ఇత‌రుల ప్రాణాల‌ను హ‌రించేస్తున్న ర్యాష్ డ్రైవ‌ర్లపై ప్ర‌స్తుతం అమ‌ల్లో ఉన్న చ‌ట్టాల ప్ర‌కారం మ‌హా అయితే రెండేళ్ల జైలు శిక్ష మాత్ర‌మే ఉంది. అయితే ఈ త‌ర‌హా నేరాల‌కు క‌ఠిన శిక్ష‌లు అమ‌లు చేస్తే త‌ప్పించి ఫలితం లేద‌న్న దిశ‌గా కేంద్ర ప్ర‌భుత్వం యోచించింది. అనుకున్న‌దే త‌డ‌వుగా క‌ఠిన కారాగారంతో పాటు సుదీర్ఘ కాలం జైల్లో ఉండేలా కొత్త చ‌ట్టాన్ని తెరపైకి తెస్తోంది. ఇప్ప‌టికే ఈ చ‌ట్టానికి సంబంధించి విధి విధానాల‌ను నిర్దేశించుకున్న కేంద్రం... రాష్ట్ర ప్ర‌భుత్వాల అభిప్రాయాల‌ను కూడా కోరింది.

అత్యంత ప్రాధాన్యం క‌లిగిన అంశ‌మైనందున కేవ‌లం వారంలోగా త‌మ అభిప్రాయాల‌ను తెలియ‌జేయాల‌ని ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను కేంద్రం కోరింది. ఈ చ‌ట్టానికి మెజారిటీ రాష్ట్రాలు కూడా స‌రేనంటే కొత్త చ‌ట్టం అమ‌ల్లోకి వ‌చ్చేసిన‌ట్లే. ఈ కొత్త చ‌ట్టం అమ‌ల్లోకి వ‌స్తే... ర్యాష్ డ్రైవింగ్‌ తో ఇత‌రుల ప్రాణాల‌ను బ‌లిగొనే వారికి గ‌రిష్టంగా 7 ఏళ్ల జైల‌లు త‌ప్ప‌దు. మ‌రి ఈ చ‌ట్టం అమ‌ల్లోకి వ‌స్తేనైనా ర్యాష్ డ్రైవింగ్‌కు యువ‌త స్వ‌స్తి చెబుతుందో? లేదో? చూడాలి

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/