Begin typing your search above and press return to search.

అమెరికాతో భార‌త్ కీల‌క ర‌క్ష‌ణ ఒప్పందం

By:  Tupaki Desk   |   26 March 2017 8:00 AM GMT
అమెరికాతో భార‌త్ కీల‌క ర‌క్ష‌ణ ఒప్పందం
X
రక్షణ సహకారాన్ని మరింతగా విస్తరించుకోవాలని భారత్ - అమెరికా నిర్ణయించుకున్నాయి. సముద్ర భద్రత - ఉగ్రవాద నిరోధంతో సహా పలు ప్రాంతీయ సమస్యలపై కలిసి ముందుకు సాగాలని డిసైడ్ అయ్యాయి. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వాషింగ్టన్‌ లో అమెరికా రక్షణమంత్రి జేమ్స్ మాటిస్‌ తో జరిపిన చర్చల సందర్భంగా ఈ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆంతరంగిక భద్రతా కార్యదర్శి జాన్ కెల్లీ - జాతీయ భద్రతా సలహాదారు హెచ్చార్ మెక్‌ మాస్టర్‌ తోనూ ఆయన సమావేశమయ్యారు. సెనేట్ సాయుధ దళాల కమిటీ చైర్మన్ జాన్ మెక్‌ కెయిన్ - సెనేట్ గూఢచార వ్యవహారాల కమిటీ చైర్మన్ రిచర్డ్ బర్‌ ను కూడా దోవల్ కలుసుకున్నారు. దోవల్ జరిపిన చర్చల ప్రకారం ట్రంప్ ప్రభుత్వ అధికారులు అమితాసక్తి కనబరిచారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. డీమోనిటైజేషన్, జీఎస్టీ బిల్లు గురించి చర్చల్లో ప్రస్తావనకు వచ్చినట్టు తెలిపాయి. భారత్ ఆర్థికాభివృద్ధి అంశాలపై అమెరికా ఆసక్తి చూపిస్తున్నట్టు వెల్లడించాయి.

కాగా, భార‌త్‌ తో బలమైన సంబంధాలను కొనసాగించడమే ట్రంప్ ప్రభుత్వ లక్ష్యమని అమెరికా రక్షణ మంత్రి జేమ్స్ మాటిస్ స్పష్టం చేశారు. రెండు దేశాలూ భద్రతాపరంగా ఉమ్మడి సవాళ్లను ఎదుర్కొంటున్నాయని, కలిసి పనిచేస్తే ఎన్నో ప్రయోజనాలనూ పొందే అవకాశం ఉందని అన్నారు. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో ఆయన పెంటగాన్‌లో సమావేశమై కీలక ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. ప్రాంతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఇరు దేశాలు కలసికట్టుగా ముందుకెళ్లే రీతిలో సరికొత్త మార్గాల్లో ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతో ఉందని దోవల్ ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. ఎప్పటికప్పుడు మైత్రీబంధం కొత్త పుంతలు తొక్కినప్పుడే అన్ని విధాలుగా బలపడే అవకాశం ఉంటుందని అన్నారు.

కాగా, భారత్ భద్రతకు ఏర్పడుతున్న ముప్పు నివారణకు, పసిఫిక్ ప్రాంతంలో పెరుగుతున్న చైనా సైనిక ఆధిపత్యాన్ని సమతూకం చేసేందుకు భారత్‌కు ఎఫ్-16 యుద్ధవిమానాలు సరఫరా చేయాలని ఇద్దరు ప్రముఖ సెనేటర్లు అమెరికా సర్కారుకు విజ్ఞప్తి చేశారు. భారత్‌ తో జరిగే తొలిదశ సంప్రదింపుల్లో ఈ విమానాల సరఫరాకు ప్రాధాన్యం ఇవ్వాలని సెనేటర్లు మార్క్ వార్నర్ (వర్జీనియా), జాన్ కార్నిన్ (టెక్సాస్) అమెరికా రక్షణ, విదేశాంగమంత్రులకు సంయుక్తంగా రాసిన లేఖలో పేర్కొన్నారు. భారత్ యుద్ధ విమానాల శ్రేణిని విస్తరించుకోవాలని చూస్తున్న సంగతి తెలిసిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/