Begin typing your search above and press return to search.

భార‌తంలో ఈ తాలిబాన్ మైండ్ సెట్ ఏంది?

By:  Tupaki Desk   |   16 Jan 2018 4:43 AM GMT
భార‌తంలో ఈ తాలిబాన్ మైండ్ సెట్ ఏంది?
X
పైత్యం అంత‌కంత‌కూ ఎక్కువ అవుతోంది. ఇప్ప‌టివ‌ర‌కూ లేని కొత్త కొత్త వికారాలు ఈ మ‌ధ్య‌న అంత‌కంత‌కూ పెరిగిపోతున్నాయి. మ‌నిషి ఎదుగుతున్న కొద్దీ విశాలంగా ఆలోచించ‌టం మానేసి.. ఇరుగ్గా మారిపోతున్న వైనానికి తాజా ఉదంతం నిద‌ర్శ‌నంగా చెప్పాలి. డిజిట‌ల్ యుగంలో మ‌తం.. కులం.. లాంటి అంశాల్ని ప‌ట్టించుకోవ‌టం మానేసి.. మ‌రింత ఉన్న‌త జీవ‌న ప్ర‌మాణాల కోసం ప్ర‌య‌త్నించాల్సింది పోయి.. ఎవ‌రికి వారు గిరి గీసుకున్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌టం ఏ మాత్రం స‌రికాదు.

హిందూ.. ముస్లిం అంటూ భేద‌భావాన్ని న‌ర‌న‌రాన ఇంకించుకున్న మ‌త‌మౌఢ్యులు అక్క‌డ‌క్క‌డ ఉన్న‌ట్లుగా వార్త‌లు వ‌స్తుండేవి. ఇప్పుడు.. అవ‌న్నీ మ‌న చుట్టూనే ఉన్నాయ‌న్న షాకింగ్ నిజంఈ మ‌ధ్య‌న త‌ర‌చూ బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. మ‌త‌పిచ్చ ఎంత పీక్స్ కు వెళ్లిందంటే.. త‌మ‌కేమాత్రం సంబంధం లేకున్నా.. త‌మ మ‌తానికి చెందిన యువ‌తి.. వేరే మ‌తానికి చెందిన యువ‌కుడితో స్నేహ‌పూర్వ‌కంగా ఫోటో దిగితే. దాన్ని ర‌చ్చ చేయ‌ట‌మే కాదు.. వార్నింగ్ ఇచ్చే వైనం చూస్తే.. అక్క‌డెక్క‌డో ఉన్న తాలిబ‌న్ల‌ను చూసి అస‌హ్యించుకునే మ‌న‌కి.. మ‌న మ‌ధ్య‌లో అలాంటి మైండ్ సెట్ వ‌చ్చేసిన వైనం త‌లుచుకుంటే షాకింగ్ గా అనిపించ‌క మాన‌దు.

తాజాగా ద‌క్షిణ క‌ర్ణాట‌క జిల్లాకు చెందిన ఎస్ఎఫ్ఐ కార్య‌క‌ర్త మాధురి.. ముస్లిం మ‌తానికి చెందిన స్నేహితుడితో క‌లిసి స్నేహ‌పూర్వ‌కంగా ఒక సెల్ఫీ దిగింది. దాన్ని త‌న సోష‌ల్ మీడియా ఖాతాలో పెట్టుకుంది. ఈ ఫోటోపై తీవ్ర అభ్యంత‌రాన్ని వ్య‌క్తం చేశాడో దారిన పోయే దాన‌య్య‌. అరే.. ముస్లిం పోర‌గాడితో ఫోటోలేంది? అంటూ బెళ్తంగ‌డి తాలూకా క‌క్కిరిచి ప్రాంతానికి చెందిన హ‌రీశ్ అనే కుర్రాడు.. మాధురికి వార్నింగ్ మెసేజ్ పంపాడు.

ముస్లిం మ‌తానికి చెందిన యువ‌కుడితో ఫోటో దిగుతావా? నీ సంగ‌తి చూస్తానంటూ వార్నింగ్ ఇవ్వ‌టంతో.. త‌న‌కొచ్చిన మెసేజ్ పై మాధురి స్పందించింది. వెంట‌నే.. త‌నకెదురైన చేదు అనుభ‌వాన్ని పోలీసుల‌కు షేర్ చేసింది. వెంట‌నే రియాక్ట్ అయిన క‌ర్ణాట‌క పోలీసులు మాధురిని బెదిరించిన హ‌రీశ్ ను అదుపులోకి తీసుకున్నారు. అత‌డి సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకొని జైలుకు పంపారు. చ‌ట్ట‌ప్ర‌కారం నిందితుడి మీద చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. ఏమైనా.. అక్క‌డెక్క‌డో ఉండే తాలిబ‌న్ల భావ‌జాలాన్ని మైండ్‌లోకి ఎక్కించుకొని హెచ్చ‌రిక‌లు చేయ‌టం చూస్తే.. మ‌నం ఎక్క‌డికి పోతున్నామ‌న్న ఆందోళ‌న క‌ల‌గ‌టం ఖాయం.