Begin typing your search above and press return to search.

సీమాంధ్రలో ‘టీఆర్ ఎస్’ లాంటిది ఉండి ఉంటే..

By:  Tupaki Desk   |   29 July 2016 9:30 PM GMT
సీమాంధ్రలో ‘టీఆర్ ఎస్’ లాంటిది ఉండి ఉంటే..
X
రాష్ట్ర ప్రయోజనాలు మాత్రమే మనసులో ఉంటే మాటలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలంటే టీఆర్ఎస్ నేతల్ని చూసి నేర్చుకోవాలి. ఎదుటోళ్లు ఎవరు.. వారిది ఏ స్థాయి అన్నది చూసుకోకుండా రాష్ట్రం కోసం.. రాష్ట్ర ప్రజల కోసం దూకుడుగా వెళ్లే తీరు చాలామందికి నచ్చకున్నా.. మొత్తంగా మోసపోయినప్పుడు.. అన్యాయానికి.. వివక్షకు గురి అవుతున్నప్పుడు.. అలాంటి పార్టీ మనకు ఎందుకు లేదన్న భావన కలగటం ఖాయం.

ఇంతకు ముందు ఎప్పుడైనా అనిపించినా.. అనిపించకపోయినా తాజాగా రాజ్యసభలో ఏపీ ప్రత్యేక హోదా అంశంపై జరిగిన చర్చ మొత్తాన్ని చూసిన తర్వాత టీఆర్ఎస్ లాంటి పార్టీ.. కేసీఆర్ లాంటి అధినాయకుడు సీమాంధ్రకు లేకపోవటం ఎంత భారీ నష్టమన్న విషయం ఇట్టే తెలిసిపోతోంది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో కూడా రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున తమ అంగీకారాన్ని పార్లమెంటుసాక్షిగా చెప్పింది లేదు. కానీ.. అందుకు భిన్నంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో పార్టీలన్నీ సానుకూలంగా స్పందించటమే కాదు.. విభజన బిల్లు సమయంలో ప్రధానిగా ఉన్న మన్మోహన్ లాంటి నేత హామీ ఇచ్చిన నేపథ్యంలో హోదా ఇవ్వాలంటూ తేల్చి చెప్పినా.. మోడీ సర్కారు మాత్రం ససేమిరా అనటం స్పష్టంగా కనిపించింది.

జాతీయ స్థాయిలో ఇన్ని పార్టీలు ఒక అంశం మీద మద్దతు పలికిన తర్వాత కూడా ఏపీకి సాయం చేసేందుకు నో అంటున్న మోడీ సర్కారు తీరుపై ఎలా రియాక్ట్ కావాలి? ఎంత తీవ్ర నిరసన వెల్లువెత్తాలి? అన్న ప్రశ్నలు రాక మానవు. కానీ.. సీమాంధ్ర ప్రజల గుండెల్లో బాధ ఉన్నప్పటికీ.. తమ ఆశల్ని.. ఆకాంక్షల్ని గుర్తించి.. తమ కోసం పోరాడే టీఆర్ఎస్ లాంటి పార్టీ లేకపోవటంతో సీమాంధ్రులు తన ధర్మాగ్రహాన్ని మనసులో దాచుకున్నారని చెప్పొచ్చు. కేంద్రం అనుసరిస్తున్న తీరుతో.. ఏపీలో ఉద్యమాలు చెలరేగొచ్చన్న సందేహాన్ని వ్యక్తం చేసిన దానికి తగ్గట్లే.. తమను మొత్తంగా మోసం చేసిన మోడీ సర్కారు మీదా.. బీజేపీ మీద సీమాంధ్రుడు తానేంటో చేతల్లో చేసి చూపించటం ఖాయమని చెప్పొచ్చు.

నిజానికి ఈ రోజు సీమాంధ్రలో టీఆర్ ఎస్ తరహా పార్టీ కానీ ఉండి ఉంటే.. ఈ రోజు రాజ్యసభలో జరిగిన దానికి రేపు ఏపీలో భారీ బంద్ జరిగేది? రాజకీయ నాయకులు తీవ్రస్థాయిలో విరుచుకుపడేవారు. పత్రికలు పతాక స్థాయిలో ఏపీకి జరిగిన అన్యాయం గురించి చెప్పేవి. ఇక.. ఎడిటోరియల్స్ మొత్తం కూడా మోడీ ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ప్రశ్నించేవి.కానీ.. రాజకీయ చైతన్యం తీసుకొచ్చే టీఆర్ ఎస్ లాంటి ఉద్యమపార్టీ సీమాంధ్రలో లేని నేపథ్యంలో రేపటి రోజు.. ఇవాల్టి మాదిరే సాగుతుంది తప్ప మరెలాంటి మార్పు ఉండదనటంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.