Begin typing your search above and press return to search.

త‌న ఫిట్‌నెస్ ర‌హ‌స్యం ఎన్నారైల‌కు చెప్పిన మోడీ

By:  Tupaki Desk   |   19 April 2018 1:02 PM GMT
త‌న ఫిట్‌నెస్ ర‌హ‌స్యం ఎన్నారైల‌కు చెప్పిన మోడీ
X
ఇటీవలి కాలంలో వ‌రుస‌గా విమ‌ర్శ‌ల‌ జ‌డివాన‌లో చిక్కుకుంటున్న ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ఈ ఎదురుదాడికి ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చారు. నిత్యం ఉత్సాహంగా క‌నిపించే మోడీజీ ఫిట్‌ నెస్ ర‌హ‌స్యం ఏంట‌నే ఆస‌క్తి ప‌లువురిలో క‌లిగే సంగ‌తి తెలిసిందే. అదే సందేహం విదేశాల్లోని మ‌న ఎన్నారైల‌కు కూడా వ‌చ్చింది. దీంతో ఈ విమ‌ర్శ‌ల జ‌డివాన‌కు అటు త‌నకు ఎదురైన‌ ప్ర‌శ్న‌కు మోడీ స్పందించారు. త‌న ఫిట్‌నెస్ ర‌హ‌స్యం విమ‌ర్శ‌లేన‌ని వ్యాఖ్యానించారు.

విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ఈ సంద‌ర్భంగా బ్రిటన్ ప్రధాని థెరెసామే ను బుధవారం ఉదయం అల్పాహార సమావేశంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు భారత్-బ్రిటన్ సంబంధాలు - ఉగ్రవాద నిరోధక చర్యలు - ఆన్‌ లైన్ తీవ్రవాదం వంటి పలు అంశాలపై చర్చించారు. అల్పాహార విందుకు వచ్చిన మోడీకి కరచాలనం చేసిన థెరెసా మే లండన్‌ కు స్వాగతం ప్రధానమంత్రి అని చెప్పారు. భారత్ - బ్రిటన్‌ ల మధ్య సహకారాన్ని పెంపొందించేందుకు అవసరమైన మార్గాలపై వారిరువురూ చర్చించారు. థెరెసా మేతో అనేక అంశాలపై చర్చలు ఫలవంతంగా జరిగాయని మోడీ ఆ తరువాత ట్వీట్ చేశారు. అనంత‌రం అక్క‌డి భారతీయుల‌తో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.

ఈ ఇష్టాగోష్టి సంద‌ర్భంగా మోడీకి ఓ అనూహ్య ప్ర‌శ్న ఎదురైంది. `ఇంత బిజీ బిజీగా గ‌డిపేసే మీరు మీ ఫిట్‌ నెస్‌ ను ఎలా కాపాడుకుంటున్నారు? ` అనేది ఆ ప్ర‌శ్న‌. దీనికి మోడీ ఆస‌క్తిక‌రంగా స్పందిస్తూ..నా ఫిట్ నెస్ ర‌హ‌స్యం..నాపై వ‌చ్చే విమ‌ర్శ‌లే అంటూ చ‌మ‌త్క‌రించారు. ` గ‌త రెండు ద‌శాబ్దాలుగా ఇంకా చెప్పాలంటే 2014 నుంచి నేను ప్ర‌త్యేక‌మైన డైట్ పాటిస్తున్నాను. రోజూ ఓ రెండు కిలోల విమ‌ర్శ‌ల‌ను స్వీక‌రించ‌డ‌మే ఆ డైట్‌. ఇలా తీసుకోవ‌డం నేను జాగ‌రుక‌త‌తో వ్య‌వ‌హ‌రిస్తున్నాను. ఇదే నా ఆరోగ్య ర‌హ‌స్యం` అంటూ మోడీ త‌న‌దైన శైలిలో ముక్తాయించారు. త‌నపై వ‌చ్చే విమ‌ర్శ‌ల‌కు తానెప్పుడూ బాధ‌ప‌డ‌టం లేద‌ని పైగా వాటిని సానుకూలంగా స్వీక‌రిస్తుటాన‌ని మోడీ వివ‌రించారు.