ఏమైంది?: నో సెకండ్ లిస్ట్

Sat Aug 12 2017 09:55:13 GMT+0530 (IST)

రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపిన డ్రగ్స్ కేసుకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్య చేశారు ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్.  డ్రగ్స్ విచారణకు సంబంధించి పన్నెండు మంది సినీ ప్రముఖుల జాబితాను విడుదల చేయటంతో సంచలనం రేగింది. విచారణ సందర్భంగా కీలక ఆధారాలు వెల్లడయ్యాయని.. సినీ రంగానికి సంబంధించి మరికొందరిని విచారించేందుకు వీలుగా రెండో జాబితాను విడుదల చేయనున్నట్లుగా వార్తలు వచ్చాయి. అనధికార మాటల్లో రెండో జాబితా అంశాన్ని వెల్లడించటమే కాదు.. రేపో మాపో అన్నట్లుగా చెప్పటం వినిపించింది. రెండో జాబితాలో ఎవరెవరున్నారన్న అంశంపై కూడా వార్తలు వచ్చాయి.ఇదిలా ఉంటే.. విచారణ విషయంలో వేగం మందగించిందని.. సినీ ప్రముఖుల్ని టార్గెట్ చేస్తున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపించాయి. దీనికి తగ్గట్లే.. సినీ ప్రముఖులతో కూడిన రెండో జాబితా విడుదల అంతకంతకూ ఆలస్యమవుతూ వచ్చింది. తాజాగా.. అకున్ చెబుతున్న దాని ప్రకారం రెండో జాబితా అంటూ ఏమీ లేదన్న మాట ఇప్పుడాయన నోటి వెంట రావటం ఆసక్తికరంగా మారింది.

తాజాగా డ్రగ్స్ నియంత్రణపై జరిగిన అవగాహన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న అకున్.. ఇప్పటికే అరెస్ట్ అయిన వారు వెల్లడించిన వివరాల ఆధారంగా రెండో జాబితా ఉంటుందన్న మాటను చెప్పారు. తనపై ఎలాంటి ఒత్తిళ్లు లేవని.. స్వేచ్ఛగా విచారణ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇదంతా నిజమేనని అనుకున్న పక్షంలో.. మొన్నటివరకూ జోరుగా వినిపించిన రెండో జాబితా ఏమైందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.

డ్రగ్స్ వ్యవహారంలో ఇప్పటికే 11 కేసులు నమోదయ్యాయని.. వాటిలో చార్జిషీట్ వేసేందుకు కసరత్తు పూర్తి చేస్తున్నట్లు వెల్లడించారు. విచారణలో భాగంగా సేకరించిన శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపామని.. వాటి రిపోర్ట్స్ కోసం ఎదురుచూస్తున్నట్లు చెబుతున్నారు. ఎప్పుడైతే.. నివేదికలు వస్తాయో ఆ వెంటనే ఛార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు అకున్ చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. డ్రగ్స్ ఉదంతంలో సినీ ప్రముఖులకు సంబంధించిన ముచ్చట ఇకపై దాదాపుగా ఉండదన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.